Share News

కుప్పంలో టీడీపీ కార్యకర్త కుటుంబానికి సాయం

ABN , Publish Date - Nov 28 , 2026 | 06:55 AM

చిత్తూరు జిల్లాలో ప్రమాదవశాత్తు ఎన్నికల అధికారి వాహనం ఢీకొని మృతి చెందిన టీడీపీ కార్యకర్త రాజేంద్ర కుటుంబాన్ని సీఎం చంద్రబాబు ఫోన్‌లో పరామర్శించారు.

కుప్పంలో టీడీపీ కార్యకర్త కుటుంబానికి సాయం

  • కుటుంబీకులతో ఫోన్లో మాట్లాడి పరామర్శించిన సీఎం

  • పార్టీ, ప్రభుత్వం నుంచి రూ. 10 లక్షల చొప్పున సాయం

తిరుపతి, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లాలో ప్రమాదవశాత్తు ఎన్నికల అధికారి వాహనం ఢీకొని మృతి చెందిన టీడీపీ కార్యకర్త రాజేంద్ర కుటుంబాన్ని సీఎం చంద్రబాబు ఫోన్‌లో పరామర్శించారు. శుక్రవారం ఆయన స్వయంగా కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేశారు. రాజేంద్ర మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ధైర్యంగా ఉండాలని సూచించారు. కుటుంబానికి ప్రభుత్వం, పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.10 లక్షలు, పార్టీ నుంచి మరో రూ.10 లక్షలు... వెరసి మొత్తం రూ.20 లక్షలు ఆర్థిక సాయం ఇస్తున్నట్లు సీఎం ప్రకటించారు. కుప్పం మండలంలో వానగుట్టపల్లిలో పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా గురువారం రాత్రి వైసీపీ వర్గీయులు రాళ్ల దాడి నేపథ్యంలో వారి నుంచి తప్పించుకునే క్రమంలో వేగంగా వెళ్లిన ఎన్నికల అధికారి వాహనం తగిలి జంపనూరు గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త రాజేంద్ర తీవ్రంగా గాయపడి మృతి చెందిన విషయం తెలిసిందే.

కాగా ముఖ్యమంత్రి బాధిత కుటుంబాన్ని స్వయంగా ఫోన్‌లో పరామర్శించిన గంటల వ్యవధిలోనే రాజేంద్ర కుటుంబానికి పార్టీ సాయం రూ.10 లక్షల చెక్కు అందింది. కుప్పం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి పీఎస్‌ మునిరత్నం సహా పలువురు నేతలు మృతుడి కుటుంబ సభ్యులకు చెక్‌ అందజేశారు. అండగా నిలిచిన సీఎం చంద్రబాబుకు, రాజేంద్ర కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ‘రాజేంద్ర చాలాకాలంగా టీడీపీకి సేవలందిస్తున్నారు. ఓటేసి ఫలితాల కోసం ఎదురు చూస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు.. కొందరు రాజకీయాల కోసం ఈ మరణాన్ని వాడుకోవడం బాధ కలిగిస్తోంది. రాజేంద్ర మరణానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలి’ అని కుటుంబసభ్యులు కోరారు.

ఈ వార్తలనూ చదవండి:

డీలిమిటేషన్ బిల్లుతో అన్ని రాష్ట్రాలకు న్యాయం.. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు: సీఎం చంద్రబాబు

బిహార్ ఎమ్మెల్యే కూతురి పెళ్లి.. చీపుర్లతో ఊడ్చేంత డబ్బు..

Updated Date - Nov 28 , 2026 | 06:57 AM