Share News

Pensions: కొత్త పెన్షన్ల కోసం ఎదురుచూపులు

ABN , Publish Date - Apr 21 , 2026 | 01:31 AM

కొత్త ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్ల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. వైసీపీ ప్రభుత్వంలో చివరి సంవత్సరం కొత్తవి ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక వాటి గురించి పట్టించుకోలేదు. దరఖాస్తుదారులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

Pensions: కొత్త పెన్షన్ల కోసం ఎదురుచూపులు
పెన్షన్‌ లబ్ధిదారు

అన్నమయ్య, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుతం జిల్లాలో 1,94,168 మంది పెన్షన్‌ లబ్ధిదారులు ఉన్నారు. వారికోసం ప్రతినెలా ప్రభుత్వం రూ.84.19కోట్లు అందజేస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం రాగానే అంతకుముందు వస్తున్న రూ.3వేలను రూ.4వేలకు పెంచింది. వృద్ధాప్య, వితంతు, చేనేత, కల్లుగీత కార్మికులకు రూ.4వేలు, దివ్యాంగులకు రూ.6వేలు, తీవ్రమైన దివ్యాంగులకు రూ.10వేల నుంచి 15వేలు ఇస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు రూ.10వేలు ఇస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో 1,03,276 వృద్ధాప్య, 44677 వితంతు, 22,857 దివ్యాంగ పెన్షన్‌ ఇస్తున్నారు. ఇంకా అభయహస్తం, ఒంటరి మహిళ, డప్పు కళాకారులు ఇలా 26 రకాల పెన్షన్‌ లబ్ధిదారులు ఉన్నారు.

ఊసేలేని కొత్త పెన్షన్లు..

ప్రభ్వుతం సామాజిక పెన్షన్లకు పెద్దపీట వేస్తున్నా కొత్త పెన్షన్ల జోలికెళ్లడం లేదు. జిల్లాలో పలువురు అర్హులు కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రతి వారమూ పీజీఆర్‌ఎ్‌సలో అర్జీలు సమర్పిస్తున్నారు. గడిచిన మూడేళ్లలో 20వేలకు పైగా దరఖాస్తులు వచ్చిన ట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ప్రస్తుతం సచివాలయాల్లో పెన్షన్‌ కోసం దరఖాస్తులు తీసుకోవడం లేదు. ప్రభుత్వ అనుమతి రాగానే తీసుకుంటామని సచివాలయ అధికారులు చెబుతున్నారు. గత ప్రభుత్వంతో పోల్చితే పెన్షన్‌ లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వం ఇస్తున్న మొత్తంఎక్కువగా ఉంటోంది. దీంతో కొత్తపెన్షన్ల మంజూరు పట్ల ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు అధికారవర్గాలుపేర్కొంటున్నాయి.

వస్తున్న పెన్షన్‌ నిలిపేశారు:సుమతి, బండపల్లె, పుంగనూరు

గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నాకు వృద్ధాప్య పెన్షన్‌ వచ్చేది. వైసీపీ ప్రభుత్వ రాగానే తొలగించారు. ప్రభుత్వం మారిన తర్వాత దరఖాస్తు చేసుకోవడానికి రెండుసార్లు సచివాలయానికి వెళ్లాను. సైట్‌ ఓపెన్‌ కాలేదని చెప్పారు.


నా అప్లికేషన్‌ కూడా తీసుకోలేదు: భానుమతి, కాకులారం, పీలేరు

నా భర్త గత ఏడాది మార్చిలో చనిపోయారు. వితంతు పెన్షన్‌ కోసం దరఖాస్తు చేసుకోవానికి సచివాలయానికి వెళ్లాను. ప్రస్తుతం అవకాశం లేదంటూ నా దరఖాస్తు ఫారం కూడా తీసుకోలేదు. నాలుగైదు సార్లు అడిగినా అదే సమాధానం చెప్తున్నారు. -

Updated Date - Apr 21 , 2026 | 01:31 AM