Share News

SIR: పారదర్శకంగా ‘సర్‌’

ABN , Publish Date - Aug 21 , 2026 | 01:30 AM

‘సర్‌’ ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల రోల్‌ అబ్జర్వర్‌ మల్లికార్జున అన్నారు. క్లెయిమ్‌లు, అభ్యంతరాలపై నిబంధనల మేరకు విచారణ చేపట్టాలన్నారు.

SIR: పారదర్శకంగా ‘సర్‌’
రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతున్న పరిశీలకుడు మల్లికార్జున

చిత్తూరు కలెక్టరేట్‌, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): ‘సర్‌’ ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల రోల్‌ అబ్జర్వర్‌ మల్లికార్జున అన్నారు. క్లెయిమ్‌లు, అభ్యంతరాలపై నిబంధనల మేరకు విచారణ చేపట్టాలన్నారు. కలెక్టరేట్‌లో గురువారం ఆయన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. జిల్లాలో సర్‌ ప్రక్రియలో భాగంగా సుమారు 10 శాతం ఓట్లు అన్‌కలెక్టబుల్‌ కేటగిరీలోకి వచ్చినట్లు తెలిపారు. ఇందులో మరణించిన వారు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలిపోయినవారు, ఆచూకీ లేనివారు తదితర కేటగిరీలు ఉన్నాయని వివరించారు. సుమారు 1.34 లక్షల ఓట్లు ముసాయిదా ఓటర్ల జాబితాలోకి రాలేదన్నారు. సుమారు 23 వేల మంది అన్‌మ్యా్‌ప్డ ఓటర్లకు నోటీసులు జారీచేసి విచారిస్తున్నట్లు చెప్పారు. పేరు, వయస్సు, కుటుంబ సంబంధాలు తదితర అంశాల్లో తేడాలున్న 1.10 లక్షల మంది ఓటర్లకు సిస్టమ్‌ ద్వారా అనామలిస్‌ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో 50 మందికిపైగా నోటీసులు అందుకున్న ఓటర్లతో మాట్లాడి, వారు సమర్పించిన డాక్యుమెంట్లు, వారి అభ్యంతరాలు, విజ్ఞప్తులను పరిశీలించినట్లు మల్లికార్జున చెప్పారు. 2000వ సంవత్సరం ఓటర్ల జాబితాలో పేరు ఉన్నప్పటికీ, గత ఎన్నికల జాబితాలో పేరు లేని ఓటర్ల వివరాలను కూడా పరిశీలిస్తున్నామన్నారు. అనంతరం అర్హత ఉన్న ఓటర్లను నిర్ధారిస్తున్నట్లు చెప్పారు. మరణించిన ఓటర్లకు సంబంధించి 99 శాతం పరిశీలన పూర్తయిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌, డీఆర్వో మోహన్‌ కుమార్‌, ఇతర అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు రమేష్‌ బాబు, గంగరాజు, ఎ.శ్రీనివాస్‌, బి.లోకనాథం, కె.బాలసుబ్రహ్మణ్యం, వి.సురేంద్ర కుమార్‌, ఎం.విజయసింహారెడ్డి, దేవినేని యశ్వంత్‌ తదితరులు పాల్గొన్నారు.


‘సర్‌’ను గడువులోగా పూర్తిచేయాలి

ప్రత్యేక సమగ్ర ఓటర్ల సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియను గడువులోగా పూర్తిచేయాలని జిల్లా ఎన్నికల రోల్‌ అబ్జర్వర్‌ మల్లికార్జున అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ నుంచి గురువారం ఆయన ఆర్డీవోలు, ఎంపీడీవోలు, ఏఈఆర్వోలు, ఈఆర్వోలు, బీఎల్వోలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న ప్రక్రియపై సమీక్షించారు. సర్‌ ప్రక్రియ ఎలా జరుగుతోంది? రాజకీయ పార్టీల నుంచి వచ్చిన సూచనలు ఏంటి? క్షేత్రస్థాయిలో బీఎల్వోలు, ఏఈఆర్వోలు నిర్వహిస్తున్న విధులు, నిర్ణీత షెడ్యూల్‌ ప్రకారం హియరింగ్స్‌, క్లెయిమ్స్‌-అభ్యంతరాలు, ఫారాల పరిష్కారం వంటి అంశాలను పరిశీలించడం తన పర్యటన ప్రధాన ఉద్దేశ్యమన్నారు. జిల్లాలో ఇంకా 20 వేల నోటీసులు ఇవ్వాల్సి ఉందన్నారు. కుప్పం నియోజకవర్గంలో ఈ సంఖ్య ఎక్కువగా ఉందన్నారు. ఈనెల 22వ తేదీని గడువుగా తీసుకుని నోటీసులన్నింటినీ అందించాలని సూచించారు. ఒకే కుటుంబీకులు వేర్వేరు పోలింగ్‌ స్టేషన్లలో ఓటర్లుగా ఉన్న వాటినీ సరిదిద్దే చర్యలు చేపట్టాలని సూచించారు. కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌, డీఆర్వో మోహన్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 21 , 2026 | 01:30 AM