Tirupati: ప్రగతి సిటీల జాబితాలో తిరుపతి
ABN , Publish Date - Oct 02 , 2026 | 01:40 AM
కేంద్రప్రభుత్వం ప్రారంభించిన ‘ప్రగతి-50’ సిటీల జాబితాలో రాష్ట్రం నుంచి తిరుపతి, విశాఖపట్నం చోటు దక్కించుకున్నాయి.
తిరుపతి సిటీ, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి) : ఆధ్యాత్మిక నగరిగా గుర్తింపు పొందిన తిరుపతి.. ఇప్పుడు అభివృద్ధి పథంలో మరో కీలక మైలురాయిని అధిగమించనుంది. కేంద్రప్రభుత్వం ప్రారంభించిన ‘ప్రగతి-50’ సిటీల జాబితాలో రాష్ట్రం నుంచి తిరుపతి, విశాఖపట్నం చోటు దక్కించుకున్నాయి.కేంద్ర ప్రభుత్వ ప్రగతి సిటీ ప్రాజెక్టు కింద తిరుపతికి లభించిన గుర్తింపు నగర అభివృద్ధికి కొత్త దిశానిర్దేశం చేయనుంది. ఇప్పటికే ఆధ్యాత్మిక, పర్యాటక, విద్యా, వైద్య రంగాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన నగరం.. ఇకపై మౌలిక వసతుల కల్పన, పట్టణ ప్రణాళిక, ఆధునిక నగర నిర్మాణంలోనూ కీలక పాత్ర పోషించనుంది.
ప్రగతి సిటీలు : దేశంలోని ఇతర నగరాలకు ఆదర్శంగా నిలిచేలా అత్యున్నత పారిశుధ్య ప్రమాణాలు, ఆధునిక మౌలికసదుపాయాలతో తీర్చిదిద్దడమే ప్రగతి సిటీల ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్ 2.0 కింద కేద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో ప్రగతి నగరాల అభివృద్ధి జరగనుంది. నగర పరిశుభ్రత, ఘనవ్యర్థాల నిర్వహణ, వ్యర్థ జలాల నిర్వహణ, పారిశుధ్య మౌలిక సదుపాయాలు, పౌరుల భాగస్వామ్య, పచ్చదనం తదితర రంగాల్లో సమగ్ర అభివృద్ధికి ఈ ప్రాజెక్టు దోహదపడనుంది. తిరుపతిని మెంటార్‌గా తీసుకుని దక్షిణ ప్రాంతంలోని పట్టణాలు అభివృద్ధి దిశగా అడుగులు వేసేందుకు అవకాశం కలగనుంది.
తిరుపతి ప్రస్థానంలో మరో కొత్త అధ్యాయం - జయకృష్ణ, నగరపాలక సంస్థ కమిషనర్
ఒకవైపు శ్రీవారి దర్శనార్థం నిత్యం లక్షలాది మంది భక్తులు తరలివచ్చే నగరంగా, మరోవైపు వేగంగా విస్తరిస్తున్న పట్టణంగా తిరుపతి మారుతోంది. ఈ నేపథ్యంలో ప్రగతి సిటీగా ఎంపిక కావడం నగర భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి బాటలు వేసినట్టే. కేంద్ర ప్రభుత్వ గుర్తింపుతో తిరుపతి ప్రస్థానంలో మరో కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. ప్రగతి సిటీ జాబితాలో చేరినందుకు ఆనందంగా ఉంది. దక్షిణ ప్రాంతంలోని ఇతర పట్టణాలకు మనమే నమూనాగా నిలిచే అవకాశం ఏర్పడింది. దీని పూర్తిస్థాయి మార్గదర్శకాలు మరో వారం రోజుల్లో రానున్నాయి.