Share News

Fire accident : గడ్డి లారీకి మంటలు

ABN , Publish Date - Mar 21 , 2026 | 12:02 AM

గడ్డి తరలిస్తున్న మినీ లారీకి కరెంటు తీగలు తగిలి.. మంటలు అంటుకున్నాయి. దీంతో వాహనం దగ్ధమైంది. ఈ ఘటన శుక్రవారం రాత్రి వెదురుకుప్పం మండలం దామరకుప్పం రైస్‌మిల్‌ ఇండ్లు వద్ద చోటుచేసుకుంది.

Fire accident : గడ్డి లారీకి మంటలు
మంటల్లో మినీ లారీ (ఇన్‌సెట్‌) కాలిపోయిన వాహనం

వెదురుకుప్పం, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): గడ్డి తరలిస్తున్న మినీ లారీకి కరెంటు తీగలు తగిలి.. మంటలు అంటుకున్నాయి. దీంతో వాహనం దగ్ధమైంది. ఈ ఘటన శుక్రవారం రాత్రి వెదురుకుప్పం మండలం దామరకుప్పం రైస్‌మిల్‌ ఇండ్లు వద్ద చోటుచేసుకుంది. పలమనేరుకు చెందిన రాజేంద్ర నాయుడుపేటలో వరి గడ్డి కొని.. పెనుమూరు సమీపం పులిగుంటీశ్వరస్వామి ఆలయం వద్దకు మినీ లారీలో తీసుకొస్తున్నారు. వెదురుకుప్పం మండలం దామరకుప్పం రైస్‌మిల్‌ ఇండ్లు వద్ద ఈ వాహనం రోడ్డు పక్కకు దిగడంతో పైన ఉన్న విద్యుత్‌ తీగలు గడ్డికి తగిలాయి. దీంతో మంటలు రాజుకున్నాయి. దీన్ని గమనించి డ్రైవర్‌ రాజేంద్ర వాహనాన్ని రోడ్డుపై ఆపేయకుండా.. కొంత దూరం వచ్చి.. రోడ్డు పక్కన బీడు భూమిలో నిలిపారు. అప్పటికే వామనంలో దగ్ధమవుతున్న గడ్డిని చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. టీడీపీ మండలాధ్యక్షుడు పి.మోహన్‌మురళి అక్కడికి చేరుకుని రెండు ట్యాంకర్లతో నీళ్లు.. ఓ ఎక్స్‌కవేటర్‌ను తెప్పించారు. స్థానికుల ద్వారా మంటలను ఆర్పడానికి ప్రయత్నించారు. ఇంతలో అగ్నిమాపక సిబ్బంది వచ్చారు. రాత్రి 9 గంటల వరకు మంటలు అదుపు కాలేదు. కానీ, ఎక్కువ నష్టం జరగకుండా చర్యలు చేపట్టారు. ఈ ప్రమాద సమయంలో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడి వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ఈ ఘటనలో రూ.70 వేల గడ్డితో పాటు మినీ లారీ కాలిపోయింది. ఇదే దారిలో ఈనెల ఒకటో తేది నుంచి శుక్రవారం వరకు ఎనిమిది ట్రిప్పులను తీసుకొచ్చినట్లు డ్రైవరు రాజేంద్ర తెలిపారు. ఈ ఎనిమిదో ట్రిప్పు తీసుకెళ్తూ రోడ్డు పక్కకు దిగడంతో విద్యుత్‌ తీగలు తగిలి మంటలు వ్యాపించాయన్నారు.

Updated Date - Mar 21 , 2026 | 12:02 AM