Kanipakam: గజవాహనంపై గజముఖుడు
ABN , Publish Date - Sep 21 , 2026 | 12:47 AM
కాణిపాక వినాయకస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి గజ వాహనంపై ఉత్సవర్లు భక్తులను కటాక్షించారు. ఈ కార్యక్రమానికి కాణిపాకానికి చెందిన వన్నియ నాయకర్ వంశస్థులు ఉభయదారులుగా వ్యవహరించారు.
ఐరాల(కాణిపాకం), సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): కాణిపాక వినాయకస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి గజ వాహనంపై ఉత్సవర్లు భక్తులను కటాక్షించారు. ఈ కార్యక్రమానికి కాణిపాకానికి చెందిన వన్నియ నాయకర్ వంశస్థులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఉదయం ఉభయదారుల ఆధ్వర్యంలో మూలవిరాట్‌కు అభిషేకం జరిగింది. రాత్రి ఉభయ వరస రావడంతో ఉత్సవర్లకు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం సిద్ధి, బుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామి ఉత్సవమూర్తులను గజ వాహనంపై ఉంచి మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో ఊరేగించారు. ఈవో పెంచలకిషోర్, సూపరింటెండెంట్లు కోదండపాణి, శ్రీధర్‌బాబు, ఆలయ ఇన్‌స్పెక్టర్లు బాలాజీనాయుడు, రవి, ఉభయదారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
రథోత్సవానికి ప్రత్యేక ఏర్పాట్లు
సోమవారం నాటి రథోత్సవానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో పెంచలకిషోర్ తెలిపారు. ప్రధాన ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలు, అరటిబోదెలతో అలంకరించినట్టు తెలిపారు. ఈ రథోత్సవంలో ఆలయ సిబ్బంది వివిధ రకాల వేషధారణలు వేస్తారన్నారు. రథోత్సవానికి వేల సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో స్వామి దర్శనానికి ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశామన్నారు.
కాణిపాకంలో నేడు
సోమవారం రథోత్సవం (తేరు) జరగనుంది. కాకర్లవారిపల్లెకు చెందిన దివంగత యతిరాజులునాయుడు జ్ఞాపకార్థం ఆయన కుమార్తె మీనాకుమారి, కాణిపాకానికి చెందిన మాజీ వీఎం కె.పూర్ణచంద్రారెడ్డి, దివంగత చంద్రశేఖర్‌రెడ్డి జ్ఞాపకార్థం ఆయన కుమారుడు హరిప్రసాద్‌రెడ్డి ఉభయదారులుగా వ్యవహరించనున్నారు.