Share News

Mango: స్థిరమైన మామిడి వినియోగమే సమస్యకు పరిష్కారం

ABN , Publish Date - Jul 11 , 2026 | 01:46 AM

రైతులు, ట్రేడర్లు, గుజ్జు పరిశ్రమల యాజమాన్యాలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు స్థిరమైన మామిడి వినియోగమే పరిష్కారమని భారత ఆహార పరిశోధన సంస్థ (ఐసీఏఆర్‌-సీఐఎ్‌సఎహెచ్‌) డైరెక్టర్‌ డాక్టర్‌ టి.దామోదర్‌ అన్నారు.

Mango: స్థిరమైన మామిడి వినియోగమే సమస్యకు పరిష్కారం
చిత్తూరు మండీలో మామిడి కాయల్ని పరిశీలిస్తున్న కేంద్ర బృంద సభ్యులు

చిత్తూరు సెంట్రల్‌, జూలై 10(ఆంధ్రజ్యోతి): రైతులు, ట్రేడర్లు, గుజ్జు పరిశ్రమల యాజమాన్యాలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు స్థిరమైన మామిడి వినియోగమే పరిష్కారమని భారత ఆహార పరిశోధన సంస్థ (ఐసీఏఆర్‌-సీఐఎ్‌సఎహెచ్‌) డైరెక్టర్‌ డాక్టర్‌ టి.దామోదర్‌ అన్నారు. తోతాపురి రైతులు, ఇతర సమస్యలపై అధ్యయనం చేయడానికి ఈయన నేతృత్వంలోని బృందం శుక్రవారం జిల్లాలో పర్యటించింది. వీరు కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ను కలిసి, జిల్లాలోని తోతాపురి మామిడి రైతుల సమస్యలు, ఇతర అంశాలపై సమీక్షించారు. ఒకట్రెండు రోజుల్లో సమస్య పరిష్కారం కాదని టి.దామోదర్‌ అభిప్రాయపడ్డారు. మామిడి (తోతాపురి) పరిశ్రమను ఎలా పటిష్టం చేయాలనేదే ప్రధాన లక్ష్యమన్నారు. మార్కెట్‌ను బలోపేతం చేయడం, జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌ పరిణామాలు కీలకమన్నారు. వీటిపై మంత్రులతోనూ మరోసారి సమీక్షించి, అన్ని వర్గాల వారికి న్యాయం చేసేలా కేంద్రానికి నివేదిస్తామన్నారు. అంతకుముందు చిత్తూరు మార్కెట్‌ యార్డును పరిశీలించిన కేంద్ర బృందం.. రైతుల నుంచి ఏ రకాలను ఎంత కు కొంటున్నారు? ఏ ధరకు విక్రయిస్తున్నారు? ఏ ప్రాంతాలకు ఎగుమతులు చేస్తున్నారంటూ ట్రేడర్లను అడగి తెలుసుకున్నారు. ఆపై గంగాధరనెల్లూరులోని ఎంపీడీవో కార్యాలయంలో మామిడి రైతులతో ముఖాముఖి నిర్వహించారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, ఇతర ఆహార అవసరాల్లో మామిడి ఉత్పత్తులను వినియోగించాలని రైతులు కోరారు. గుజ్జు పరిశ్రమల సకాలంలో మామిడిని అన్‌లోడ్‌ చేయకపోవడంతో నష్టపోతున్నామని, గిట్టుబాటు ధర ఇవ్వడం లేదన్నారు. తర్వాత జైన్‌ ఫ్యాక్టరీని సందర్శించిన బృందం ఉత్పత్తి, నిల్వలు, ఎగుమతులు, ధరలు తదితర అంశాలను పరిశీలించారు. చివరగా బంగారుపాళ్యంలోని మార్కెట్‌ యార్డునూ కేంద్ర బృందం పరిశీలించింది.


పేరుకుపోతున్న గుజ్జు నిల్వలు

అంతర్జాతీయంగా నెలకొన్న వివిధ పరిణామాలతో ఎగుమతుల్లేక ఏటా రెండు లక్షల టన్నుల గుజ్జు ఫ్యాక్టరీల్లో నిల్వ ఉంటోందని నిర్వాహకులు చెప్పారు. ఎగుమతుల్లో మధ్యవర్తిత్వానికి కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. చిత్తూరులోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో గుజ్జు పరిశ్రమల యాజమాన్యాలతో కేంద్ర బృందం ముఖాముఖి నిర్వహించింది. 2015 ఏపీ ఇండస్ట్రియల్‌ పాలసీ అమలు, నేషనల్‌ బోర్డు ఏర్పాటు, ధరల నియంత్రణ మండలి ఏర్పాటు చేయాలని నిర్వాహకులు కోరారు. గుజ్జు పరిశ్రమలకు వర్కింగ్‌ క్యాపిటల్‌, సాఫ్టు లోన్‌, మద్దతు ధర అమలు తదితర అంశాలపై బృందం సమీక్షించింది. పలువురు రైతు సంఘాల నేతలు కేంద్ర బృందానికి వినతి పత్రాలు సమర్పించారు. ఈ సమావేశంలో కేంద్ర బృంద సభ్యులు బెంగళూరులోని ఐసీఏఆర్‌-సీఐఎ్‌సఎహెచ్‌ నుంచి ఫ్రూట్‌ క్రాప్‌ హెడ్‌ డాక్టర్‌ ఎం.శంకరన్‌, లక్నో ఐసీఏఆర్‌-సీఐఎ్‌సఎహెచ్‌ నుంచి ప్రిన్సిపల్‌ సైటిస్టు డాక్టర్‌ హెచ్‌ఎ్‌స సింగ్‌, ఏపీలోని రాజుపేట వైఎస్సార్‌ హార్టికల్చర్‌ యూనివర్సిటీ నుంచి కాలేజ్‌ ఆఫ్‌ హార్టికల్చర్‌ ప్రొఫసర్‌ డాక్టర్‌ డి.శ్రీనివాసరెడ్డి, స్టేట్‌ హార్టికల్చర్‌ డైరెక్టర్‌చే నామినేట్‌ చేసిన జిల్లా ఉద్యాన అధికారి సతీ్‌షతో పాటు ఉద్యానశాఖ ఏడీ కోటేశ్వరరావు, మార్కెటింగ్‌ శాఖ ఏడీ పరమేశ్వరన్‌, చిత్తూరు మార్కెట్‌ కమిటీ కార్యదర్శి హిందుమతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 11 , 2026 | 01:46 AM