Sir: సర్ ఓ లక్ష ఓట్లు తొలగొచ్చు
ABN , Publish Date - Jul 11 , 2026 | 01:50 AM
జిల్లాలో జరుగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా పెద్దఎత్తున ఓట్లు తొలగిపోనున్నాయి. జిల్లాలో మొత్తం 13.40 లక్షల ఓట్లు ఉండగా, సుమారు లక్ష ఓట్ల వరకు (7.5 శాతం) తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీన్ని అధికారులు కూడా ధ్రువీకరించారు. దీంతో ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులు స్పందించి ‘సర్’ ప్రక్రియలో భాగస్వామ్యం కాకుంటే తీవ్ర నష్టం జరిగే ప్రమాదముంది. ఈ ప్రక్రియకు మిగిలిందిక నాలుగు రోజులే. దీనికి అనుగుణంగా ఆయా పార్టీల నాయకులు సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది.
మిగిలిందిక నాలుగు రోజులే
బీఎల్వోలే కాదు.. ఓటర్లూ బాధ్యత వహించాల్సిందే
చిత్తూరు, ఆంధ్రజ్యోతి: జిల్లాలో మొత్తం 13,40,126 మంది ఓటర్లు ఉండగా, శుక్రవారం రాత్రి నాటికి 13,39,847 ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ (99.98శాతం) చేశారు. పంపిణీ చేసినవాటిలో 10,87,403 (81.14శాతం) ఫారాలను డిజిటలైజేషన్ చేశారు. ఇంకా 210,915 ఫారాల్ని ఈ నాలుగు రోజుల్లో డిజిటలైజేషన్ చేయాల్సి ఉంది. కాగా, సర్ ప్రక్రియలో భాగంగా జిల్లాలోని మొత్తం ఓట్లలో లక్ష ఓట్లు తొలగిపోనున్నాయి. ఈ విషయాన్ని కలెక్టర్ సుమిత్‌కుమార్ ప్రకటించారు. మరణించినవారు, శాశ్వతంగా వలస వెళ్లినవారు, రెండుచోట్ల ఓటు ఉన్నవారు, బీఎల్వోలు వచ్చినప్పుడు ఇంటి వద్ద ఆబ్సెంట్ అయినవారు.. ఇలా వివిధ కేటగిరీల్లో ఓట్ల తొలగింపు జరగనుంది. అన్ని కేటగిరీల్లో ఇప్పటివరకు 41808 ఓట్లను తొలగించగా, ఈ నాలుగు రోజుల్లో ఆ సంఖ్య సుమారు లక్షకు చేరుతుందని కలెక్టరే స్వయంగా చెప్పారు. చిత్తూరులో అత్యధికంగా 10215 ఓట్లు ప్రస్తుతానికి తొలగించగా, నాలుగు రోజుల్లో ఈ సంఖ్య రెట్టింపు కానుంది. పలమనేరులో 8021, నగరిలో 7532, పూతలపట్టు 6998, కుప్పం 4626, జీడీనెల్లూరు 4416 ఓట్లను ప్రస్తుతానికి తొలగించగా.. ప్రక్రియ ముగిసేనాటికి ఈ సంఖ్య ఇంకా పెరగనుంది.
ఓటరు జాబితాలో పేరు లేకుంటే..?
14వ తేదీన సర్ ప్రక్రియ పూర్తయ్యాక ముసాయిదా ఓటరు జాబితాను అధికారులు విడుదల చేస్తారు. పోలింగ్ కేంద్రాల వారీగా రాజకీయ పార్టీ ప్రతినిధులకు అందిస్తారు. అందులో పేరు లేకుంటే ఈ నెల 21 నుంచి 29వ తేదీ వరకు మళ్లీ ఫాం-6 ద్వారా ఓటు హక్కుకు కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇలా జిల్లాలో ప్రతి నెలా 15 నుంచి 20 వేల మంది 18 ఏళ్లు నిండి కొత్తగా ఓటు హక్కు కోసం అర్హత సాధిస్తున్నారు. లక్ష ఓట్లు తొలగిపోయినా, 15-20 వేల ఓట్లు కొత్తగా రానున్నాయి.
వెనుకబడిన కుప్పం
‘సర్’ ప్రక్రియలో సీఎం చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం వెనుకబడి ఉంది. మిగిలిన నియోజకవర్గాలతో పోల్చుకుంటే ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్‌లో చివరి స్థానంలో ఉంది. గుడుపల్లె 82.10 శాతం, శాంతిపురం 78.90, కుప్పం రూరల్ 78.26, రామకుప్పం 77.61 శాతం మాత్రమే డిజిటలైజేషన్ అయ్యాయి. మిగిలిన మున్సిపాలిటీలతో పోల్చుకుంటే కుప్పం మున్సిపాలిటీ కూడా 74.97 శాతంతో వెనుకబడి ఉంది.
మిగిలిన ప్రాంతాల్లో ఎలా ఉందంటే?
చిత్తూరు, పలమనేరు, కుప్పం మున్సిపాలిటీల్లో డిజిటలైజేషన్ ప్రక్రియ 75శాతమే పూర్తయింది. అదే, మండల స్థామండలాల్లో ఫారాల డిజిటలైజేషన్ 85 నుంచి 90 శాతానికి చేరుకున్నాయి. ఇందులో పలమనేరు రూరల్ 89.66 శాతం, నగరి రూరల్ 88, ఎస్‌ఆర్‌పురం 87.75, విజయపురం 87.83 శాతం చొప్పున డిజిటలైజేషన్‌తో ముందంజలో ఉన్నాయి. మొత్తం 1511 మంది బీఎల్వోల్లో ఇంకా 960 మంది 85 శాతం కంటే తక్కువగా డిజిటలైజేషన్ చేశారు.
14లోగా ‘సర్’ను పూర్తిచేస్తాం: కలెక్టర్
చిత్తూరు కలెక్టరేట్, జూలై 10 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ఎన్నికల సంఘం గడువు జూలై 14లోగా జిల్లాలో ‘సర్’ ప్రక్రియను పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని కలెక్టర్ సుమిత్‌కుమార్ తెలిపారు. కలెక్టరేట్‌లో శుక్రవారం ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు. ‘ఈ నెల 14వ తేదీలోగా ప్రజలు ఎన్యుమరేషన్ ఫారాల్ని నింపి బీఎల్వోలకు నేరుగా అందించాలి. లేదంటే ముసాయిదా ఓటరు జాబితాలో పేర్లు ఉండవు. ప్రక్రియ పూర్తయ్యాక పోలింగ్ కేంద్రాల వారీగా రాజకీయ పార్టీల ప్రతినిధులకు జాబితా అందిస్తాం. 21న ముసాయిదా జాబితా విడుదల చేస్తాం. ఆ జాబితా చూసుకుని ఇబ్బందులుంటే 21 నుంచి 29వ తేదీ వరకు సరిచేసుకోవడానికి మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు. 1511 మంది బీఎల్వోలు క్షేత్రస్థాయిలో సమర్థంగా పనిచేసి వివరాలు సేకరిస్తున్నారు. వారిని అభినందిస్తున్నా. ఎన్యుమరేషన్ ఫారాలు దగ్గరుండి నింపుతున్నారు. సర్వర్ పనిచేయకుంటే రాత్రిళ్లు ఇళ్లల్లో వివరాలను అప్‌లోడ్ చేస్తున్నారు. 151 మంది 97 శాతం ఫారాల్ని డిజిటలైజేషన్ చేశారు.’ అన్నారు. అసిస్టెంట్ కలెక్టర్ వెంకటేష్, డీఆర్వో మోహన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
80 శాతం డిజిటలైజేషన్ పూర్తి
‘సర్’ కార్యక్రమంలో ఓటరు వివరాల డిజిటలైజేషన్ 80.18 శాతానికి చేరుకుందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సుమిత్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో శుక్రవారం ఆయన గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్షించారు. నాయకులు, బూత్ స్థాయి అధికారుల సమన్వయంతో అత్యంత పారదర్శకంగా ప్రత్యేక సంక్షిప్త ఓటరు సవరణ జాబితా ప్రక్రియ నిర్వహించాలని కోరారు. ఇప్పటివరకు 20,284 మంది మరణించిన ఓటర్లు, 8907మంది శాశ్వతంగా వలస వెళ్లినవారు, 7590 మంది ఇతర ప్రాంతాల్లో ఇప్పటికే ఓటర్లుగా నమోదైన వారు, 893 మంది గైర్హాజరు, 108 ఇతర కేసులు.. ఇలా మొత్తం 37782 మందిని అన్‌కలెక్టబుల్‌గా గుర్తించామని వివరించారు. తుది పరిశీలన అనంతరం ఈ సంఖ్యలో మార్పులు ఉండే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఎన్నికల విభాగ తహసీల్దార్ రాజేంద్ర, డీటీ పన్నీర్‌సెల్వం, టెక్నికల్ సపోర్టర్ ఉమాపతి, పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.