Sand: ఇసుక అక్రమ రవాణా
ABN , Publish Date - Apr 21 , 2026 | 01:34 AM
చిత్తూరు రూరల్ మండలంలో ఇసుక అక్రమ వ్యాపారం జోరుగా సాగుతోంది. పట్టపగలే ఇసుక డంప్‌చేసి మరీ అక్రమంగా తరలిస్తున్నారు.
చిత్తూరు మండలం నుంచి తమిళనాడు, కర్ణాటకకు ఇసుక అక్రమ రవాణా
చిత్తూరు రూరల్, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు రూరల్ మండలంలో ఇసుక అక్రమ వ్యాపారం జోరుగా సాగుతోంది. పట్టపగలే ఇసుక డంప్‌చేసి మరీ అక్రమంగా తరలిస్తున్నారు. పాలంతోపు, శెట్టింతంగళ్ ప్రాంతాల్లో ఇసుక డంపింగ్ యార్డును ఏర్పాటు చేసుకున్నారు. అక్కడి నుంచి తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు ఇసుకను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. రాత్రిళ్లు టిప్పర్ల ద్వారా గమ్యస్థానాలకు చెరవేస్తున్నారు. ఇవన్నీ బహిరంగంగా తెలిసినా పోలీసులు, రెవెన్యూ, మైన్స్ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తమిళనాడులో భలే డిమాండ్
తమిళనాడులోని వంకల్లో ఇసుక తోడకూడదన్న నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చర్యలూ తీవ్రంగా ఉంటాయక్కడ. దీంతో అక్కడ తమిళనాడు సరిహద్దులోని చిత్తూరులో దొరికే ఇసుకకు డిమాండ్ ఎక్కువ. ఒక లారీ ఇసుక ధర రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షలపైమాటే పలుకుతోంది. దీంతో అక్రమార్కులు రాత్రిళ్లు అక్రమంగా రాష్ట్రం దాటిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పుడు పగల్లో కూడా రవాణా మొదలుపెట్టారు. లారీలో సరుకేదో తెలియని విధంగా ప్యాక్ చేస్తున్నారు. గతంలో లారీ టైరు పేలడంతో ఇసుక అక్రమ రవాణా గుట్టు రట్టయింది.
బీఎన్‌ఆర్ పేట వంక ఖాళీ
బీఎన్‌ఆర్ పేట వంకలో ఇసుక మొత్తం ఖాళీ అయింది. గత ప్రభుత్వం అనుమతి పేరుతో నిబంధనలకు విరుద్ధంగా 10 నుంచి 15 మీటర్లు లోతులో ఉన్న ఇసుకను సైతం వదలకుండా ఎస్కవేటర్లతో తవ్వి, లారీలకు లోడ్‌చేసి అమ్మేస్తున్నారు. దీనివల్ల భూగర్భ జలాలు అడుగంటాయి. నదిలోని బావులు, పైపులైన్లు పైకి తేలిపోయాయి. గత ప్రభుత్వంలో వీటిపై ప్రశ్నించిన స్థానికులపైనే అప్పటి పోలీసులు కేసులు కూడా నమోదు చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కొంత మంది కూటమి నాయకులతో చేరిన వైసీపీ నాయకులు చిత్తూరు రూరల్ మండలంలోని పాలూరు వద్ద స్టాక్ పాయింట్ ఏర్పాటు చేసుకొని రాత్రిళ్లు విచ్చలవిడిగా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. దీనిని అడిగే ధైర్యం కూడా స్థానికులు చేయడం లేదు.
జిల్లా యంత్రాంగానికి తెలిసే జరుగుతోందా..?
జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న బీఎన్‌ఆర్ పేట, అనంతాపురం వద్ద ఇంత తతంగం జరుగుతున్నా అటు పోలీసు.. ఇటు రెవెన్యూ ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. వీరందరికీ తెలిసే జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. వారికి తెలియకుండా ఇంత పెద్ద ఎత్తున అక్రమాలు జరగదంటున్నారు. ఇప్పటికైనా అధికారులు నిద్రమత్తు వీడి ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
సీఎంవోకు ఫిర్యాదు
చిత్తూరు రూరల్ మండలంలో విచ్చలవిడిగా జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవాలని స్థానిక కూటమి నేతలు సీఎంవోకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాలి.