Share News

Kanipakam: కాణిపాక ఆలయానికి రూ.2.39 కోట్ల ఆదాయం

ABN , Publish Date - Nov 11 , 2026 | 12:13 AM

కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి ఆలయం ఆధ్వర్యాన మంగళవారం నిర్వహించిన వివిధ రకాల టెండర్ల ద్వారా రూ.2,39,76,400 ఆదాయం లభించింది.

Kanipakam: కాణిపాక ఆలయానికి రూ.2.39 కోట్ల ఆదాయం
ఆస్థాన మండపంలో టెండర్లు నిర్వహిస్తున్న అధికారులు

ఐరాల(కాణిపాకం), నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి ఆలయం ఆధ్వర్యాన మంగళవారం నిర్వహించిన వివిధ రకాల టెండర్ల ద్వారా రూ.2,39,76,400 ఆదాయం లభించింది. ఆలయ ఆస్థాన మండపంలో ఈవో పెంచలకిషోర్‌ ఆధ్వర్యంలో బహిరంగ వేలం, సీల్డ్‌, ఆన్‌లైన్‌ టెండర్లను నిర్వహించారు. ఈ టెండర్లలో స్వామివారికి నిర్వహించే పాలాభిషేకానికి పాలు, పూలమాలలు సరఫరా చేసే హక్కురూ.9,35,000 హెచ్చు పాటదారుడు కైవసం చేసుకున్నారు. అలాగే వాహన పూజకు వచ్చే వాహనాలను శుభ్రపరిచే హక్కు రూ.13,00,000కు, సంప్రదాయ వస్త్రాలు విక్రయించే హక్కును పాటదారుడు రూ.6,12,900కు చేజిక్కించుకున్నారు. నేతి దీపాలను విక్రయించే హక్కు రూ.75,00,000కు.. వాహన పూజ సామగ్రిని విక్రయించే హక్కును రూ.60,08,000.. వినాయక సదన్‌ వద్ద క్యాంటీన్‌ నిర్వహణకు రూ.27,13,000.. చెవి, ముక్కు పోగులు కుట్టుకునే హక్కును రూ.4,61,500.. విఘ్నేశ్వర కల్యాణ మండపం వద్ద బంకు నిర్వహణకు రూ.4,41,000 చొప్పున హెచ్చుపాటదారులు దక్కించుకున్నారు. వీటి కాల పరిమితి సంవత్సరం ఉంటుంది. అలాగే 2027 సంవత్సర స్వామివారి క్యాలెండర్లు ముద్రించి..విక్రయించేహక్కును రూ.40,05,000లకు దక్కించుకున్నారు. దీని కాల పరిమితి ఐదు నెలలు మాత్రమే. ఈ కార్యక్రమంలో డీఈవో సాగర్‌బాబు, చిత్తూరు ఏసీ చిట్టెమ్మ, ఏఈవో ధనంజయ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 11 , 2026 | 12:13 AM