Land: 53,917 ఎకరాల ఫ్రీహోల్డ్ భూములకు మోక్షం
ABN , Publish Date - Sep 11 , 2026 | 01:47 AM
ఎట్టకేలకు ఫ్రీహోల్డ్ భూముల సమస్యలకు పరిష్కారం లభించింది. సక్రమంగా ఫ్రీహోల్డ్ చేసుకున్న భూములకు రిజిస్ర్టేషన్లు చేసుకునే అవకాశాన్ని కల్పించారు.
కలెక్టర్ల సదస్సులో ప్రకటించిన మంత్రి అనగాని
అక్రమంగా చేసుకున్న 1,05,409 ఎకరాలు హోల్డ్‌లోనే
చిత్తూరు, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): ఎట్టకేలకు ఫ్రీహోల్డ్ భూముల సమస్యలకు పరిష్కారం లభించింది. వైసీపీ నేతలు పెద్దఎత్తున ఫ్రీహోల్డ్ భూముల విషయంలో అక్రమాలు చేసుకుని రూ.కోట్లు వెనకేసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొత్తం ఫ్రీహోల్డ్ భూముల్ని రిజిస్ర్టేషన్లు కాకుండా నిలిపేసింది. దీంతో సక్రమంగా ఫ్రీహోల్డ్ చేసుకున్న భూముల రైతులూ ఇబ్బందులు పడ్డారు. సుమారు 25 నెలల నిరీక్షణకు కూటమి ప్రభుత్వ పెద్దలు తెరదించారు. సక్రమంగా ఫ్రీహోల్డ్ చేసుకున్న భూములకు రిజిస్ర్టేషన్లు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. గురువారం అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఈ విషయాన్ని ప్రకటించారు. గురువారం నుంచే ఇది అమల్లోకి వస్తుందని ఆయన ప్రకటించినా.. శుక్రవారం ఉత్తర్వులు విడుదలయ్యే అవకాశముంది. జిల్లాలో సక్రమంగా ఫ్రీహోల్డ్ జరిగిన 53,917 ఎకరాలకు రిజిస్ర్టేషన్ అవకాశం కల్పిస్తుండగా.. 10 వేల మంది రైతులకు మేలు కలగనుంది.
అసలేం జరిగిందంటే?
జిల్లాలో మొత్తం 1,59,327.5 ఎకరాలను ఫ్రీహోల్డ్‌గా మార్చగా, వాటిలో 1,05,409.7 ఎకరాలను అక్రమంగా చేసుకున్నట్లు తేలింది. దీంతో మొత్తం 1,59,327.5 ఎకరాల రిజిస్ర్టేషన్లనూ ప్రభుత్వం నిలిపేసింది. అక్రమ ఫ్రీహోల్డ్ భూములను ఏం చేయాలి? చేసిన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి? వంటి అంశాల్లో నిర్ణయం తీసుకునేందుకు మంత్రివర్గ ఉపసంఘం, కమిటీలను ఏర్పాటు చేసింది. నిర్ణయం తీసుకునే విషయాన్ని రెండు నెలల చొప్పున వాయిదాలు వేస్తూనే వస్తున్నారు. ఇలా రిజిస్ర్టేషన్లు ఆపేసి ఇప్పటికే 25 నెలలు కావొస్తోంది. క్షేత్ర స్థాయిలో నిజమైన లబ్ధిదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండడంతో సక్రమంగా ఫ్రీహోల్డ్ అయిన భూములకు క్లియరెన్సు ఇచ్చేందుకు ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది.
‘ఫ్రీహోల్డ్’లో అక్రమాలు జరిగాయిలా..
పేదలకు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసిన వ్యవసాయ భూములను (డీకేటీ, ఎక్స్ సర్వీ్‌సమెన్ వంటి పట్టాలు), 20 ఏళ్లు నిండాక అమ్ముకోవచ్చని 2023లో వైసీపీ ప్రభుత్వం ఫ్రీహోల్డ్ ఆదేశాలిచ్చింది. దీంతో వైసీపీ నేతలు ముందుగానే పేదల నుంచి తక్కువ ధరకు ఆ భూములను కొనుగోలు చేసి, ప్రభుత్వ ఆదేశాలు వచ్చాక ఫ్రీహోల్డ్‌గా మార్చుకున్నారు. 20 ఏళ్లు పూర్తికాని పట్టాల్ని కూడా ఫ్రీహోల్డ్ చేసుకున్నారు. అక్రమ జాబితాలో అభ్యంతరాలున్న పోరంబోకు భూములూ ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక వీటిపై విచారణ చేసి, మొత్తం ఫ్రీహోల్డ్ భూముల రిజిస్ర్టేషన్లను ఆపేస్తూ 2024 ఆగస్టు 10న ఆదేశాలిచ్చింది.
ఈ మూడు మండలాల్లో పెద్దఎత్తున అక్రమాలు..
రాష్ట్రంలో ఫ్రీహోల్డ్ అక్రమాలు పెద్దఎత్తున జరిగిన టాప్ 10 మండలాలను గతేడాది ప్రభుత్వం విడుదల చేస్తే 4, 5, 10 స్థానాల్లో వి.కోట, కుప్పం, బంగారుపాళ్యం మండలాలున్నాయి. వీటితో పాటు చిత్తూరు అర్బన్, గుడిపాల, తవణంపల్లె, ఐరాల, గుడుపల్లె మండలాల్లోనూ పెద్దఎత్తున అక్రమాలు జరిగాయి.
వి.కోట మండలంలో మొత్తం 12,226 ఎకరాల డీకేటీని ఫ్రీహోల్డ్ భూములుగా మార్చితే.. వాటిలో అత్యధికంగా 9,243 ఎకరాలు అక్రమమని తేలాయి.
కుప్పం మండలంలో 8674 ఎకరాల్ని ఫ్రీహోల్డ్ చేస్తే, 8400 ఎకరాలు అక్రమంగా చేశారు.
బంగారుపాళ్యంలో 8042 ఎకరాల్లో 7198 ఎకరాలు అక్రమమే.
ఫ్రీహోల్డ్ చేసిన మొత్తం భూములు1.59 లక్షల ఎకరాలు
అక్రమంగా చేసుకున్నవి 1.05 లక్షలు
నిబంధనల మేరకు చేసినవి 53,917