Share News

QR code: ఆటోలపై క్యూఆర్‌ కోడ్‌

ABN , Publish Date - May 31 , 2026 | 12:39 AM

జిల్లాలోని ఆటోలకు ప్రత్యేక గుర్తింపు సంఖ్య(యూనిక్‌ పోలీ సు ఐడెంటిఫికేషన్‌ నంబరు) కేటాయిస్తోంది. క్యూఆర్‌ కోడ్‌ కలిగిన స్టిక్కర్లను ఆటోలకు అతికిస్తోంది.

QR code: ఆటోలపై క్యూఆర్‌ కోడ్‌
ఆటో డ్రైవర్లకు క్యూఆర్‌కోడ్‌ కార్డు అందిస్తున్న ఎమ్మెల్యే భానుప్రకాష్‌, ఎస్పీ తుషార్‌డూడీ తదితరులు

చిత్తూరు అర్బన్‌/నగరి, మే 30(ఆంధ్రజ్యోతి): మార్కెట్‌ లేదా మరెక్కడికైనా వెళ్లాలంటే ఎక్కువ మందికి ఆటోలే ప్రధాన ఆధారం. ఆటో ఎక్కాక గమ్యస్థానంచేరే వరకు ప్రయాణికులకు తమ భద్రతపై ఆందోళన. ఈ తరహా టెన్షనుకు చెక్‌ పెట్టి, ప్రయాణికులకు భద్రత కల్పించేందుకు జిల్లా పోలీసుశాఖ జన విశ్వాస్‌ అనే ఓ విసూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ప్రజల్లో భద్రతాభావం, పోలీసుశాఖపై విశ్వాసాన్ని బలోపేతం చేసేందుకు ముందడుగు వేసింది. ఈక్రమంలోనే జిల్లాలోని ఆటోలకు ప్రత్యేక గుర్తింపు సంఖ్య(యూనిక్‌ పోలీ సు ఐడెంటిఫికేషన్‌ నంబరు) కేటాయిస్తోంది. క్యూఆర్‌ కోడ్‌ కలిగిన స్టిక్కర్లను ఆటోలకు అతికిస్తోంది. ప్రమాదం లేదా సంఘటన జరిగిన వెంటనే ఆ క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయగానే ఆటో యజమాని, డ్రైవర్‌, అడ్రస్‌, ఫోన్‌ నంబరు లాంటి వివరాలను తక్షణమే పోలీసులు తెలుసుకునే వీలుంటుంది. దీనివల్ల ఆటో డ్రైవర్లు అప్రమత్తమవుతారని, నేరాల నియంత్రణ, ట్రాఫిక్‌ నిర్వహణ సులభమవుతుందని పోలీసులు భావిస్తున్నారు. నగరిలో శనివారం ప్రయాగాత్మకంగా ఎస్పీ తుషార్‌ డూడీ, ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్‌ ఈకార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆటోలకు స్టిక్కర్లను అతికించారు. యూనిఫామ్‌, క్యూఆర్‌కోడ్‌ కార్డులను అందించారు. సీఐ మల్లికార్జునరావు, సీఐలు,ఎ్‌సలు, తహసీల్దార్‌ రవికుమార్‌, ఎంపీడీవో వాణి తదితరులు పాల్గొన్నారు. కాగా జిల్లాలో సుమారు 7వేల ఆటోలున్నాయి. చిత్తూరులోనే 3500 తిరుగుతున్నాయి. కుప్పం, పలమనేరు, పూతలపట్టు, జీడీ నెల్లూరు, నగరి ప్రాంతాలతో పాటు మండల కేంద్రాల్లో 3500 ఆటోలు ఉంటాయని రవాణాశాఖ అధికారుల అంచనా.

Updated Date - May 31 , 2026 | 12:39 AM