Share News

Medical : ప్రజాసేవ చేయాల్సిందే

ABN , Publish Date - Jan 21 , 2026 | 02:55 AM

ప్రభుత్వ రాయితీలతో (వైద్య విద్య) పీజీ పూర్తిచేసిన వారు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజాసేవ చేయాలని సబార్డినేట్‌ లెజిస్లేషన్‌ కమిటీ చైర్మన్‌ తోట త్రిమూర్తులు స్పష్టంచేశారు.

Medical : ప్రజాసేవ చేయాల్సిందే
సమావేశంలో మాట్లాడుతున్న శాసనసభ కమిటీ చైర్మన్‌ తోట త్రిమూర్తులు

సబార్డినేట్‌ లెజిస్లేషన్‌ కమిటీ చైర్మన్‌ తోట త్రిమూర్తులు

తిరుపతి(కలెక్టరేట్‌), జనవరి 20(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ రాయితీలతో (వైద్య విద్య) పీజీ పూర్తిచేసిన వారు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజాసేవ చేయాలని సబార్డినేట్‌ లెజిస్లేషన్‌ కమిటీ చైర్మన్‌ తోట త్రిమూర్తులు స్పష్టంచేశారు. ఈ నిబంధనలు ఉల్లంఘించిన 57మందికి నోటీసులిచ్చామన్నారు. మరికొంతమంది వద్ద వారి వైద్యవిద్యకు ప్రభుత్వం పెట్టిన ఖర్చును రికవరీ చేస్తున్నామన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే వైద్యవిద్య డిగ్రీ రద్దుతో పాటు ప్రభుత్వం భరించిన రాయితీలను వడ్డీ సహా వసూలు చేస్తున్నామన్నారు. అవసరమైతే రూ.50లక్షల వరకు జరిమానా విధిస్తున్నామన్నారు. కలెక్టరేట్‌లో మంగళవారం మధ్యాహ్నం వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖకు సంబంధించి జీవోల అమలుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. పీహెచ్‌సీ, సీహెచ్‌వోలలో ఖాళీలు లేకపోవడంవల్ల వైద్యవిద్యను పూర్తి చేసిన వారికి ఉద్యోగవకాశాలు కల్పించలేని పరిస్థితి ఉందన్నారు. ఇప్పటికే 60 వేల మంది హెచ్‌ఐవీ బాధితులకు పింఛన్లు ఇస్తుండగా, త్వరలో మరో 50వేలమందికి పంపిణీ చేస్తామన్నారు. హెచ్‌ఐవీ బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. యాత్రికుల తాకిడి ఎక్కువగా ఉన్న తిరుపతితో పాటు గ్రామాలు, జాతర జరిగే ప్రాంతాల్లో హెచ్‌ఐవీపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అంతకు మునుపు కలెక్టర్‌ వెంకటేశ్వర్‌, వైద్యఆరోగ్యశాఖ అధికారులతో కమిటీ సుదీర్ఘంగా సమీక్షించింది. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు(ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు), నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి, బండారు శ్రావణి, భానుప్రకాష్‌, కన్నా లక్ష్మీనారాయణ, వెంకటకృష్ణారెడ్డి, రాంగోపాల్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, డీఎంఈ రఘునందన్‌, కలెక్టర్‌ వెంకటేశ్వర్‌, కమిటీ ఇన్‌చార్జి విశ్వనాథం, ప్రాజెక్టు డైరెక్టర్‌ నీలకంఠారెడ్డి, డీఆర్వో నరసింహులు, డీఎంహెచ్‌వో బాలకృష్ణనాయక్‌తో పాటు స్విమ్స్‌, రుయా, పద్మావతి ఆస్పత్రులు, మెడికల్‌ కళాశాలల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jan 21 , 2026 | 02:55 AM