Share News

Anganwadi: కనీస వేతనం రూ.26 వేలివ్వండి

ABN , Publish Date - Jul 11 , 2026 | 01:39 AM

సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు అంగన్వాడీ కార్యకర్తలకు కనీస వేతనం కింద రూ.26 వేలు ఇవ్వాలని ఆ సంఘ ఏపీ అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు లలిత, షకీలా డిమాండు చేశారు.

Anganwadi: కనీస వేతనం రూ.26 వేలివ్వండి
చిత్తూరు కలెక్టరేట్‌ వద్ద ఆందోళన చేస్తున్న అంగన్‌వాడీలు

చిత్తూరు అర్బన్‌, జూలై 10 (ఆంధ్రజ్యోతి): సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు అంగన్వాడీ కార్యకర్తలకు కనీస వేతనం కింద రూ.26 వేలు ఇవ్వాలని ఆ సంఘ ఏపీ అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు లలిత, షకీలా డిమాండు చేశారు. అంగన్వాడీలకు కనీస వేతనాలు, పెన్షన్‌, పీఎఫ్‌, ఈఎ్‌సఐని అమలు చేయాలని కోరుతూ శుక్రవారం కలెక్టరేట్‌ ముందు ధర్నా చేశారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్లకు హామీ ఇచ్చి రెండేళ్లవుతున్నా ఇంతవరకు పట్టించుకోవడం లేదన్నారు. పనిభారం పెంచే నవచేతన యాప్‌ను రద్దు చేయాలని, పెండింగ్‌లోని టీఏ బిల్లులను విడుదల చేయాలని కోరారు. లేదంటే విడతల వారీగా ఆందోళనలు చేపడతామన్నారు. ధర్నాలో ఆ సంఘం సీఐటీయూ నేతలు నేతలు గంగరాజు, గిరిధర్‌ గుప్తా, అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌ నేతలు మమత, సుజనితో పాటు వివిధ ప్రాజెక్టుల నుంచి యూనియన్‌ నేతలు, వర్కర్లు పాల్గొన్నారు.

తిరుపతిలో..

తిరుపతి(కలెక్టరేట్‌), జూలై 10 (ఆంధ్రజ్యోతి): తమకు కనీస వేతనాలివ్వాలంటూ అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు కలెక్టరేట్‌ వద్ద శుక్రవారం ధర్నా చేశారు. రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందారపు మురళి, జిల్లా ప్రధానకార్యదర్శి జయచంద్ర మాట్లాడారు. అంగన్‌వాడీ వర్కర్లకు రూ.24వేలు, హెల్పర్లకు రూ.21వేలను వేతనాలు ఇవ్వడంతోపాటు సంక్షేమ పథకాలను వర్తింపజేయాలని డిమాండ్‌ చేశారు. పనిభారానికి కారణమైన నవచేతన యాప్‌ను రద్దు చేయాలన్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పద్మలీల, వాణిశ్రీ మాట్లాడుతూ, వేతనంతో కూడిన మెడికల్‌ లీవ్‌ ఇవ్వాలని, పెండింగ్‌లో ఉన్న మినీ సెంటర్లను మెయిన్‌ సెంటర్లుగా అప్‌గ్రేడ్‌ చేసి.. గ్రాట్యూటీ అమలు చేయాలని కోరారు. అధికారులకు వినతిపత్రం ఇచ్చే క్రమంలో అంగన్‌వాడీలు రోడ్డుపైకి రావడాన్ని పోలీసులు అడ్డుకోవడంతో కొంతసేపు వాగ్వాదం జరిగింది. అనంతరం డీఆర్వో నరసింహులుకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం, నాయకులు బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మి, బుజ్జి, వేణుగోపాల్‌, అంగన్‌వాడీలు రాణి, శ్రీలక్ష్మి, రమాదేవి, పుష్ప, ధనమ్మ, నాగరాజమ్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 11 , 2026 | 01:39 AM