Dwakra: డ్వాక్రాలో అక్రమాలకు అడ్డుకట్ట
ABN , Publish Date - Apr 21 , 2026 | 01:37 AM
డ్వాక్రా నిధులు పక్కదారి పట్టకుండా ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకుంది. ఆధునిక టెక్నాలజీ ద్వారా చెక్ పెట్టేందుకు సిద్ధమైంది. ఇందుకోసం రూపొందించిన యాప్‌ను ఈనెలనుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చింది.
పుస్తకాల్లో చేతిరాతలకు చెల్లుచీటి
ఆన్‌లైన్ వివరాలతో అక్రమాలకు అడ్డుకట్ట
సూళ్లూరుపేట, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): డ్వాక్రా నిధులు పక్కదారి పట్టకుండా ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకుంది. ఆధునిక టెక్నాలజీ ద్వారా చెక్ పెట్టేందుకు సిద్ధమైంది. ఇందుకోసం రూపొందించిన యాప్‌ను ఈనెలనుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చింది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ) ద్వారా డ్వాక్రా సంఘాలకు బ్యాంకు లింకేజి, స్త్రీనిధి, ఉన్నతి వివిధ మహిళా సాధికారత పథకాల ద్వారా ఏటా రూ.2వేల కోట్లకు పైగా రుణాలు అందుతున్నాయి. సభ్యుల నిరక్షరాస్యత, అవగాహన లేమిని ఆసరా చేసుకొని వెలుగు విభాగంలో కొంతమంది అక్రమాలకు పాల్పడుతున్నారు. నిధులను స్వాహా చేస్తున్నారు. ఈ వ్యవహారాలు తలనొప్పిగా మారుతున్నాయి. ఇటువంటి అక్రమాలకు చెక్ పెట్టేందుకు, డ్వాక్రా సంఘాల ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకతకు ప్రాధాన్యతనిచ్చేందుకు ప్రభుత్వం ‘మన డబ్బులు-మన లెక్కలు’ యాప్‌ను అమలులోకి తెచ్చింది.
గతంలో అన్నీ చేతిరాతలే...
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో డ్వాక్రా సంఘాలకు విడుదలైన నిధుల జమా ఖర్చుల వివరాలన్నీ పుస్తకాల్లో నమోదు చేసేవారు. గత ఆర్థిక సంవత్సరం వరకు ఈ విధంగానే చేశారు. డీఆర్‌డీఏ ఉద్యోగులు, వెలుగు సిబ్బంది, బ్యాంకు అధికారులు కలిసి డ్వాక్రా రుణాలను పక్కదారి పట్టించినా సంఘాలకు తెలిసేది కాదు. సభ్యులు రుణం ఎన్ని వాయిదాల్లో చెల్లించాలి, ఎంత చెల్లిస్తున్నారు, ఎప్పుడు రుణం తీసుకున్నారు వంటి వివరాలు స్పష్టంగా తెలియక అక్రమాలకు అవకాశం ఉండేది. ఇవన్నీ ప్రభుత్వం దృష్టికి రావడంతో దిద్దుబాటు చర్యలు చేపట్టింది. డ్వాక్రా సంఘాల బలోపేతంపై ప్రత్యేక దృష్టి సాఽరించింది. ఈనెల నుంచే రుణాల మంజూరు మొదలుకొని రుణవాయిదాల చెల్లింపుల వరకు అన్ని రకాల లావాదేవీలు ‘మన డబ్బులు-మన లెక్కలు’ యాప్ ద్వారానే నిర్వహించాలని ఆదేశించింది.
గత జూన్‌లో ప్రయోగాత్మకంగా అమలు
వాస్తవానికి ఈ యాప్ గత ఏడాది జూన్ నుంచీ ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. యాప్ వినియోగం, పనిచేసే తీరుపై డీఆర్‌డీఏ వెలుగు సిబ్బంది, డ్వాక్రా సభ్యులకు శిక్షణ నిర్వహించారు. ఈ ఏడాది మార్చి నెలాఖరుకు ఈ ప్రక్రియ పూర్తి చేశారు. ఈనెల నుంచి జిల్లా వ్యాప్తంగా విడుదలవుతున్న నిధుల వివరాలను యాప్‌లోనే నమోదు చేస్తున్నారు. డ్వాక్రా సభ్యురాలి వ్యక్తి గత ఆర్థికపరమైన సమాచారం నుంచి రుణాల వరకు అన్ని వివరాలనూ యాప్‌లో పొందుపరుస్తున్నారు.
జిల్లాలో గ్రామ ఐక్య సంఘాలు: 1,077
స్వయం సహాయక సంఘాలు: 28,781
సంఘాల్లో సభ్యుల సంఖ్య: 3,13,957