Share News

Kanipakam: వరసిద్ధుడికి పూలంగి సేవ

ABN , Publish Date - Oct 02 , 2026 | 01:34 AM

కాణిపాకంలోని ప్రత్యేక ఉత్సవాలలో భాగంగా గురువారం వరసిద్ధుడికి పూలంగి సేవ నిర్వహించారు.

Kanipakam: వరసిద్ధుడికి పూలంగి సేవ
వరసిద్ధుడికి నిర్వహించిన ఊంజల్‌ సేవ

ఐరాల(కాణిపాకం), అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): కాణిపాకంలోని ప్రత్యేక ఉత్సవాలలో భాగంగా గురువారం వరసిద్ధుడికి పూలంగి సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేలూరుకు చెందిన దివంగత రాజమాణిక్యం నాయుడు జ్ఞాపకార్థం వారి కుమారులు, కాణిపాకానికి చెందిన కె.రాధాకృష్ణన్‌ ఉభయదారులుగా వ్యవహరించారు. ఉదయం ఉభయదారుల ఆధ్వర్యంలో మూల విరాట్‌కు అభిషేకం నిర్వహించారు. స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో తయారు చేసిన భారీ గజ మాలలతో, పుష్ప, గరిగ, వెండి కిరీటాలతో అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. పుష్ప సోయగంలో స్వామిని దర్శించుకోవడానికి వందలాదిగా భక్తులు విచ్చేశారు. గురువారం రాత్రి సిద్ధి, బుద్ధి సమేత వినాయకస్వామి ఉత్సవర్లను అలంకార మండపంలోని కల్యాణ వేదికపై ఉంచారు. స్వామికి ఏక, నక్షత్ర, పంచ, కుంభ, రథ హారతితో పూజలు నిర్వహించారు. ఇక, ఊంజల్‌ సేవకోసం సువాసన వెదజల్లే పుష్పాలతో ప్రత్యేకమైన ఊయలను అలంకరించారు. ఉత్సవమూర్తులను ఊయలలో ఉంచి ఊంజల్‌ సేవ నిర్వహించారు. ప్రత్యేక ఉత్సవాలలో అలసిపోయిన స్వామిని సేద తీర్చడానికి ఈ సేవ నిర్వహిస్తారు. ఇక, సిద్ధి, బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి ఉత్సవర్లను ప్రధాన ఆలయంలోని ప్రాకారంలో మూడు ప్రదక్షణలను నిర్వహించారు. ఈ ప్రాకారోత్సవంలో స్వామిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా హాజరయ్యారు. ఆయా కార్యక్రమాల్లో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్‌ మణినాయుడు, ఏఈవోలు రవీంద్రబాబు, ధనపాల్‌, సూపరింటెండెంట్లు వాసు, కోదండపాణి, ఆలయ ఇన్‌స్పెక్టర్లు రవి,బాలాజీనాయుడు, ఉభయదారులు పాల్గొన్నారు.

కాణిపాకంలో నేడు

శుక్రవారం కామధేను వాహన సేవ జరగనుంది. కాణిపాకానికి చెందిన నాయీబ్రాహ్మణ వంశస్థులు ఉభయదారులుగా వ్యవహరించనున్నారు.

Updated Date - Oct 02 , 2026 | 01:34 AM