Elephant: అమ్మో.. ఒంటరి ఏనుగు
ABN , Publish Date - Apr 11 , 2026 | 01:13 AM
రామకుప్పం మండలంలోని నారాయణపురం తండా సమీప పొలాల్లో గురువారం రాత్రి ఒంటరి ఏనుగు సంచారం స్థానికులకు ఆందోళన కలిగించింది.
రామకుప్పం, ఏప్రిల్ 10(ఆంధ్రజ్యోతి): రామకుప్పం మండలంలోని నారాయణపురం తండా సమీప పొలాల్లో గురువారం రాత్రి ఒంటరి ఏనుగు సంచారం స్థానికులకు ఆందోళన కలిగించింది. పదిహేను రోజులుగా అటవీ ప్రాంతంలో జంట ఏనుగులు సంచరిస్తూ అటవీ సమీప ప్రాంత ప్రజలకు కంటిపై కునుకు లేకుండా చేశాయి. వాటిలో ఓ ఏనుగు రెండు రోజుల క్రితం కుప్పం మండలంలోని కంగుంది అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. మరో ఏనుగు మాత్రం రామకుప్పం మండలం ననియాల అటవీ ప్రాంతంలోనే తిష్ఠ వేసింది. గురువారం రాత్రి అది ననియాల అడవి నుంచి నారాయణపురంతండా అడవి గుండా ఆ గ్రామ సమీప పొలాల్లోకి వచ్చింది. ఓ రైతుకు చెందిన వరి పొలాన్ని పాక్షికంగా ధ్వంసం చేసింది. విషయం తెలుసుకున్న అధికారులు బేస్‌క్యాంపు సిబ్బందితో అక్కడికు చేరుకుని పెద్దటార్చిలైట్లు వేస్తూ, టపాకాయలు పేల్చుతూ దాన్ని అడవిలోకి తరిమేశారు. అది ప్రస్తుతం ననియాల అడవిలోని ననియాల, ననియాలతండా, ఎస్.గొల్లపల్లె, పంద్యాలమడుగు, నారాయణపురంతండా, రామాపురం తండాల వైపు వచ్చే అవకాశాలున్నాయని అటవీశాఖ అధికారులు తెలిపారు.