Mines: తిరుపతి జిల్లాకు గనులొచ్చాయ్
ABN , Publish Date - Jan 02 , 2026 | 01:11 AM
తాజాగా జరిగిన పునర్విభజనతో తిరుపతి జిల్లాకు గనులొచ్చాయి. అన్నమయ్య జిల్లాలోని రైల్వే కోడూరును విలీనం చేయడంతో ముగ్గురాళ్ల గనులు, బెరైటీ్‌సతో పాటు పలు ఉద్యాన పంటలూ జిల్లా జాబితాలో చేరాయి.
తిరుపతి, ఆంధ్రజ్యోతి: తాజాగా జరిగిన పునర్విభజనతో తిరుపతి జిల్లాకు గనులొచ్చాయి. అన్నమయ్య జిల్లాలోని రైల్వే కోడూరును విలీనం చేయడంతో ముగ్గురాళ్ల గనులు, బెరైటీ్‌సతో పాటు పలు ఉద్యాన పంటలూ జిల్లా జాబితాలో చేరాయి. వైసీపీ హయాంలో జరిగిన జిల్లాల పునర్విభజనతో గూడూరు, సూళ్లూరుపేట నియోజకవర్గాలు తిరుపతి జిల్లాలో చేరడంతో రాయలసీమకు సముద్రం వచ్చింది. ప్రస్తుతం చేపట్టిన జిల్లాల మార్పులో గూడూరు, చిల్లకూరు, కోట మండలాలు నెల్లూరు జిల్లాకు వెళ్లినా.. వాకాడు, సూళ్లూరుపేట, తడ మండలాల పరిధిలోని తీరప్రాంతం ఉంది. తాజాగా రైల్వే కోడూరు నియోజకవర్గం విలీనమైంది. ఉమ్మడి కడప జిల్లాలో రెండు కోడూర్లు ఉన్నాయి. ఒకటి బద్వేలు ప్రాంతంలో, మరోటి రాజంపేటకు చేరువలో. బద్వేలు వద్ద వున్న కోడూరును బి.కోడూరుగా, రాజంపేటకు దగ్గరలో వున్న కోడూరును రైల్వే కోడూరుగా పిలుస్తున్నారు. ఈ కోడూరు మీదుగా రైల్వే లైను వుండడమే దానికి కారణం. రైల్వే కోడూరు నియోజకవర్గంలో రైల్వే కోడూరు, చిట్వేలు, ఓబులవారిపల్లి, పెనగలూరు, పుల్లంపేట తదితర ఐదు మండలాలున్నాయి. ఇది ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం. ప్రస్తుతం జనసేన తరపున గెలుపొందిన అరవ శ్రీధర్ ఎమ్మెల్యేగా వున్నారు. పచ్చదనానికి పేరుపడ్డ ఈ నియోజకవర్గంలో శేషాచల పర్వతాలు, దట్టమైన అడవులు వున్నాయి. ఓబులవారిపల్లి మండలంలోని మంగంపేటలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన ముగ్గురాళ్ల గనులు, బెరైటీస్ నిక్షేసాలున్నాయి. దశాబ్దాలుగా ఉమ్మడి కడప జిల్లాలో ఎంతోమంది రాజకీయ నేతలకు భారీగా ఆదాయాన్ని ఇస్తున్న వనరులు ఇవి. మరోవైపు అరటి, బొప్పాయి, పొద్దుతిరుగుడు, మామిడి వంటి ఉద్యాన పంటలకు ప్రసిద్ధి చెందింది. దీంతో ఇక్కడ కేరళ తరహా వాతావరణం కనిపిస్తుంది. ఈ ఉద్యాన పంటలతో ఏటా రూ.వెయ్యి కోట్లకు పైగా ఆదాయం వస్తోంది. దట్టమైన అటవీప్రాంతంలో ఎర్రచందనం చెట్లూ ఎక్కువగా ఉన్నాయి. శతాబ్దాల పర్యంతం రైల్వే కోడూరు మండలం కుక్కలదొడ్డి నుంచీ శేషాచలం అడవుల మీదుగా తిరుమలకు రాకపోకలు సాగాయి. పెద్దగా ఎత్తు పల్లాలు లేని సమతల రహదారి వుండడం వల్ల ఆ మార్గాన్ని పూర్వకాలం విస్తృతంగా వాడేవారు.