Mango: మామిడి పూత ఆలస్యం
ABN , Publish Date - Jan 21 , 2026 | 03:18 AM
మామిడి రైతుపై ప్రకృతి కన్నెర్ర చేస్తోంది. పూత ఆలస్యం కావడంతో వీరిలో ఆందోళన వ్యక్తమవుతోంది.
మామిడి పూతకు ప్రకృతి వాత
సోమల, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): మామిడి రైతుపై ప్రకృతి కన్నెర్ర చేస్తోంది. పూత ఆలస్యం కావడంతో వీరిలో ఆందోళన వ్యక్తమవుతోంది. పొగమంచు, చిరుజల్లులు కురవడంతో నేలలో తేమశాతం పెరగడం వంటి పరిస్థితులతో పూత జాప్యం జరుగుతోంది. డిసెంబరు, ఈనెలల్లో విపరీతంగా దట్టమైన పొగమంచు కురిసింది. సోమల మండలంలో 15 వేల ఎకరాలకు గాను 10 శాతం కూడా పూత పూయలేదు. పెద్దఉప్పరపల్లె, అన్నెమ్మగారిపల్లె, పేటూరు, సోమల, నెల్లిమంద, ఇరికిపెంట, నంజంపేట, కందూరు కూడా ఆదే పరిస్థితి నెలకొంది. ఈ ప్రాంతంలోనే ఎక్కువ పంట ఉత్పత్తి అయ్యేది. బేనిషా, మల్లికా, నీ లం, తోతాపురి ఇలా పలు రకాల పంట పండుతోంది. దూర ప్రాంతాల వ్యాపారస్తులు సైతం మామిడి సీజన్‌లో ఇక్కడే మకాం వేసి కొనుగోళ్లు చేస్తుంటారు. రోజూ 10 లారీల మామిడి ఎగుమతి జరుగుతుంది. ఈసారి మాత్రం. పంటకు ప్రకృతి సహకరించడంలేదు. ఫలితంగా భారీ ఎత్తున దిగుబడి తగ్గే అవకాశం ఉంది. దిగుబడిపై ఆశతో మామిడి రైతులకు భారీ పెట్టుబడి పెట్టారు. వీరంతా ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది 50శాతం మాత్రమే దిగుబడి వచ్చింది. తోతాపురికి గిట్టుబాటు ధర లేకపోవడంతో నష్టపోయారు. దీంతో కొందరు ఈఏడాది తోతాపురి చెట్లను నరివేశారు. ఎండ బాగా కాస్తేనే పూత బాగా వస్తుంది. మబ్బులు, చిరుజల్లులు ఇందుకు ప్రతిబంధకంగా మారాయి. ఈక్రమంలోనే లీజుకు వ్యాపారులు ఆశతో మందుల పిచికారీ చేస్తున్నారు.
నాలుగెకరాల్లో కూడా పూత రాలేదు : శెట్టివారి నాగరాజ, సోమల
మాకున్న నాలుగెకరాల మామిడి తోటలో 10 చెట్లకు పూత రాలేదు. ఎకరాకు 70 చెట్లు ఉన్నాయి. తోటలో మూడుసార్లు దుక్కి, కలుపు నివారణకు మందుల పిచికారీ, ఎరువులు, పూత కోసం మందుల పిచికారీ చేశాం. అయినా ప్రయోజనం కనిపించడంలేదు. బేనిషా, కాదర్, పుల్లేరా వంటి డిమాండ్ రకాలకు పూత ఇలా వస్తే నష్టమే.
తలకు మించిన భారంగా ఖర్చులు : పసలప్పగారి మురళి, కరకమంద.
మామిడి తోటలో ఖర్చులు యేటా తలకు మించిన భారంగా మారాయి. సేద్యపు ఖర్చు, మందుల పిచికారీ, దున్నపు ఖర్చు తప్పడం లేదు. పూత సరిగా రావడంలేదు. డిసెంబరు నెలాఖరున వచ్చే మొగ్గలు చలి తీవ్రత, అధిక మంచు కారణాలతో నేటీకీ ఆశించిన మేర పూత రాలేదు.
తోతాపురి చెట్టు తొలగించా : గన్నా జయప్రకాశ్, గన్నావారిపల్లె.
తోతాపురికి గిట్టుబాటు ధరలు లేక ఆరెకరంలోని చెట్లను తొలగించాం. ప్రభుత్వం రైతులకు రాయితీతో పిచికారీ మందులు అందజేయాలి. అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. ఏడాది పొడవునా కష్టించినా ఫలితం మాత్రం కానరావడంలేదు.
ఇలా చేస్తే పూత పెరగవచ్చు: సంతోషి కుమారి, ఉద్యానశాఖ అధికారి.
పూత రాకపోతే వెంటనే రైతులు కొన్ని మెళకువలు పాటిస్తే పూత పెరుగుతుంది. ఆడపూల శాతం పెరగడానికి పొటాషియం నైట్రేట్, ఫా ర్ములా-4 లేదా ఆర్గాన్ మ్యాంగో స్పెషల్ లీటరు నీటికి తగు మోతాదులో పిచికారీ చేయాలి. కొమ్మలు బాగా తడిసేలా పిచికారీ చేస్తే బాగా పూత వస్తుంది.