Civil rights: పౌరహక్కుల కోసం చట్టపోరాటం
ABN , Publish Date - Jan 11 , 2026 | 02:37 AM
చట్టపరమైన మార్గాల్లో పౌరహక్కుల పోరాటం కొనసాగిస్తామని తిరుపతిలో శనివారం మొదలైన పౌరహక్కుల సంఘం 20 రాష్ట్ర మహాసభల్లో వక్తలు ప్రకటించారు.
క్రాంతిచైతన్యను విడుదల చేయాలని డిమాండ్
తిరుపతి, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): చట్టపరమైన మార్గాల్లో పౌరహక్కుల పోరాటం కొనసాగిస్తామని తిరుపతిలో శనివారం మొదలైన పౌరహక్కుల సంఘం 20 రాష్ట్ర మహాసభల్లో వక్తలు ప్రకటించారు. తిరుపతిలోని గంధమనేని శివయ్య భవన్‌లో రెండురోజుల సభలు మొదలయ్యాయి. సంఘం ఉభయ తెలుగు రాష్ట్రాల సమన్వయకర్త, ప్రముఖ న్యాయవాది క్రాంతిచైతన్యను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో సభలు ఉదయం ఉద్విగ్న వాతావరణంలో మొదలయ్యాయి. ప్రాంగణంలో తాత్కాలికంగా ఏర్పాటుచేసిన అమరవీరుల స్థూపం ముందు ప్రజాకళామండలి కళాకారులు ఉద్వేగంతో పాటలు పాడుతూ, నృత్యం చేస్తూ, పౌరహక్కుల ఉద్యమంలో ప్రాణాలర్పించిన ఆరుగురు అమరవీరులకు నివాళులు అర్పించారు. సామాజిక అసమానతలను ప్రశ్నించే వారిమీద, హింసకు వ్యతిరేకంగా మాట్లాడే వారిపైన కక్షపూరిత చర్యలు తీసుకోవడం మానుకోవాలని సభలకు హాజరైన పలువురు ప్రభుత్వాన్ని కోరారు. కేవలం కొన్ని వర్గాల ఒత్తిళ్లకు లోనై, శాంతియుతంగా నచ్చజెప్పే ప్రయత్నం చేసిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టడం అన్యాయమని నిరసన తెలిపారు. నిష్పక్షపాతంగా విచారణ జరిపి ప్రజాస్వామ్యవాదులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత వ్యవస్థల మీద ఉందని గుర్తుచేశారు. క్రాంతి చైతన్య విడుదలను కోరుతూ సభలో నినాదాలు చేశారు. కాగా, జాతీయ చిహ్నాన్ని అవమానించేలా చిత్రంతో పోస్టర్లు రూపొందించారనే ఆరోపణతో శుక్రవారం అదుపులోకి తీసుకున్న న్యాయవాది క్రాంతిచైతన్యకు, పోస్టర్లు ప్రింట్ చేసిన దుగ్గినేని మోహన్‌కృష్ణను పోలీసులు న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. వీరికి 22వ తేదీ వరకూ రిమాండ్‌కు ఆదేశించారు.
మేధావుల ప్రసంగాలు
పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేడంగి చిట్టిబాబు అధ్యక్షతన ఉదయం జరిగిన తొలి సమావేశంలో ‘కాషాయీకరణ-లౌకిక ప్రజాస్వామ్యం’ అన్న అంశంపైన ఛత్తీ్‌సఘడ్‌కు చెందిన ప్రముఖ గాంధేయవాది హిమాంశు కుమార్ మాట్లాడారు. మధ్యాహ్నం పౌరహక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ‘వికసిత భారత్- పౌరహక్కులు’ అన్న అంశంపై ప్రొఫెసర్ హరగోపాల్ ప్రసంగించారు. గిరిజన పోరాటాలు మావోయిస్టులతోనే ప్రారంభం కాలేదని, వారితోనే అంతం కావన్నారు. ‘వికసిత భారత్’ అన్న అంశంపై ఆర్థిక రంగ నిపుణుడు ప్రొఫెసర్ డి.నరసింహారెడ్డి మాట్లాడుతూ, 1990 నుంచి భారత్ అభివృద్ధి చెందుతోందంటున్నారని, కేవలం 5 శాతానికి మించి అభివృద్ధి చెందలేదన్నారు. పౌరహక్కుల సంఘం రాష్ట్రమహాసభల ఆహ్వానసంఘం అధ్యక్షుడు రాఘవ శర్మ మాట్లాడుతూ, ‘ఎవరి అభిప్రాయాలను నిషేధించలేమని, అలా నిషేధిస్తే మానవ సమాజం ముందుకు పోదు’ అని జస్టిస్ జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. సభల్లో పౌరహక్కుల సంఘంతెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, నారాయణరావు ఇంకా పలువురు మేధావులు పాల్గొన్నారు.