KV: కేవీలు.. జిల్లాకు గర్వకారణం: కలెక్టర్
ABN , Publish Date - Apr 21 , 2026 | 01:25 AM
చిత్తూరు, కుప్పం ప్రాంతాల్లో కేంద్రీయ విద్యాలయాలను (కేవీలు) తాత్కాలికంగా ప్రారంభించుకోవడం జిల్లాకే గర్వకారణమని కలెక్టర్ సుమిత్‌కుమార్ చెప్పారు.
చిత్తూరు అర్బన్, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు, కుప్పం ప్రాంతాల్లో కేంద్రీయ విద్యాలయాలను (కేవీలు) తాత్కాలికంగా ప్రారంభించుకోవడం జిల్లాకే గర్వకారణమని కలెక్టర్ సుమిత్‌కుమార్ చెప్పారు. చిత్తూరు నగరం ఇరువారం వద్ద సోమవారం తాత్కాలికంగా ప్రారంభమైన కేంద్రీయ విద్యాలయాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఈ రెండు కేవీల్లో 320 సీట్లతో విద్యావకాశాలు కల్పిస్తున్నామన్నారు. తాత్కాలిక భవనాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించామన్నారు. ఇప్పటి వరకు 70 శాతం అడ్మిషన్లు పూర్తయ్యాయని, మిగతా వాటినీ త్వరలో పూర్తి చేస్తామన్నారు. జిల్లాలో పిల్లలకు నాణ్యమైన విద్యను అందిచాలనే ఉద్దేశంతోనే కేంద్రీయ విద్యాలయాలు మంజూరైనట్లు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తెలిపారు. సీఎం చంద్రబాబు జన్మదినం సందర్భంగా వీటిని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. విద్యార్థులకు అవసరమైన ఆర్వో ప్లాంట్, కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. చిత్తూరులో కేంద్రీయ విద్యాలయం ప్రారంభంకావడం ప్రజల అదృష్టమని చుడా చైర్‌పర్సన్ కఠారి హేమలత అన్నారు. మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, మాజీ మేయర్ అముద, ప్రిన్సిపాల్ లూథర్, డీఈవో రాజేంద్ర ప్రసాద్, సర్వశిక్ష అభియాన్ పీవో వెంకటరమణ, కమిషనర్ నరసింహ ప్రసాద్, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం వీరంతా తరగతి గదులను పరిశీలించారు.