Share News

YCP: పోలీసు విచారణకు కరుణ,అభినయ్‌

ABN , Publish Date - Aug 21 , 2026 | 01:24 AM

క్రిమినల్‌ కేసు లో కోర్టు ఆదేశాల మేరకు కరుణాకరరెడ్డి తన తనయుడు అభినయ్‌తో బుధవారం విచారణకు భూమన కరుణాకరరెడ్డి హాజరయ్యారు.

YCP: పోలీసు విచారణకు కరుణ,అభినయ్‌
కరుణాకర రెడ్డిని విచారిస్తున్న సీఐ సునీల్‌కుమార్‌

తిరుపతి, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): ‘‘నా పేరిట భూమి లేదు... నా భార్య పేరిట వుంది.... కానీ ఎంత వుందో తెలీదు... పొరుగు రైతు వెంకటేశ్వర ప్రసాద్‌ ఎవరో తెలీదు... నేనెప్పుడూ చూడలేదు.. గొడవ జరిగినట్టు గుర్తులేదు..’’ ఇదీ భూ వివాదం కేసులో పోలీసు అధికారుల ఎదుట హాజరైన తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి చేసిన వితండ వాదం. తిరుపతి రూరల్‌ మండలం తనపల్లి వద్ద వెంకటేశ్వర ప్రసాద్‌ అనే రైతు భూమిని వైసీపీ ప్రభుత్వ హయాంలో కరుణాకరరెడ్డి దౌర్జన్యంగా ఆక్రమించారన్న ఆరోపణతో తిరుచానూరు పోలీస్‌ స్టేషన్‌లో క్రిమినల్‌ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో కోర్టు ఆదేశాల మేరకు కరుణాకరరెడ్డి తన తనయుడు అభినయ్‌తో బుధవారం విచారణకు హాజరయ్యారు. చంద్రగిరి డీఎస్పీ ప్రసాద్‌, తిరుచానూరు సీఐ సునీల్‌కుమార్‌ విచారించారు.తనపల్లి రోడ్డులో ఎంత భూమి వుంది? పక్కన వున్న రైతు భూమిని ఎంత ఆక్రమించారు? ఎందుకు ఆక్రమించారు? వెంకటేశ్వర ప్రసాద్‌ భూమిలోకి ఎందుకు చొరబడి చెట్లు నరికించారు? అతడి భూమిలో ఎందుకు దౌర్జన్యంగా రోడ్డు వేశారు? ఈ భూమి వివాదంలో సివిల్‌ కేసులేవైనా వున్నాయా? అంటూ సుమారు ఇరవైకి పైగా ప్రశ్నలు సంధించారు. దీనికి కరుణాకరరెడ్డి పొంతన లేని సమాధానాలిచ్చినట్టు సమాచారం. తనపల్లి రోడ్డులో తన భార్య రేవతి పేరిట భూమి వుందని, అది ఎంత వుందో కూడా తనకు తెలియదని సమాధానమిచ్చినట్టు తెలిసింది.వెంకటేశ్వర ప్రసాద్‌ అనే వ్యక్తి తాను ఎప్పుడూ చూడలేదని చెప్పారని సమాచారం. తాను కబ్జాలకు పాల్పడే వాన్ని కాదని, ఆశయాలకు కట్టుబడిన వ్యక్తినంటూ స్వోత్కర్షకు దిగినట్టు తెలిసింది. తాను నిలదీయడంతో రాత్రికి రాత్రే ఆన్‌లైన్‌ ఎఫ్‌ఐఆర్‌లో కలెక్టర్‌ పేరు తీసేసి వెంకటేశ్వర ప్రసాద్‌ను ఫిర్యాదుదారుగా పెట్టారంటూ ఆరోపించినట్టు తెలిసింది. ఎవరు చెబితే కలెక్టర్‌ పేరు మార్చారంటూ ప్రశ్నించినట్టు తెలిసింది.ఉదయం 10 గంటలకు వచ్చిన కరుణాకర రెడ్డి మధ్యాహ్నం 12.40 గంటలకు వెనుదిరగ్గా ఒక గంట నుంచీ 3.45 గంటల వరకూ పోలీసు అధికారులు అభినయ్‌ని విచారించారు. అతడిని కూడా అవే ప్రశ్నలు వేయగా అక్కడ 20 ఎకరాల పొలముందని,తాము దౌర్జన్యంగా రోడ్డు వేయలేదని, తాను చిన్నప్పటి నుంచీ అదే దారిలో వెళుతున్నామని సమాధానమిచ్చినట్టు తెలిసింది. తండ్రి తరహాలోనే తనకు కూడా వెంకటేశ్వర ప్రసాద్‌ అనే వ్యక్తి ఎవరో తెలియదని, సోషల్‌ మీడియాలో చూశాకే తెలిసిందని జవాబిచ్చినట్టు సమాచారం.విచారణ ముగిశాక కరుణాకర రెడ్డి మీడియాతో సీఐ సునీల్‌కుమార్‌ చాలా మంచివాడంటూ ముక్తాయింపు ఇచ్చారు.అనవసరంగా సీఐని బలిపశువును చేసి ఛార్జి మెమో ఇచ్చారని వ్యాఖ్యానించారు. ఈ కేసులో ఫిర్యాదుదారైన చెరుకూరి వెంకటేశ్వర ప్రసాద్‌ ఈనెల 24న విచారణకు వచ్చిన తర్వాత నిందితులకు నోటీసులిస్తామని సీఐ సునీల్‌కుమార్‌ తెలిపారు.


ఇదీ తనపల్లి భూ వివాదం!

తిరుపతి రూరల్‌ మండలం తనపల్లి రెవిన్యూ సర్వే నంబరు 478లో చెరుకూరి వెంకటేశ్వర ప్రసాద్‌ అనే రైతు భూమిని 2023 నవంబరు 4వ తేదీన అప్పటి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి అనుచరులతో కలసి కబ్జా చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. వెంకటేశ్వర ప్రసాద్‌కు చెందిన తోటలోని చెట్లను దౌర్జన్యంగా నరికివేయించి అతడి భూమి మీదుగా తమ పొలానికి రోడ్డు కూడా వేసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో అధికారంలో వుండడంతో నిస్సహాయుడైన వెంకటేశ్వర ప్రసాద్‌ తాజాగా ఈనెల 12వ తేదీన తిరుచానూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దానిపై క్రైమ్‌ నంబరు 253-2026 మేరకు కరుణాకరరెడ్డిపై కేసు నమోదైంది.

Updated Date - Aug 21 , 2026 | 01:27 AM