Share News

Kanipakam: ‘ప్రసాద్‌’ పరిధిలోకి కాణిపాకం

ABN , Publish Date - Feb 23 , 2026 | 02:23 AM

పర్యాటక, ఆలయాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ‘ప్రసాద్‌’ పథకం పరిధిలోకి కాణిపాకం ఆలయాన్ని తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు హామీ ఇచ్చారు.

Kanipakam: ‘ప్రసాద్‌’ పరిధిలోకి కాణిపాకం
స్వామి సేవలో పాల్గొన్న కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్‌నాయుడు

ఐరాల(కాణిపాకం), ఫిబ్రవరి 22 (ఆంధ్ర జ్యోతి): పర్యాటక, ఆలయాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ‘ప్రసాద్‌’ పథకం పరిధిలోకి కాణిపాకం ఆలయాన్ని తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు హామీ ఇచ్చారు. తద్వారా ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఆదివారం కాణిపాకం వచ్చిన కేంద్ర మంత్రికి పూతలపట్టు ఎమ్మెల్యే మురళిమోహన్‌, ఆలయ కమిటీ చైర్మన్‌ మణినాయుడు, ఈవో పెంచలకిషోన్‌ స్వాగతం పలికారు. వరసిద్ధి వినాయకస్వామిని దర్శించుకున్న ఆయనకు.. వేదాశీర్వాద మండపంలో వేదమంత్రాలతో ఆశీర్వదించి స్వామి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలు,జ్ఞాపికను అందించారు. ఆలయం వెలుపల రామ్మోహన్‌ నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. తాను 25 ఏళ్ల కిందట వరసిద్ధుడి ఆలయానికి వచ్చినట్లు గుర్తుచేసుకున్నారు. తన మనసులో ఉన్న ఆలయానికి.. ప్రస్తుతమున్న దానికి చాలా తేడా ఉందన్నారు. ఆలయానికి దగ్గర్లో ఉన్న హైవేలో పనులు కూటమి ప్రభుత్వం వచ్చిన అనంతరం పనులు వేగవంతంగా జరగుతున్నాయన్నారు. ప్రధాని మోదీ సహకారంతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రి నారా లోకేశ్‌ బ్రాండ్‌ ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దారన్నారు. ప్రపంచంలోని పెట్టుబడులకు కేంద్రంగా రాష్ట్రం మారిందన్నారు. ఏఐ లాంటి పెద్దపెద్ద డెటా సెంటర్లు, క్వాంటమ్‌ వ్యాలీ టెక్నాలజీకి వేదికగా మారిందన్నారు. కాణిపాక ఆలయాన్ని భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేయవలసిన బాధ్యత తమపై ఉందన్నారు. ఆయనతో పాటు మాజీ ఎంపీ, ప్రముఖ పారిశ్రామిక వేత్త గల్లా జయదేవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 23 , 2026 | 02:23 AM