Share News

Ration rice: జోరుగా రేషన్‌ బియ్యం అక్రమ రవాణా

ABN , Publish Date - Feb 23 , 2026 | 02:31 AM

రేషన్‌ బియ్యానికి రెక్కలొస్తున్నాయి. కర్ణాటకకు అక్రమంగా తరలిపోతున్నాయి. వివిధ మార్గాల్లో పగలూ రాత్రి తేడా లేకుండా తరలిస్తూ కొందరు సొమ్ము చేసుకుంటున్నారు.

Ration rice: జోరుగా రేషన్‌ బియ్యం అక్రమ రవాణా
కుప్పం- పొగురుపల్లె మార్గంలో టెంపోలో కర్ణాటకకు రవాణా అవుతున్న రేషన్‌ బియ్యం

గుడుపల్లె, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): రేషన్‌ బియ్యానికి రెక్కలొస్తున్నాయి. కర్ణాటకకు అక్రమంగా తరలిపోతున్నాయి. వివిధ మార్గాల్లో పగలూ రాత్రి తేడా లేకుండా తరలిస్తూ కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. సరిహద్దులోని తమిళనాడు రేషన్‌ షాపుల్లో, మన రాష్ట్ర పరిధిలోని కుప్పం నియోజకవర్గంలోని రేషన్‌ షాపుల్లో ప్రభుత్వాలు కార్డుదారులకు ఉచితంగా బియ్యం సరఫరా చేస్తున్న సంగతి తెలిసింది. కార్డుదారుల నుంచి కొందరు దళారులు చౌకగా ఈ బియ్యాన్ని కొంటున్నారు. పలు గ్రామాల్లోని దళారుల ద్వారా ఈ బియ్యాన్ని వ్యాపారులు సేకరిస్తున్నారు. గుడుపల్లె మండలం నుంచి కుప్పం- పొగురుపల్లె, కుప్పం-శెట్టిపల్లె మార్గాల్లో ఈ రేషన్‌ బియ్యాన్ని కర్ణాటక రాష్ట్రం బంగారుపేటలో రైస్‌ మిల్లులకు వాహనాల్లో తరలిస్తున్నారు. మిల్లుల వారు రేషన్‌ బియ్యానికి పాలిష్‌ పెడుతూ రూపం మార్చేస్తున్నారు. సన్న బియ్యం పేరిట కొత్తగా బ్రాండ్లతో అక్కడి షాపులకు అమ్ముతున్నారు. మిల్లర్లు బ్రాండెడ్‌ కంపెనీ సన్న బియ్యం కంటే తక్కువ ధరకు అమ్ముతూ ప్రజలను మోసగిస్తున్నారు. తద్వారా లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారు. బియ్యం అక్రమ రవాణా వాహనాలు అత్యంత వేగంతో దూసుకుపోతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని స్థానికులు విమర్శిస్తున్నారు. అధికారులు స్పందించి రేషన్‌ బియ్యం అక్రమ రవాణాను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - Feb 23 , 2026 | 02:35 AM