Share News

Bridge: రూ. 16 కోట్లతో హై లెవల్‌ బ్రిడ్జి

ABN , Publish Date - Jul 31 , 2026 | 01:56 AM

డక్కిలి మండలం లింగసముద్రం వద్ద జాతీయ రహదారి నెంబర్‌ 565పై నిర్మించనున్న హైలెవల్‌ వంతెనకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రేపు శంకుస్థాపన చేయనున్నారు.

Bridge: రూ. 16 కోట్లతో హై లెవల్‌ బ్రిడ్జి
ప్రధాన మంత్రి శంకుస్థాపన చేయనున్న వంతెన స్థలం

డక్కిలి, జూలై 30 (ఆంధ్రజ్యోతి) : డక్కిలి మండలం లింగసముద్రం వద్ద జాతీయ రహదారి నెంబర్‌ 565పై నిర్మించనున్న హైలెవల్‌ వంతెనకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రేపు శంకుస్థాపన చేయనున్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా చేపట్టనున్న పలు కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి పనులతోపాటు ఈ వంతెన నిర్మాణానికి సంబంధించిన శిలాఫలకాన్ని కూడా వర్చువల్‌ విధానంలో ఆయన ఆవిష్కరించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. రూ.16 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ హై లెవల్‌ వంతెన నిర్మాణం పూర్తయితే పెంచలకోన-ఏర్పేడు మధ్య రాకపోకలు మరింత సురక్షితంగా, వేగవంతంగా మారనున్నాయి. ముఖ్యంగా వర్షాకాలంలో ఎదురయ్యే రవాణా అంతరాయాలకు శాశ్వత పరిష్కారం లభించనుంది. లింగసముద్రం వద్ద పాత వంతెన గతంలో సంభవించిన భారీ వరదలతో బలహీనపడింది.చివరకు అది ప్రమాదకరంగా మారడంతో జాతీయ రహదారుల ప్రాథమిక సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) దానిని పూర్తిగా తొలగించింది. వాహనదారులు ఇబ్బంది పడకుండా ముందస్తుగా ప్రత్యామ్మాయ డైవర్షన్‌ రోడ్డును ఏర్పాటుచేసి రాకపోకలను కొనసాగిస్తోంది. ఇదిలా ఉండగా, కొత్త హైలెవల్‌ వంతెన నిర్మాణానికి సంబందించి పాత వంతెన స్థలంలో ఇప్పటికే రిటైనింగ్‌ వాల్‌ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ వంతెన నిర్మాణం పూర్తయితే పెంచలకోన,డక్కిలి, ఏర్పేడు మార్గంలో ప్రయాణించే ప్రజలు వ్యాపార వాహనాలు, వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు గణనీయమైన ఊరట లభించనుంది. వరదల సమయంలో రాకపోకలు నిలిచిపోయే సమస్యకు తెరపడడంతో పాటు, జాతీయ రహదారిపై ప్రయాణ భద్రత మరింత మెరుగుపడనుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ప్రాంతీయ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలుస్తుందని అధికారులు పేర్కొన్నారు. శంకుస్థాపన అనంతరం నిర్మాణ పనులను నిర్ణీత గడువులో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

Updated Date - Jul 31 , 2026 | 01:56 AM