Medical: మాతాశిశు మరణాలపై చర్యలేవీ?
ABN , Publish Date - Jan 21 , 2026 | 03:00 AM
గత 9 నెలల కాలంలో ప్రసవ సమయంలో ఆరుగురు తల్లులు, 127 మంది శిశువులు,ఐదేళ్ల లోపు చిన్నారులు 10 మంది మృత్యువాత పడడం వైద్యశాఖ దీన పరిస్థితికి అద్దం పడుతోంది.
చిత్తూరు రూరల్, జనవరి 20(ఆంధ్రజ్యోతి): ఎక్కడా మాతా శిశు మరణాలు సంభవించకూడదు. బాలింతలు, గర్భిణులు ఆరోగ్యంగా ఉండేలా చర్యలు తీసుకోండి... సమావేశాల్లో కలెక్టర్ తరచూ వైద్యాధికారులకు చెప్పే మాటలివి...అయితే క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు భిన్నంగా పరిస్థితులున్నాయి. గత 9 నెలల కాలంలో ప్రసవ సమయంలో ఆరుగురు తల్లులు, 127 మంది శిశువులు,ఐదేళ్ల లోపు చిన్నారులు 10 మంది మృత్యువాత పడడం వైద్యశాఖ దీన పరిస్థితికి అద్దం పడుతోంది.
పీహెచ్‌సీల్లో కాన్పులు నిల్
జిల్లాలో మొత్తం 64 పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీలుంటే ఇటీవల వీటిలో జరిగిన ప్రసవాలు 53 మాత్రమే. పీహెచ్‌సీల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని ప్రభుత్వాలు రూ.కోట్లు ఖర్చు చేస్తున్నా అసలు ప్రసవాలు జరగని పీహెచ్‌సీలు 22 ఉన్నాయంటే వైద్యాధికారుల తీరు ఎలా ఉందో అర్థమవుతోంది. ప్రసూతి సేవల విషయంలో సర్కారు ఆస్పత్రులు నమ్మకాన్ని కలిగించలేకపోవడంతో ప్రసవాల కోసం ప్రైవేటు ఆసుపత్రుల వైపే చూస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 30 నుంచి 250 ప్రసవాలు నిర్దేశించినా... అందులో సగమైనా చేరుకోవడం లేదు. కొన్ని చోట్ల కాన్పు కోసం వచ్చిన వారిని పరీక్షించి... ఏదో ఒకసాకు చెప్పి ప్రైవేటు, జిల్లా ఆస్పత్రులకు పంపేస్తున్నారు. ప్రభుత్వ వైద్యశాలల్లో పనిచేస్తూ ప్రైవేటు క్లినిక్కులకే కొందరు పరిమితం కావడమూ ప్రసూతి సేవలు దారి తప్పేందుకు కారణమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.ముఖ్యంగా హైరిస్క్ కేసుల్లో తల్లీబిడ్డ ప్రాణాలు కాపాడే విషయమై పర్యవేక్షణ కొరవడుతోందని అభిప్రాయాలు విన్పిస్తున్నాయి. 15 రోజులకోసారి గర్భిణుల ఇళ్లకు వెళ్లి పరీక్షలు చేయాల్సిన ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు చాలామంది గ్రామాల్లో కనిపించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పీహెచ్‌సీల తనిఖీలను పూర్తిగా గాలికొదిలేయడంతో క్షేత్రస్థాయి సిబ్బంది కూడా ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు.ఇటీవల గుడిపాల పీహెచ్‌సీని తనిఖీ చేసిన సమయంలో కూడా వైద్యులు లేకపోవడం గుర్తించిన కలెక్టర్ సుమిత్‌కుమార్ జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేసినా పరిస్థితిలో మార్పు రాలేదు. మంగళవారం డీఎంహెచ్‌వో కార్యాలయంలో మాతాశిశు మరణాలపై జరిగిన జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమీక్ష సమావేశానికి కూడా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి గైర్హాజరవడం ఇందుకు నిదర్శనంగా కన్పిస్తోంది.
తీసుకుంటున్న జీతానికైనా పనిచేయండి
క్షేత్రస్థాయి సిబ్బందిపై డీఐవో హనుమంతరావు ఆగ్రహం
తీసుకుంటున్న జీతానికైనా సక్రమంగా పనిచేయాలని క్షేత్రస్థాయి వైద్య సిబ్బందిపై డీఐవో హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.డిసెంబరు నెలలో సంభవించిన రెండు మాతా, 12 శిశు మరణాలపై చిత్తూరు డీఎంహెచ్‌వో కార్యాలయంలో మంగళవారం జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమీక్షించింది. ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ ఒక నెల్లో 14 మాతాశిశు మరణాలు సంభవిస్తుంటే క్షేత్రస్థాయి సిబ్బంది, వైద్యాధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కనీసం గర్భిణులను పలకరించి వున్నా ఇన్ని మరణాలు సంభవించేవి కాదన్నారు.ఇకనైనా ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు 15 రోజులకోసారి గర్భిణుల వద్దకు వెళ్లి వారికి అందాల్సిన వైద్య సేవలన్ని అందించాలని ఆదేశించారు.మాతాశిశు మరణాలు ఇలానే కొనసాగితే సిబ్బంది జితాల్లో కోతలు తప్పవని హెచ్చరించారు. చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రి ఎంఎస్ ఉషశ్రీ, గైనకాలజిస్టులు లత, ప్రశాంతి, గోకుల్‌కుమార్, శ్రీలత, షారుక్, అనూష తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.