Land: రూ.వంద కోట్ల భూములపై కన్ను
ABN , Publish Date - Mar 10 , 2026 | 01:43 AM
చిట్టమూరు మండలం కుమ్మరిపాళెం రెవెన్యూ పరిధిలోని కుమ్మరిపాళెం, పేరపాటి తిప్ప గ్రామాల్లో దాదాపు రెండువేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. విలువ రూ.వంద కోట్లపైనే ఉండడంతో కబ్జాదారుల కన్ను పడింది. ఇప్పటికే వెయ్యి ఎకరాలను కబ్జా చేసేశారు. మరో 500 ఎకరాల ఆక్రమణకు ప్రయత్నాలు జోరందుకున్నాయి.
చిట్టమూరు, , మార్చి 9 (ఆంధ్రజ్యోతి): చిట్టమూరు మండలం కుమ్మరిపాళెం రెవెన్యూ పరిధిలోని కుమ్మరిపాళెం, పేరపాటి తిప్ప గ్రామాల్లో దాదాపు రెండువేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. విలువ రూ.వంద కోట్లపైనే ఉండడంతో కబ్జాదారుల కన్ను పడింది. ఇప్పటికే వెయ్యి ఎకరాలను కబ్జా చేసేశారు. మరో 500 ఎకరాల ఆక్రమణకు ప్రయత్నాలు జోరందుకున్నాయి. శ్రీహరి కోటకు సుమారు 15 కిలోమీటర్ల దూరంలోని కుమ్మరపాళెం, పేరపాటితిప్ప గ్రామాల్లోని 211, 222, 224, 245 254 సర్వే నెంబర్లలో సుమారు రెండువేల ఎకరాల అనాధీనం, చెరువు పొరంబోకు భూములు ఉన్నాయి. ఇందులో ఇప్పటికే వెయ్యి ఎకరాలను కబ్జాచేసి, సాగు చేసుకుంటూ లక్షలు గడిస్తున్నారు. గతంలో ఈ భూముల్లో కర్రతుమ్మ కట్టి దట్టంగా ఉండేది. దీన్ని వేలం వేస్తే ప్రభుత్వ ఖజానాకు రూ.20-రూ.30 లక్షల వరకు ఆదాయం వచ్చేది. కబ్జాదారులు కన్ను పడ్డాక ఈ ఆదాయమూ పోయింది.
అధికారుల నిర్లక్ష్యమే కారణమా?
విలువైన భూములను కాపాడాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే కబ్జాదారులు చెలరేగిపోయారని స్థానికులు ఆరోపిస్తున్నారు. తాజాగా మారో 500 ఎకరాలను కబ్జా చేయడానికి ప్రయత్నాలు మొదలయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై తహసీల్దార్ రామయ్యతో మాట్లాడగా కుమ్మరిపాళెం, పేరపాటితిప్ప గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ భూముల ఆక్రమణపై విచారిస్తామని, ఆక్రమణదారులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.