Share News

Soil: మట్టి తవ్వకాలు

ABN , Publish Date - Apr 03 , 2026 | 02:09 AM

సత్యవేడు మండలం తొండుకుళి పెద్ద చెరువులో చేపడుతున్న మట్టి తవ్వకాలతో చెరువు పొరంబోకు భూములపై ఆధారపడ్డ రైతుల నోట్లో మట్టి పడినట్లవుతోంది.

Soil: మట్టి తవ్వకాలు
మట్టి తవ్వకాలతో గుంతలమయమైన చెరువు - నిబంధనలకు విరుద్ధంగా రాత్రివేళ జరుపుతున్న తవ్వకాలు

సత్యవేడు, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): సత్యవేడు మండలం తొండుకుళి పెద్ద చెరువులో చేపడుతున్న మట్టి తవ్వకాలతో చెరువు పొరంబోకు భూములపై ఆధారపడ్డ రైతుల నోట్లో మట్టి పడినట్లవుతోంది. తొండుకుళి సర్వేనెంబర్‌ 19లోని పెద్ద చెరువుతో పాటు చిన్న చెరువులో మట్టి తవ్వకాల కోసం ప్రభుత్వం ఇటీవల నిబంధనలతో కూడిన అనుమతులను మంజూరు చేసింది. చెన్నైకి చెందిన విఘ్నేశ్వర ఏజెన్సీ తమిళనాడులో జరుగుతున్న జాతీయ రహదారి పనుల కోసం ఈ మట్టిని తరలించేందుకు అనుమతులు పొందింది. తొండుకుళి పెద్ద చెరువు, చిన్న చెరువుల్లో మట్టి తవ్వకాలు చేపట్టి తమిళనాడుకు నిత్యం పదుల సంఖ్యలో ట్పిపర్లతో మట్టిని తరలిస్తున్నారు.అయితే ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న మట్టి తవ్వకాలతో చెరువులు ప్రమాదకరంగా మారుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఎక్కడ పడితే అక్కడ జరుపుతున్న తవ్వకాలతో చెరువులు స్వరూపం కోల్పోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా చెరువు కట్టకు దగ్గరలో తవ్వకాలు జరపడం వల్ల భవిష్యత్తులో కట్ట కుంగే ప్రమాదం ఉందని గగ్గోలు పెడుతున్నారు. మట్టిని తరలించేందుకు చెరువు కట్టపై చిన్నపాటి ట్పిపర్లకు 10 టన్నుల వరకు మాత్రమే అనుమతి ఉన్నప్పటికీ భారీ టిప్పర్లతో మట్టిని తరలిస్తున్నారు. మట్టిని పగలు మాత్రమే తరలించాలన్న నిబంధనను బేఖాతరు చేస్తూ రాత్రీపగలు యథేచ్ఛగా మట్టి తవ్వకాలు జరుపుతూ, అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. మరో వైపు చెరువు మిగులు భూముల్లో పంటలు సాగు చేసుకుని జీవిస్తున్న రైతులకు ఈ మట్టి తవ్వకాలు శరాఘాతంలా మారింది.


సుమారు 20 మంది రైతులు చెరువు చుట్టూ సాగు చేస్తున్న పంటలు ప్రస్తుతం కోత దశలో ఉన్నాయి. చెరువులో నిర్వహిస్తున్న తవ్వకాల వల్ల కోతలు చేసుకోలేక చేతికొచ్చిన పంటలను వదులుకోవాల్సిన పరిస్ధితి ఏర్పడింది. మరోవైపు చెన్నైలో రోడ్డు నిర్మాణ పనులకోసమని తొండుకుళి చెరువులో మట్టి తవ్వకాలకు అనుమతి తీసుకుని ఇటుక బట్టీలకు మట్టిని తరలిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. చెన్నై శివారు ప్రాంతాల్లోని తిరువళ్ళూరు, కార్నవాడై, కవరపేట, రెడ్‌హిల్స్‌, పెరియపాళెం తదితర ప్రాంతాల్లో వందలాది ఇటుకబట్టీలకు తొండుకుళి చెరువుల నుండి మట్టి రవాణా చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ విషయంపై జలవనరుల శాఖాధికారులు సమగ్రంగా విచారణ జరపాల్సిన అవసరం ఉంది.

Updated Date - Apr 03 , 2026 | 02:09 AM