Share News

Vote: ప్రతి ఒక్కరూ ఓటు వేయండి

ABN , Publish Date - Oct 31 , 2026 | 02:31 AM

రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ పిలుపునిచ్చారు.

Vote: ప్రతి ఒక్కరూ ఓటు వేయండి
ర్యాండమైజేషన్‌ ప్రక్రియను పరిశీలిస్తున్న జేసీ ఆదర్శ రాజేంద్రన్‌

చిత్తూరు కలెక్టరేట్‌, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంట ల వరకు మున్సిపల్‌ ఎన్నికలకు పోలింగ్‌ జరుగుతుందన్నారు. ఓటరు జాబితాలో పేరున్నవారు ఎన్నికల సంఘం నిర్దేశించిన 12 రకాల గుర్తింపు కార్డులలో ఏదైనా ఒకదానిని పోలింగ్‌ స్టేషన్‌కు తీసుకెళ్లాలని స్పష్టంచేశారు. రెండు బ్యాలెట్‌ పత్రాలు ఇస్తారని, అందులో పింక్‌ కలర్‌ మేయర్‌ అభ్యర్థి, తెలుపురంగు బ్యాలెట్‌ కార్పొరేటర్‌ అభ్యర్థికి ఓటు వేయాల్సి ఉందన్నారు. ఓటు వేశాక రెండు బ్యాలెట్‌ పత్రాలను ఒకే బాక్సులో వేయాలని సూచించారు. ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. ప్రజలు కూడా సహకరించాలని కోరారు.

ఈ గుర్తింపు కార్డుల్లో ఒకటి తీసుకెళ్లొచ్చు

ఆధార్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాన్‌కార్డు, పాస్‌పోర్టు, పోస్టాఫీసు పాస్‌బుక్‌, ఉపాధి హామీ వేతన జాబ్‌ కార్డు, హెల్త్‌ ఇన్స్యూరెన్సు కార్డు, పెన్షన్‌ డాక్యుమెంట్‌, సర్వీస్‌ ఐడి కార్డు, ఎన్‌పీఆర్‌ స్మార్ట్‌ కార్డు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు జారీ చేసిన అఫిషియల్‌ ఐడీ కార్డు, వికలాంగుల కార్డులలో ఏదైనా ఒకటి తీసుకెళ్లాలని కలెక్టరు తెలిపారు.

నేడు పోలింగ్‌ సామగ్రి తరలింపు

చిత్తూరు కార్పొరేషన్‌, కుప్పం, పలమనేరు, నగరి మున్సిపాలిటీల్లో ఆదివారం జరగనున్న పోలింగ్‌ ప్రక్రియకు యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. 168 వార్డుల పరిధిలో 385 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలకు శనివారం పోలింగ్‌ సామగ్రి, సిబ్బంది తరలింపు కోసం డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్లుగా చిత్తూరులో పీవీకేఎన్‌ డిగ్రీ కళాశాల, కుప్పంలో ఎంఎ్‌ఫసీ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, నగరిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్పోర్ట్స్‌ గ్రౌండ్స్‌), పలమనేరులో ఎస్వీసీఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఎంపిక చేశారు. పోలింగ్‌ సిబ్బంది ఆయా డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాలకు శనివారం ఉదయం 7 గంటలకల్లా రావాలని సంబంధిత రిటర్నింగ్‌ అధికారులు ఆదేశించారు. పోలింగ్‌కు అవసరమైన పోలింగ్‌ పెట్టెలు, బ్యాలెట్‌ పత్రాలు, ఇతర పోలింగ్‌ సామగ్రిని సిబ్బందికి అందజేస్తారు.


బ్యాలెట్‌ పేపర్‌లో ఎక్కడైనా తప్పులు ఉన్నాయో, సీరియల్‌ నెంబరు సరిగ్గా ఉందో లేదో, గుర్తులు సరిగా ముద్రణ జరిగిందో లేదో ముందస్తుగా సిబ్బంది పరిశీలించుకుంటారు. పోటీలోని అభ్యర్థుల పేర్లు, ఫొటోలు సక్రమంగా ఉందా లేదా అనేది చూడాలి. ఎక్కడైనా పొరపాట్లు ఉంటే అక్కడే ఉండే ఆర్వో దృష్టికి తీసుకువెళ్లి సరిదిద్దుకోవాలి. ఆయా పోలింగ్‌ స్టేషన్‌కు సంబంధించిన ఓటరు జాబితాలను అధికారులు పరిశీలిస్తారు. ఆ తర్వాత బస్సుల్లో ఆయా పోలింగ్‌ కేంద్రాలకు సామగ్రిని, సిబ్బంది తీసుకెళతారు. ఆదివారం సాయంత్రం పోలింగ్‌ ముగిశాక బ్యాలెట్‌ పెట్టెలను సీల్‌చేసి, మిగిలిన మెటీరియల్‌ను తీసుకొచ్చి ఆయా రిసెప్షన్‌ సెంటర్లలో అందజేస్తారు. దీనికోసం ప్రతి ఏడు పోలింగ్‌ స్టేషన్లకు ఒకరు చొప్పున 55 మంది సూపర్‌వైజర్‌లను కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ నియమించారు.

పోలింగ్‌ సిబ్బంది నియామకానికి మూడో విడత ర్యాండమైజేషన్‌ పూర్తి

చిత్తూరు కార్పొరేషన్‌, కుప్పం, పలమనేరు, నగరి మున్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా పోలింగ్‌ సిబ్బంది నియామకానికి మూడో విడత ర్యాండమైజేషన్‌ను శుక్రవారం నిర్వహించారు. కలెక్టరేట్‌లో జేసీ ఆదర్శ్‌ రాజేంద్రన్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. పారదర్శకంగా ర్యాండమైజేషన్‌ ప్రక్రియను నిర్వహించినట్లు తెలిపారు. ఎన్‌ఐసీ అధికారి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ర్యాండమైజేషన్‌ ప్రక్రియను వివరించగా, ప్రక్రియను డీఆర్వో కె. మోహన్‌ కుమార్‌ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఐసీ డీఐవో ఎం. వెంకటేశ్వరరావు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Oct 31 , 2026 | 02:31 AM