ACB: విద్యాశాఖ ఏడీ ఆస్తులు రూ.1.60కోట్లు
ABN , Publish Date - Jan 21 , 2026 | 03:12 AM
మదనపల్లె డీఈవో కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న నాగిశెట్టి రాజశేఖర్ ఆస్తులు రూ.1.60కోట్లు వున్నట్లు ఏసీబీ అధికారులు లెక్కగట్టారు.
అన్నమయ్య, జనవరి 20(ఆంధ్రజ్యోతి): మదనపల్లె డీఈవో కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న నాగిశెట్టి రాజశేఖర్ ఆస్తులు రూ.1.60కోట్లు వున్నట్లు ఏసీబీ అధికారులు లెక్కగట్టారు. సోమవారం మదనపల్లె డీఈవో కార్యాలయం వద్ద గుర్రంకొండకు చెందిన ప్రైవేటు స్కూల్ యజమాని శేషాద్రినాయుడు నుంచి రూ.45వేలు లంచం తీసుకుంటూ ఏడీ రాజశేఖర్, సీనియర్ అసిస్టెంట్ మహబూబ్‌బాషా అలియాస్ మున్నా ఏసీబీ అధికారులకు పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏసీబీ డీఎస్పీ సీతారామరావు ఆధ్వర్యంలో మంగళవారం అధికారులు మదనపల్లె డీఈవో కార్యాలయం, రాయచోటిలోని రాజశేఖర్, మహబూబ్‌బాషాల నివాసాల్లో సోదాలు చేశారు. ఈ సోదాల్లో రాజశేఖర్ పేరుతో పాటు, అతడి కుటుంబ సభ్యుల పేరుమీద రూ.1.60కోట్ల విలువ చేసే ఆస్తులున్నట్లు గుర్తించారు. ఇందులో కర్నూలు జిల్లా కల్కూరు మండలం పందిపాడు గ్రామంలో 2020 సంవత్సరంలో రాజశేఖర్ రూ.38లక్షలతో ఇంటి స్థలం కొనుగోలు చేసి, అందులో రూ.82లక్షలతో రెండంతస్థుల భవనాన్ని నిర్మించాడు. దీంతో పాటు మహబూబ్‌నగర్ జిల్లా మనవపాడు మండలం పుల్లూరు గ్రామంలో రాజశేఖర్ భార్య పేరిట మరో ఇంటి స్థలం, రెండు మోటారు వాహనాలు, ప్రామిసరినోట్లు, నగదు, బంగారం, వెండి నగలు వున్నట్లు ఏసీబీ అధికారుల సోదాలో బయటపడ్డాయి.మంగళవారం పొద్దుపోయే వరకు కూడా రాయచోటిలోని రాజశేఖర్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తూనే వున్నారు. కాగా రాజశేఖర్, సీనియర్ అసిస్టెంట్ మహబూబ్‌బాషాపై ఏసీబీ అధికారులు అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇదిలా వుండగా మహబూబ్‌బాషా నివాసంలో బయటపడిన ఆస్తుల వివరాలు తెలియాల్సి వుంది.