Share News

Panchayats: గ్రేడ్లుగా పంచాయతీల విభజన

ABN , Publish Date - May 10 , 2026 | 01:03 AM

పంచాయతీ వ్యవస్థ ప్రక్షాళన దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పంచాయతీ కార్యదర్శులను ఇకపై పంచాయతీ అభివృద్ధి అధికారులు(పీడీవో)గా వ్యవహరించనున్నారు.

Panchayats: గ్రేడ్లుగా పంచాయతీల విభజన

4 రూర్బన్‌ పంచాయతీల ఏర్పాటు

చిత్తూరు కలెక్టరేట్‌, ఆంధ్రజ్యోతి: పంచాయతీ వ్యవస్థ ప్రక్షాళన దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆదాయం, జనాభా ప్రాతిపదికన బలోపేతానికి వైసీపీ పాలనలో ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థను హేతుబద్ధీకరిస్తున్నారు. నాలుగు గ్రేడ్లుగా పంచాయతీలను విభజించారు. పంచాయతీ కార్యదర్శులను ఇకపై పంచాయతీ అభివృద్ధి అధికారులు(పీడీవో)గా వ్యవహరించనున్నారు. ప్రతి పంచాయతీకి ఒక కార్యదర్శి తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఈనెల 15 లేదా జూన్‌ 1న కొత్త విధానాన్ని ప్రారంభించే అవకాశాలున్నాయి. పదివేల జనాభా, ఏడాదికి రూ. కోటి ఆపై ఆదాయం ఉన్న గ్రామ పంచాయతీలను రూర్బన్‌ పంచాయతీలుగా పరిగణిస్తారు. వీటికి పంచాయతీ కార్యదర్శి స్థాన ంలో డిప్యూటీ ఎంపీడీవోలను నియమించనున్నారు. నాలుగువేల నుంచి పదివేల మంది జనాభా, ఏడాదికి రూ. 50 లక్షలు ఆపై ఆదాయం, మండలకేంద్రంగా ఉన్న పంచాయతీలను గ్రేడ్‌ -1 గా ఎంపిక చేస్తారు. కార్యదర్శులు పాలనా వ్యవహారాలను పర్యవేక్షిస్తారు. 2 వేల నుంచి నాలుగువేల మంది జనాభా ఉన్న పంచాయతీలను గ్రేడ్‌-2గా, రెండువేల లోపు జనాభా ఉన్న పంచాయతీలను గ్రేడ్‌-3గా ఎంపిక చేస్తారు.

సిబ్బంది నియామకం

రూర్బన్‌ పంచాయతీలుగా గుర్తించిన స్పెషల్‌ గ్రేడ్‌ పంచాయతీలను చిన్న పురపాలక సంఘాలుగా ఏర్పాటు కానున్నాయి. ఇందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈక్రమంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌, జూనియర్‌ అసిస్టెంట్‌, ఇద్దరు బిల్‌కలెక్టర్లు, శానిటేషన్‌ ఇన్‌స్పెక్టర్‌, మేస్త్రీ, ఇద్దరు సూపర్‌వైజర్లు, హెల్త్‌ అసిస్టెంట్‌, డ్రెయిన్‌ క్లీనర్‌, ఎలక్ట్రీషియన్‌, సహాయ ఎలక్ట్రీషియన్‌, ఫిట్టర్‌, ట్యాంకు క్లీనర్‌, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌, వివిధ శాఖల సిబ్బంది ఉంటారు. గ్రేడ్‌-1 పంచాయతీల్లో 20 మంది, గ్రేడ్‌-2లో 12 మంది, గ్రేడ్‌-3లో తొమ్మిది మందిని నియమిస్తారు. ప్రస్తుతం గ్రేడ్‌-4, గ్రేడ్‌-5 పంచాయతీలను రద్దు చేస్తూ అక్కడి వారికి గ్రేడ్‌-3, గ్రేడ్‌-2 కార్యదర్శులుగా పదోన్నతి కల్పిస్తారు.


4 రూర్బన్‌ పంచాయతీల గుర్తింపు

రాబడి దృష్ట్యా కాణిపాకం పంచాయతీని రూర్బన్‌ పంచాయతీగా ఎంపికచేశారు. జనాభా ప్రాతిపదికన గంగవరం(10,950),కార్వేటినగరం(12,031),వి.కోట(23,388) పంచాయతీలను రూర్బన్‌ పంచాయతీలుగా గుర్తించింది. ఇక్కడ పట్టణ తరహా సేవలను అందించేందుకు కేబినేట్‌ ఆమోదముద్ర వేసింది. క్లస్టర్‌ వ్యవస్థను రద్దు చేసి పంచాయతీలను స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన స్థానిక సంస్థలుగా మార్చనుంది. పురపాలక సంఽఘం మాదిరిగానే ఈనాలుగు రూర్బన్‌ పంచాయతీల్లో పరిపాలన విభాగాలను ఏర్పాటు చేయనుంది. ప్రధానంగా గ్రామీణ ప్రణాళిక, ప్రజారోగ్యం, వీధిదీపాల నిర్వహణ, తాగునీటి సరఫరా, ఇంజనీరింగ్‌ విభాగాలు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా సిబ్బందిని నియమించనుంది. ఇల్లు, భవన నిర్మాణాలకు అనుమతులు, అక్రమ నిర్మాణాల నియంత్రణకు పురపాలక సంఘం మాదిరిగానే కంట్రీప్లానింగ్‌ విభాగాన్ని ఏర్పాటు చేయనుంది. సచివాలయాల్లో అధికంగా ఉన్న ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు, డిజిటల్‌ అసిస్టెంట్లు రూర్బన్‌ పంచాయతీల్లో గ్రామీణ ప్లానింగ్‌ అసిస్టెంట్లుగా నియమించనున్నారు.

Updated Date - May 10 , 2026 | 01:03 AM