Share News

Settipalle: శెట్టిపల్లె లబ్ధిదారులకు పట్టాల పంపిణీ

ABN , Publish Date - May 19 , 2026 | 12:46 AM

శెట్టిపల్లె భూ సమస్యలను పరిష్కరించిన తరహాలోనే దామినేడు, పద్మావతి పురంలో నలుగుతున్న భూ సమస్యలను పరిష్కరిస్తామని మంత్రులు అనగాని సత్యప్రసాద్‌, నారాయణ హామీ ఇచ్చారు.

Settipalle: శెట్టిపల్లె లబ్ధిదారులకు పట్టాల పంపిణీ
-పట్టాలందుకున్న మహిళలతో సంతోషాన్ని పంచుకుంటున్న మంత్రులు,ఎమ్మెల్యే నాని ,తుడా ఛైర్మన్‌ దివాకర రెడ్డి తదితరులు

- మంత్రులు సత్యప్రసాద్‌, నారాయణ

తిరుపతి సిటీ/తిరుపతి సెంట్రల్‌, మే 18(ఆంధ్రజ్యోతి): శెట్టిపల్లె భూ సమస్యలను పరిష్కరించిన తరహాలోనే దామినేడు, పద్మావతి పురంలో నలుగుతున్న భూ సమస్యలను పరిష్కరిస్తామని మంత్రులు అనగాని సత్యప్రసాద్‌, నారాయణ హామీ ఇచ్చారు.తిరుపతిలోని కచ్చపి ఆడిటోరియంలో సోమవారం సాయంత్రం జరిగిన శెట్టిపల్లె లబ్ధిదారులకు పట్టాల పంపిణీ కార్యక్రమంలో వారు మాట్లాడారు. శెట్టిపల్లె ప్రాంతంలో అర్హత కలిగిన లబ్ధిదారులను పారదర్శకంగా గుర్తించి పట్టాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు.లబ్ధిదారులు ప్రభుత్వంపై నమ్మకంతో ముందుకు సాగాలని, ఇంటి స్థలం మాత్రమే కాకుండా అవసరమైన మౌలిక వసతులు, రహదారులు, తాగునీరు, విద్యుత్‌ వంటి సదుపాయాలను కూడా దశలవారీగా అభివృద్ధి చేస్తామన్నారు. భవిష్యత్తులో మరిన్ని ప్రాంతాల్లో కూడా ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమాలను నిర్వహిస్తామని వెల్లడించారు. కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ మాట్లాడుతూ శెట్టిపల్లె ప్రజల దశాబ్దాల ఎదురుచూపులకు ముగింపు పలుకుతూ భూ సమస్యను రాష్ట్రప్రభుత్వం పరిష్కరించిందన్నారు. రెండు వేలకుపైగా కుటుంబాల సమస్యను భూ సమీకరణ విధానంలో పరిష్కరించేందుకు సీఎం చంద్రబాబు ఎంతో చొరవ తీసుకున్నారన్నారు. రెవెన్యూ, మున్సిపల్‌ శాఖల ఉన్నతాధికారులు, తుడా చైర్మన్‌, స్థానిక ప్రజాప్రతినిధులు కలిసి కృషి చేయడం వల్లే ఈరోజు ప్రజలకు రిజిస్ట్రేషన్‌ పత్రాలు అందించగలిగామన్నారు.తుడా ఛైర్మన్‌ దివాకర రెడ్డి మాట్లాడుతూ భూ రిజిష్ట్రేషన్‌ ఫీజు భరించలేమన్న పేదవర్గాల వారి వినతిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళగా రూ17.5 కోట్ల రిజిస్ట్రేషన్‌ ఫీజును మాఫీ చేశారన్నారు. జేసీ గోవిందరావు మాట్లాడుతూ ఈ-డిప్‌ ద్వారా భూ కేటాయింపులు జరిపారని తెలిపారు. తుడా, రిజిష్ట్రేషన్‌ సిబ్బంది సహకారంతో త్వరగా లబ్ధిదారులకు పత్రాలు అందజేయగలిగామన్నారు.ఎమ్మెల్యేలు పులివర్తి నాని, గాలి భాను ప్రకాష్‌, బొజ్జల సుధీర్‌ రెడ్డి, నెలవల విజయశ్రీ, పాశం సునీల్‌కుమార్‌, ఎమ్మెల్సీ శ్రీకాంత్‌, టీటీడీ బోర్డు సభ్యురాలు పనబాక లక్ష్మి, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు సుగుణమ్మ, నరసింహ యాదవ్‌, డాక్టర్‌ పసుపులేటి హరిప్రసాద్‌, రుద్రకోటి సదాశివం, సీఆర్‌ రాజన్‌, మాజీ మంత్రి పరసా రత్నం, ఆర్డీవో రామ్మోహన్‌, తుడా సెక్రటరీ శ్రీకాంత్‌ రెడ్డి, ఎస్‌ఈ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.


పండుగ వాతావరణం.....అవధులు దాటిన ఆనందం

శెట్టిపల్లెవాసుల చిరకాల స్వప్నం నెరవేరింది.దశాబ్దాల కాలంగా తమ స్థలాలపై తమకే హక్కులేక నిరాశగా ఎదురుచూస్తున్న వేలాదిమందికి ప్రభుత్వం రిజిస్టర్డ్‌ పట్టాలు అందచేయడంతో లబ్ధిదారుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.మంత్రులపై పూలవర్షం కురిపించి ఘనంగా హారతులు పట్టి స్వాగతం పలికారు.పట్టాలందుకున్న క్షణంలో పలువురు లబ్ధిదారులు భావోద్యేగానికి గురయ్యారు.ఈ రోజును జీవితాంతం మరచిపోమంటూ సంతోషం వ్యక్తం చేశారు.మంత్రులకు, తుడా చైర్మన్‌కు, అధికారులకు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. త్వరలోనే దామినేడు, పద్మావతిపురం, శ్రీనివాసపురం, సాయినగర్‌, తనపల్లె, కుంట్రపాకం ప్రాంతాల సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే పులివర్తి నాని కోరగా మంత్రి సత్యప్రసాద్‌ త్వరలోనే ఆ సమస్యలను కూడా ల్యాండ్‌ పూలింగ్‌ ద్వారా త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జనం పలు సమస్యలపై మంత్రులకు వినతి పత్రాలు అందజేశారు. వాటిని పరిశీలించి అక్కడికక్కడే పరిష్కరించాలని కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ను ఆదేశించారు.

Updated Date - May 19 , 2026 | 12:46 AM