Crop loans{ స్తంభించిన పంట రుణాల పంపిణీ
ABN , Publish Date - Feb 23 , 2026 | 02:35 AM
తమ సమస్యల పరిష్కారం కోసం సింగిల్ విండో సిబ్బంది వారం రోజులుగా నిరవధిక సమ్మెలోకి వెళ్లారు. దీని ప్రభావంతో రైతులకు రూ.200 కోట్ల స్వల్ప, దీర్ఘకాలిక రుణ పంపిణీ ఆగిపోయింది.
ఆగిన రుణ వసూళ్లు
చిత్తూరు కలెక్టరేట్, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): తమ సమస్యల పరిష్కారం కోసం సింగిల్ విండో సిబ్బంది వారం రోజులుగా నిరవధిక సమ్మెలోకి వెళ్లారు. దీని ప్రభావంతో రైతులకు రూ.200 కోట్ల స్వల్ప, దీర్ఘకాలిక రుణ పంపిణీ ఆగిపోయింది. సింగిల్ విండో కార్యాలయాలు మూతపడటంతో ఆర్థిక లావాదేవీలు స్తంభించాయి. అన్ని కార్యాలయాల ఎదుట సమ్మెలో వెళుతున్నందున మూసివేస్తున్నట్లు బోర్డులు అంటించారు. ఉమ్మడి జిల్లాలో 75 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (సింగిల్ విండోలు) ఉండగా సుమారు 300మంది సీఈవోలు, స్టాఫ్ అసిస్టెంట్లు, సబ్ స్టాఫ్ సమ్మెలోకి దిగారు. దీంతో బంగారంపై రుణాలు, విత్తనాలు, యూరియా, క్రిమి సంహారక మందుల పంపిణీ నిలిచిపోయాయి. సమ్మె విషయం తెలియక రైతులు విండో కార్యాలయాలకు వచ్చి తాళాలు వేసి ఉండటంతో వెనుదిరిగి పోతున్నారు. లావాదేవీలు అర్ధంతరంగా ఆగిపోయి ఆఫీసులకు తాళాలు పడటంతో విండో చైర్మన్లు కూడా అటు రావడంలేదు. మార్చి నెలాఖరులోగా వంద శాతం రుణ రికవరీ చేయాల్సి ఉండగా.. అన్ని రకాల రుణాల వసూళ్లు అర్ధంతరంగా ఆగాయి. దీంతో పరోక్షంగా విండోల ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. తమ డిమాండ్లను సాధించే వరకు సమ్మెను కొనసాగిస్తామని విండో ఉద్యోగుల అధ్యక్షుడు విజయ్‌కుమార్, ప్రధాన కార్యదర్శి రమేష్ తెలిపారు. మరి.. ఎన్ని రోజులు సమ్మె కొనసాగుతుందోనని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.