Share News

Votes: 2,87,835 ఓట్ల తొలగింపునకు నిర్ణయం!

ABN , Publish Date - Aug 31 , 2026 | 01:47 AM

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌)లో ఆదివారం మరో కీలక దశ ముగిసింది.

Votes: 2,87,835 ఓట్ల తొలగింపునకు నిర్ణయం!
తిరుచానూరు చైతన్యపురంలో ఓటర్లతో మాట్లాడుతున్న కలెక్టర్‌ వెంకటేశ్వర్‌

తిరుపతి(కలెక్టరేట్‌), ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌)లో ఆదివారం మరో కీలక దశ ముగిసింది. జిల్లాలోని 17,69,438 ఓటర్లకుగాను వెరిఫికేషన్‌లో ఆచూకీ లేని ఓటర్లు, డబుల్‌ ఎంట్రీలు, మృతిచెందిన వారు(ఏఎ్‌సడీడీ) జాబితాలో 2,87,835 మంది చేరారు. దీంతో 14,81,603మంది ఓటర్లు తేలడంతో మొదటి దశ పూర్తయింది. జూలై 31వ తేదీన ముసాయిదా ఓటర్ల జాబితానూ ప్రకటించారు. అయితే ఏఎ్‌సడీడీ జాబితాలోని ఓటర్ల నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడంతో ఈ ఓట్లన్నీ తొలగించాలని అధికారులు నిర్ణయించారు. వీటిల్లో అత్యధిక ఓట్లు తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గాల్లోనే ఉండటం గమనార్హం. ఇక 2002 ఓటర్ల జాబితాతో మ్యాపింగ్‌ కానివారికి, అక్షర దోషాలు ఉన్నవారికి (నో మ్యాపింగ్‌, అనామలిస్‌) కింద 4.01లక్షల మందికి నోటీసులు జారీ చేశారు. తర్వాత అభ్యంతరాలు స్వీకరించడంతోపాటు కొత్తఓటర్ల నమోదు(ఫారం6), పేర్ల తొలగింపు లేదా అభ్యంతరాలు(ఫారం 7), చిరునామా మార్పులు, చేర్పులు(ఫారం8) సమర్పించేందుకు నిర్దేశించిన గడువు ఆదివారంతో ముగిసింది. దీంతో సర్‌ రెండో దశ పూర్తయ్యింది. తిరుపతి రూరల్‌ పరిధిలోని చైతన్యపురంలోని మండల పరిషత్‌ పాఠశాలలో నిర్వహించిన ప్రత్యేక శిబిరాన్ని కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ తనిఖీ చేశారు. సిబ్బందికి, ఓటర్లకు పలు సూచనలిచ్చారు.

నోటీసుల పరిష్కారానికి సెప్టెంబరు 28వరకు గడువు

ఏడు నియోకవర్గాల పరిధిలో నోటీసులు అందుకున్న 4.01లక్షల మంది ఓటర్లలో 1.40లక్షల మంది విచారణ ప్రక్రియ ముగిసింది. స్పందించని ఓటర్లకు రెండోసారి కూడా నోటీసులు అందజేస్తారు. వీరందజేసే అభ్యంతరాలు, ఫిర్యాదులను సెప్టెంబరు 28వ తేదీలోపు పరిష్కరిస్తారు. ఒకవేళ ఈ గడువులోగా స్పందించని వారి పేర్లను కూడా ఓటరు జాబితా నుంచి తొలగిస్తారని అధికారులు స్పష్టం చేశారు. ఆ తర్వాత అక్టోబరు 3న తుది ఓటర్ల జాబితాను ప్రకటించడంతో సర్‌ ప్రక్రియ పూర్తవుంది.


కొత్త ఓటు నమోదు, చిరునామాల

మార్పులకు 7వేల దరఖాస్తులు

కొత్తఓటర్ల నమోదుకు(18 సంవత్సరాలు నిండినవారు, ఇప్పటి వరకు ఓటు హక్కులేనివారు) సుమారు 4,500 దరఖాస్తులు అందాయని జిల్లా అధికారులు తెలిపారు. ఓట్ల తొలగింపు, అభ్యంతరాలకు 2వేల దరఖాస్తులు, చిరునామాల మార్పు, చేర్పులకు సంబంధించి 2,600 దరఖాస్తులు బీఎల్వోలకు అందాయి. వీటిని సోమవారం నుంచి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. అక్టోబరు 3న తుది ఓటర్ల జాబితా ప్రకటించాక కొత్త ఓటరు దరఖాస్తులు స్వీకరిస్తామని జిల్లా యంత్రాంగం తెలిపింది.

‘సర్‌’పై ఓటర్లకు పక్కాగా అవగాహన కల్పించాం

సర్‌ ప్రక్రియపై ఓటర్లకు పక్కాగా అవగాహన కల్పించాం. ఇప్పటివరకు 1.40లక్షల మంది విచారణ పూర్తయ్యింది. సెప్టెంబరు 28వ తేదీ వరకు ఓటర్ల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి.. అక్టోబరు 3న తుది ఓటర్ల జాబితా ప్రకటిస్తాం.

- కలెక్టర్‌ వెంకటేశ్వర్‌

Updated Date - Aug 31 , 2026 | 01:47 AM