Share News

Road: ఎన్‌హెచ్‌లపై అక్రమదారుల మూసివేత

ABN , Publish Date - Sep 11 , 2026 | 01:33 AM

ఎన్‌హెచ్‌పై నిబంధనలకు వ్యతిరేకంగా అడ్డదారులను ఏర్పాటు చేసుకుని ప్రమాదాలను కొనితెచ్చుకోవద్దని అధికారులు కోరారు.

Road: ఎన్‌హెచ్‌లపై అక్రమదారుల మూసివేత
బుధవారం రాత్రి క్రాష్‌ బారియర్‌ను కూల్చివేసిన గుర్తుతెలియని వ్యక్తులు (ఇన్‌సెట్‌) గురువారం క్రాష్‌ బారియర్‌ ఏర్పాటుచేసి పర్యవేక్షిస్తున్న ఎంవీఐ రాజేశ్వర్‌రావు

చిత్తూరు సిటి, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారులపై అడ్డదారులకు అధికారులు అడ్డుకట్ట వేశారు. అక్రమదారుల కారణంగా ప్రమాదాలు జరుగుతుండటంపై ఈ నెల 8వ తేదీన ‘ప్రమాదాలకు అడ్డంగా పోతున్నారు’ శీర్షికన ఆంధ్రజ్యోతిలో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని ఎన్‌హెచ్‌ పీడీ వెంకటేశ్వర్లు, డీటీసీ నిరంజన్‌రెడ్డిని ఆదేశించారు. దీంతో అధికారులు బుధవారం చెర్లోపల్లెవద్ద అక్రమంగా ఏర్పాటు చేసిన దారికి వంద అడుగుల మెటల్‌ క్రాష్‌ బారియర్‌ ఏర్పాటు చేశారు. అదే రోజురాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాన్ని ఎక్స్‌కవేటర్‌తో కూల్చివేశారు. అధికారులు తిరిగి గురువారం మెటల్‌ క్రాష్‌ బారియర్‌ను మళ్లీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎన్‌హెచ్‌ పీడీ వెంకటేశ్వర్లు, డీటీసీ నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజలు రహదారి భద్రతా నియమాలను పాటించాలన్నారు. ప్రాణాలు చాలా విలువైనవని, వాటిని కాపాడుకోవాలని హితవు పలికారు. ఎన్‌హెచ్‌పై నిబంధనలకు వ్యతిరేకంగా అడ్డదారులను ఏర్పాటు చేసుకుని ప్రమాదాలను కొనితెచ్చుకోవద్దని కోరారు. ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించినా, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Updated Date - Sep 11 , 2026 | 01:33 AM