Share News

Tirupati: ‘స్వచ్ఛ’ తిరుపతి

ABN , Publish Date - Nov 11 , 2026 | 12:25 AM

తిరుపతి నగరం మరోసారి జాతీయస్థాయిలో ప్రత్యేకతను చాటుకుంది. స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డుల్లో వరుసగా నాలుగోసారి పురస్కారాన్ని సొంతం చేసుకుని అరుదైన గుర్తింపును అందుకుంది.

Tirupati: ‘స్వచ్ఛ’ తిరుపతి
తిరుపతి నగరం

తిరుపతి సిటీ/సెంట్రల్‌,నవంబరు 10(ఆంధ్రజ్యోతి): తిరుపతి నగరం మరోసారి జాతీయస్థాయిలో ప్రత్యేకతను చాటుకుంది. స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డుల్లో వరుసగా నాలుగోసారి పురస్కారాన్ని సొంతం చేసుకుని అరుదైన గుర్తింపును అందుకుంది. నగర పారిశుధ్య నిర్వహణ, వ్యర్థాల సేకరణ, పరిసరాల పరిశుభ్రత వంటి అంశాల్లో సాధించిన ప్రగతికి లభించిన ఈ పురస్కారాన్ని బుధవారం ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్‌ జయకృష్ణ,అదనపు కమిషనర్‌ శారదాదేవి,డీఈ రమణ, స్వచ్ఛ సర్వేక్షణ్‌ సిబ్బంది మస్తాన్‌ తదితరులు స్వీకరించనున్నారు. 2019 నుంచి వరుసగా జాతీయ స్థాయిలో మొదటి నాలుగైదు లోపు ర్యాంకులు సాధించిన తిరుపతి సూపర్‌ స్వచ్ఛలీగ్‌ జాబితాలోనూ ఉంటోంది. స్వచ్ఛషహర్‌ జోడి విభాగంలో జాతీయ స్థాయిలో టాప్‌-3 విభాగంలో నిలిచిన 25 నగరాలతో పోటీపడి రాష్ట్రపతి అవార్డు దక్కించుకుంది.

కుప్పానికి మెంటార్‌గా తిరుపతి

తిరుపతిలో అమలవుతున్న స్వచ్ఛ చర్యలను ఇతర పట్టణాల్లో కూడా అమలుపరిచి స్వచ్ఛ ఆదర్శంగా తీర్చిదిద్దాలన్న స్వచ్ఛ షహర్‌ జోడి ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా కుప్పం, జమ్మలమడుగు, మైదుకూరు, మడకశిర, కమలాపురం మున్సిపాల్టీలను తిరుపతికి అప్పగించింది. వీటిలో కుప్పం మున్సిపాలిటీ స్వచ్ఛ సర్వేక్షణ్‌ పోటీలకు ఎంపికైంది. మెంటార్‌గా వ్యవహరించిన తిరుపతికి స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డు లభించింది. ప్లాస్టిక్‌ వ్యర్థాలపై రెడ్యూస్‌, రీయూజ్‌, రీసైకిల్‌(ట్రిపుల్‌ ఆర్‌) విధానం అమలు, పార్కులు, పర్యాటక, రద్దీ ప్రాంతాల్లో పరిశుభ్రత చర్యలను పరిగణనలోకి తీసుకుని వార్షిక సర్వే ఆధారంగా అవార్డులను ప్రకటిస్తారు. దేశంలోని అలాంటి 25 ఉత్తమ స్వచ్ఛ నగరాలను స్వచ్ఛ లీగ్‌ విభాగంలో చేర్చి ఈ పోటీలు నిర్వహిస్తుంటారు. ఇంటింటి చెత్త సేకరణ, మరుగుదొడ్ల నిర్వహణ, సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్మెంట్‌, డంపింగ్‌ యార్డుల్లో చెత్త నిల్వల్ని తగ్గించడం, ప్రభుత్వ గోడలపై బొమ్మలు, సుందరీకరణ, వ్యర్థాల నుంచి పరికరాల తయారీ, ఈ- వేస్ట్‌ సేకరణ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని స్వచ్ఛత పోటీల్లో అదికారులు చేసిన కృషి ఫలితంగా ఈ అవార్డు దక్కింది. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోనుండడం తమ బాధ్యత మరింత పెంచిందని కమిషనర్‌ జయకృష్ణ చెప్పారు. ఇక ముందు కూడా తిరుపతిని మరింత పరిశుభ్రంగా వుంచేందుకు ప్రణాళికాబద్దంగా ముందుకు వెళతామని వివరించారు.

Updated Date - Nov 11 , 2026 | 12:25 AM