Chandra Babu: పనితీరు మార్చుకోండి
ABN , Publish Date - Feb 23 , 2026 | 02:46 AM
రాజంపేట పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో టీడీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జులు పనితీరు మార్చుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించినట్లు సమాచారం.
అన్నమయ్య, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): రాజంపేట పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో టీడీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జులు పనితీరు మార్చుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించినట్లు సమాచారం. ఎవరు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు? ఎవరు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు? అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో చొరవ చూపుతోంది ఎవరు? ఎవరి కుటుంబ సభ్యులు పార్టీ, పాలన వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారు? ఇసుక అక్రమ రవాణా, మట్టితవ్వకాలు, భూముల ఆక్రమణ వంటి వాటిలో ఎవరెవరు భాగస్వామ్యులయ్యారు? వంటి వివరాలతో కూడిన నివేదికను తెప్పించుకున్న ముఖ్యమంత్రి ఇటీవల టీడీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లతో ముఖాముఖి మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన చర్చించిన అంశాలు, చేసిన సూచనల్లో ముఖ్యమైనవి ఇవీ..
జిల్లా కేంద్రాన్ని రాయచోటినుంచి మదనపల్లెకు మార్చడం స్థానిక ప్రజల్లో అసంతృప్తిని కలిగించింది. మంత్రి మండిపల్లె రాంప్రసాద్‌రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్‌బాబు మధ్య సఖ్యత కొరవడటం కూడా పార్టీని బలహీనపరుస్తోంది.
రైల్వేకోడూరులో నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ముక్కా రూపానందరెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు పార్టీ, పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటుండటం సీనియర్ నాయకుల్లో అసంతృప్తిని పెంచుతోంది. పార్టీ కార్యక్రమాలపై ముఖ్యనాయకులకే సమాచారం ఉండటం లేదు.
రాజంపేట నియోజకవర్గంలో టీడీపీ ఇన్‌ఛార్జ్ చమర్తి జగన్మోహన్‌రాజు, బత్యాల చెంగల్రాయుడు, సుగవాసి బాలసుబ్రమణ్యం వర్గాల మధ్య సఖ్యత కుదిరితే పార్టీకి బలం పెరుగుతుంది.
గత ఎన్నికల్లో తంబళ్లపల్లె నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన జయచంద్రారెడ్డి నకిలీ మద్యం కేసులో చిక్కుకోవడంతో పార్టీ నుంచి సస్పెండు చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇక్కడ పార్టీ ఐదు గ్రూపులుగా చీలిపోయి బలహీనపడింది.
జిల్లా కేంద్రాన్ని మదనపల్లెకు మార్చినప్పటికీ ఆ క్రెడిట్ పార్టీకి దక్కించడంలో ఎమ్మెల్యే షాజహాన్‌బాషాతో పాటు నాయకులు విఫలమయ్యారు. రెండు, మూడు గ్రూపులుండటం కూడా టీడీపీ బలోపేతానికి అడ్డంకిగా మారింది.
పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి చురుగ్గా లేకపోవడంతో పార్టీ క్యాడర్ నిస్తేజమవుతోంది. ఇటీవలి పరిణామాలతో పార్టీ మండలాల అధ్యక్షులు రెండు గ్రూపులుగా విడిపోయారు.
పీలేరులో పార్టీ కార్యక్రమాల అమలులో ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డికి, పార్టీ క్యాడర్‌కు మధ్యలో గ్యాప్ ఏర్పడింది.
రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి అందుబాటులో ఉండకపోవడాన్ని, మద్యం స్కామ్‌లో అరెస్టు కావడాన్ని టీడీపీ నాయకులు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లలేకపోయారు. బలిజ సామాజిక వర్గానికి చెందిన ఓ సీనియర్ నాయకుడు టీడీపీలోని అంతర్గత విభేధాల కారణంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడం పార్టీకి నష్టం చేస్తోంది. పార్టీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్‌బాబు ఈ విషయంపై దృష్టి పెట్టడంతో పాటు ఆ సామాజికవర్గంలో యువనాయకులను ఆకర్షించాలి. మిగిలిన నియోజకవర్గాల్లోనూ స్థానిక ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుని పార్టీ కార్యక్రమాలన్నీ సజావుగా జరిగేలా చూడాలి. రాయచోటిలో వైద్య కళాశాల ఏర్పాటుపై సీఎం హామీని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం సూచించినట్లు సమాచారం.