Share News

Jagan case: విలేకరి జగన్‌ హత్య కేసులో మరో నిందితుడి అరెస్టు

ABN , Publish Date - Jul 21 , 2026 | 12:52 AM

వి.కోట ఆంధ్రజ్యోతి రిపోర్టర్‌ జగన్మోహన్‌రెడ్డి హత్య కేసులో మరో నిందితుడు సాదత్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

Jagan case: విలేకరి జగన్‌ హత్య కేసులో మరో నిందితుడి అరెస్టు
సాదత్‌

చిత్తూరు, జూలై 20 (ఆంధ్రజ్యోతి): వి.కోట ఆంధ్రజ్యోతి రిపోర్టర్‌ జగన్మోహన్‌రెడ్డి హత్య కేసులో మరో నిందితుడు సాదత్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో హంతకులు ఏ1 తమీమ్‌, ఏ2 సుభాన్‌ను అప్పట్లోనే అరెస్టు చేయగా.. సూత్రధారులైన శ్రీనివాసులు, దొరస్వామిని ఇటీవల రిమాండుకు పంపించారు. తాజాగా వి.కోటకు చెందిన భారత్‌ సినిమా థియేటర్‌ యజమాని సాదత్‌కూ జగన్‌ హత్యలో ప్రమేయం ఉందని అరెస్టు చేసి రిమాండుకు పంపించారు. వివరాలిలా ఉన్నాయి. సాదత్‌ తండ్రి ఇక్బాల్‌ టీడీపీలో సీనియర్‌ నేత. వి.కోట మండలానికి చెందిన ఓ వైసీపీ నేతతో వీరికి చాలాకాలంగా భూవివాదం ఉంది. వైసీపీ నేతకు అనుకూలంగా కోర్టు తీర్పు రావడంతో.. అతడు ఓ రాత్రి ఎక్స్‌కవేటర్‌ను, మనుషుల్ని తీసుకెళ్లి ఆ భూమిని చదును చేయించాడు. అడ్డొచ్చిన సాదత్‌ తదితరుల్ని అతడి అనుచరులు కొట్టారని సమాచారం. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ ఘటన జరిగింది. అందుకనే అప్పట్లో ఆ వైసీపీ నేత మీద ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపణలున్నాయి. ఈ చర్యతో వైసీపీ నేతతో పాటు, అతడికి ఆప్త మిత్రుడైన రిపోర్టర్‌ జగన్‌ కూడా దీనికి కారణమని భావించి సాదత్‌ కసి పెంచుకున్నాడు. దీన్ని అవకాశంగా తీసుకున్న దొరస్వామి, తన క్లాస్‌మేట్‌ అయిన సాదత్‌ను కలిసి మరింత రెచ్చగొట్టాడు. జగన్‌ను చంపేందుకు ఓ వ్యక్తిని సిద్ధం చేశామని, డబ్బు ఖర్చు పెట్టడంతో పాటు బెయిల్‌ విషయం చూసుకోవాలంటూ సాదత్‌ను దొరస్వామి ఒప్పించాడు. తన పేరు బయటకు రాకుండా చేయమని సాదత్‌ చెప్పాడు. ఆ తర్వాత తమీమ్‌ను తీసుకొచ్చి సాదత్‌తో మీటింగ్‌ ఏర్పాటు చేశాడు దొరస్వామి. డబ్బులు ఇవ్వకపోయినా, తమీమ్‌కు బెయిల్‌ కోసం ప్రయత్నించకపోయినా.. దొరస్వామి మాటలకు ప్రేరేపితమై తమీమ్‌తో కలిసి హత్యకు ప్లాన్‌ చేశాడనే ఆధారాలతో పోలీసులు సాదత్‌ను ఈ కేసులో నిందితుడిగా చేర్చారు. కాగా, జగన్‌ను తమీమ్‌ హత్య చేశాక.. ప్లాన్‌ మేరకు దొరస్వామికి తెలిసింది. ఈ హత్య విషయాన్ని అతడు శ్రీనివాసులుకు.. ఆయన సాదత్‌కు చెప్పాడు.

Updated Date - Jul 21 , 2026 | 12:52 AM