Share News

Collector: అవినీతి ఆరోపణలతో తహసీల్దార్లపై చర్యలు

ABN , Publish Date - Feb 23 , 2026 | 02:50 AM

‘అవినీతికి పాల్పొడొద్దు. నిబంధనలకు వ్యతిరేకంగా చేయొద్దు. ప్రజల్ని, రైతుల్ని ఇబ్బంది పెట్టొద్దు. రాజకీయంగా ఇబ్బంది ఉంటే నాకు చెప్పండి. మీ తప్పు లేకుంటే నేను కల్పించుకుని పరిష్కరిస్తా’ అంటూ తహసీల్దార్ల సమావేశాల్లో ప్రతిసారి కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ చేస్తున్న సూచనలివీ.

Collector: అవినీతి ఆరోపణలతో తహసీల్దార్లపై చర్యలు

జాగ్రత్తగా పనిచేసుకోవాలంటూ హెచ్చరించి మరీ పోస్టింగులిస్తున్న కలెక్టర్‌

కలెక్టర్‌ హితబోధ

‘అవినీతికి పాల్పొడొద్దు. నిబంధనలకు వ్యతిరేకంగా చేయొద్దు. ప్రజల్ని, రైతుల్ని ఇబ్బంది పెట్టొద్దు. రాజకీయంగా ఇబ్బంది ఉంటే నాకు చెప్పండి. మీ తప్పు లేకుంటే నేను కల్పించుకుని పరిష్కరిస్తా’ అంటూ తహసీల్దార్ల సమావేశాల్లో ప్రతిసారి కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ చేస్తున్న సూచనలివీ.

అయినా, కొందరు మారలేదు

కొందరు తహసీల్దార్ల వ్యవహార శైలి మారలేదు. ఇప్పుడు అవినీతి ఆరోపణలు వచ్చేవారిపై కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ చర్యలు తీసుకుంటున్నారు. అలా అవినీతి ఆరోపణలు వచ్చిన ఐదుగురిని ఇటీవల కలెక్టరేట్‌కు అటాచ్‌ చేసి, పోస్టింగ్‌ ఇవ్వలేదు.

వచ్చే వాళ్లూ వాళ్లే!

అలాగని, వారి స్థానాల్లో వచ్చినవారూ అవినీతి మరకలు లేనివారేం కాదు. కానీ, ఉన్న అధికారులనే నియమించుకోక తప్పని పరిస్థితి. అందుకని వీరికి కలెక్టర్‌ హెచ్చరికలు చేసి.. మందలించి.. జాగ్రత్తగా పనిచేసుకోవాలంటూ సుద్దులుచెప్పి మరీ పోస్టింగులిచ్చారు.. ఇస్తున్నారు.

వైసీపీ హయాంలో తహసీల్దార్ల మీద రాజకీయ పెత్తనం ఎక్కువగా ఉండేది. తమ మాట వినని తహసీల్దార్లను స్థానిక ఎమ్మెల్యేలు రాత్రికి రాత్రే బదిలీ చేసేవారు. విభజిత జిల్లాలోని 31 మండలాల్లో ఏకంగా 8 చోట్ల డిప్యూటీ తహసీల్దార్లకు ఇన్‌ఛార్జి బాధ్యతల్ని అప్పగించారు. అలా సోమల మండలంలో శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి అనే డీటీ ఏకంగా ఐదేళ్ల పాటు ఇన్‌ఛార్జి తహసీల్దార్‌గా కొనసాగారంటే పెద్దిరెడ్డికి ఎంత విధేయుడో తెలుస్తోంది. అప్పట్లో, రెగ్యులర్‌ తహసీల్దార్లు ఉన్నా, వారికి పోస్టింగ్‌ ఇవ్వకుండా మాట వినే డీటీలకే బాధ్యతలు అప్పగించేవారు. మాట వినని తహసీల్దార్లకు ప్రతి నెలా బదిలీలు వచ్చేవి. మరిప్పుడు గతంతో పోలిస్తే తహసీల్దార్ల పోస్టింగుల విషయంలో రాజకీయ పెత్తనం తగ్గింది. ఇప్పుడు అవినీతి ఆరోపణలు వచ్చేవారి మీద కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ క్షణాల్లో చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల ఐదుగురిని బదిలీ చేశారు. ఆరోపణలు వస్తున్న మరో ఇద్దరు తహసీల్దార్ల మీద త్వరలో చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

తవణంపల్లెలో ఇద్దరిదీ అదే దారి

తవణంపల్లెలో డీటీ సుధాకర్‌ ఇన్‌ఛార్జి తహసీల్దార్‌గా పనిచేసేవారు. ఆయన మీద ఆరోపణలు రావడంతో కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ కలగజేసుకుని ఆయన్ను చిత్తూరు ఆర్డీవో ఆఫీసుకు డిప్యుటేషన్‌ వేశారు. ఆయన స్థానంలో వచ్చిన మాధవరాజు గంగవరం, బైరెడ్డిపల్లె, చౌడేపల్లె మండలాల్లో తహసీల్దార్‌గా పనిచేశారు. దాదాపు అన్నిచోట్లా ఆయన మీద ఆరోపణలు రావడంతో కలెక్టరేట్‌లో కొన్ని నెలలు పోస్టింగ్‌ లేకుండా పెట్టేశారు. ఇప్పుడు అవకాశం లేక, మందలింపుతో తవణంపల్లె తహసీల్దార్‌గా పోస్టింగ్‌ ఇచ్చారు. మాధవరాజు మీద సీసీఎల్‌ఏలో పలు విచారణలు పెండింగులో ఉన్నాయి.

సుదీర్ఘకాలానికి బంగారుపాళ్యంలో పోస్టింగ్‌

బంగారుపాళ్యంలో పనిచేసిన రాజేంద్రప్రసాద్‌ గతేడాది అక్టోబరులో రిటైరయ్యారు. ఆ తర్వాత నెల రోజులకు సుదీర్ఘంగా పోస్టింగ్‌ లేకుండా కలెక్టరేట్‌లో ఉన్న షబ్బీర్‌ బాషాకు అవకాశం ఇచ్చారు. ఆయన కూడా కొన్నేళ్ల కిందట ఎస్‌ఆర్‌పురంలో ఏసీబీకి చిక్కి సస్పెండయ్యారు. ఈయన్నూ కలెక్టర్‌ గట్టిగా మందలించి, తదుపరి చిన్న ఆరోపణ వచ్చినా కఠిన చర్యలు తీసుకుంటానని చెప్పి మరీ పోస్టింగ్‌ ఇచ్చారు.


పెద్దపంజాణి, చిత్తూరు రూరల్‌లోనూ అదే పరిస్థితి

పెద్దపంజాణి, చిత్తూరు రూరల్‌ తహసీల్దార్లు హనుమంతు నాయక్‌, జయప్రకాష్‌ మీద ఆరోపణలు వస్తే కలెక్టరేట్‌కు బదిలీ చేశారు. హనుమంతు మే 31న రిటైర్‌ కానున్నారు. చౌడేపల్లెలో డీటీగా ఉన్న రామ్మూర్తి పెద్దపంజాణికి, బంగారుపాళ్యంలో డీటీగా ఉన్న కళ్యాణి చిత్తూరు రూరల్‌ మండలానికి ఇన్‌ఛార్జి తహసీల్దార్లుగా నియమితులయ్యారు.

ఆమె మీదా ఆరోపణలు

పాలసముద్రం తహసీల్దార్‌ అరుణకుమారి మీద విపరీతమైన ఆరోపణలు వస్తుంటే నాలుగు నెలల కిందట కలెక్టరేట్‌కు మార్చారు. ఆమె స్థానంలో ప్రస్తుతం గుర్రప్ప పనిచేస్తున్నారు. గతలలో పూతలపట్టులో సమర్థంగా పని చేయడం లేదని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ కలెక్టరేట్‌కు మార్చారు. ఆ తర్వాత ఆయనకు పలు సూచనలు చేసి పాలసముద్రంలో పోస్టింగ్‌ ఇచ్చారు.

- చిత్తూరు, ఆంధ్రజ్యోతి

Updated Date - Feb 23 , 2026 | 02:50 AM