NREGA: రూ.50 కోట్లతో 996 పనుల మంజూరు
ABN , Publish Date - May 06 , 2026 | 12:58 AM
జిల్లాలో జలధార పనులు జోరందుకున్నాయి. భూగర్భజలాల పెంపు లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వంద రోజుల కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 6న ప్రారంభమైన ఈ ప్రోగ్రామ్ జూలై 14 వరకు జరుగుతుంది.
జూలై 7లోగా పూర్తికి చర్యలు
చిత్తూరు, మే 5 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో జలధార పనులు జోరందుకున్నాయి. భూగర్భజలాల పెంపు లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వంద రోజుల కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 6న ప్రారంభమైన ఈ ప్రోగ్రామ్ జూలై 14 వరకు జరుగుతుంది. ఏప్రిల్ 6 నుంచి 20 వరకు పనుల్ని గుర్తించి అనుమతులు మంజూరు చేశారు. ఏప్రిల్ 21 నుంచి జూలై 7 వరకు ఆ పనుల్ని పూర్తి చేయాల్సి ఉంది. ఉపాధిహామీ పనుల ద్వారా పనుల్ని చేపట్టేందుకు ఇప్పటివరకు రూ.50 కోట్లను కేటాయించారు. ఉపాధి కూలీలు రోజూ ఈ పనుల్లో శ్రమిస్తున్నారు. కూలీలతో కాకుండా మిషనరీతో చేయాల్సిన పనుల కోసం రూ.2 కోట్లను ఇరిగేషన్ శాఖ ద్వారా ఖర్చు చేయనున్నారు. ఈ రూ.2 కోట్లను కలెక్టర్ సుమిత్‌కుమార్ కేటాయించనున్నారు. కలెక్టర్ జలధార కార్యక్రమంపై ప్రత్యేక శ్రద్ధ వహించారు. మంగళవారం కూడా ఈ కార్యక్రమంపై ఆయా శాఖల అధికారులతో కలెక్టరేట్‌లో సమీక్షించారు.
ఏయే పనులు చేస్తున్నారంటే..
ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలు రోజూ ఈ జలధార పనుల్ని చేస్తున్నారు. చిన్నపాటి చెరువుల పునరుద్ధరణ, మరమ్మతులు, చెరువుల కాలువల్ని శుభ్రం చేయడం.. కట్టల్ని బలోపేతం చేయడం, కాలువలతో పాటు పైభాగపు నీటి వనరులతో అనుసంధానం చేయడం, వర్షపు నీటిని చెరువుల్లోకి మళ్లించే చర్యలు.. పచ్చదనం పెంపు,. కొత్తగా నీటి సంరక్షణా నిర్మాణాలు చేపట్టడం.. వంటి పనుల్ని జోరుగా చేస్తున్నారు.
భూగర్భ జలాల స్థాయి పెంపు
జిల్లాలో గత ఆరు నెలల్లో భూగర్భజలాలు సుమారు ఆరు మీటర్ల వరకు తగ్గిపోయాయి. వేసవి దృష్ట్యా మరింత అడుగున చేరే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో జలహారతి కార్యక్రమం ద్వారా భూగర్భ జలాల స్థాయిని పెంచడమే లక్ష్యంగా పనులు చేస్తున్నారు. భూగర్భ జల మట్టాన్ని 3-6 మీటర్ల మధ్యకు తీసుకురావడం... 15 మీటర్ల కంటే ఎక్కువ లోతున్న మండలాలకు ప్రాధాన్యమివ్వడం... కనీసం ఒక మీటరు వరకు భూగర్భజల స్థాయి పెరిగేలా చర్యలు చేపట్టడం... ఈ కార్యక్రమ లక్ష్యాలు.
పనుల తీరు ఇలా
జిల్లాలోని 27 మండలాల్లో (చిత్తూరు అర్బన్ కాకుండా) 1454 పనుల్ని గుర్తించారు. వీటిలో 996 పనుల్ని మంజూరు చేశారు. 589 పనులు ఇంకా ప్రారంభం కాలేదు. 395 ప్రారంభ దశలో ఉన్నాయి. ఇప్పటికి 4 పనులు పూర్తయ్యాయి. అత్యధికంగా గంగవరంలో 164, పెద్దపంజాణిలో 156 గుర్తించగా.. 60, 41 పనుల్ని అనుమతులు మంజూరయ్యాయి. విజయపురం, పులిచెర్ల, వి.కోట, కార్వేటినగరం మండలాల్లో ఒక్కోటి చొప్పున పనులు మంజూరయ్యాయి. బైరెడ్డిపల్లె, గుడుపల్లె, శాంతిపురం మండలాల్లో మంజూరైన పనులు చాలావరకు ప్రారంభం కాలేదు.