Share News

Crime: 62గ్రాముల ఎండీఎంఏ డ్రగ్‌ స్వాధీనం

ABN , Publish Date - Jul 11 , 2026 | 01:35 AM

రేణిగుంటలో డ్రగ్స్‌ విక్రయ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. బెంగళూరు నుంచి ఎండీఎంఏ డ్రగ్స్‌ను తీసుకొచ్చి తిరుపతి, రేణిగుంట ప్రాంతాల్లో విక్రయిస్తున్న ముగ్గురిని అరెస్టు చేశారు.

Crime: 62గ్రాముల ఎండీఎంఏ డ్రగ్‌ స్వాధీనం
నిందితులను అరెస్టు చూపుతున్న పోలీసులు - స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్లు, వేయింగ్‌ మెషిన్లు, డ్రగ్‌ ప్యాకెట్లు

రేణిగుంట, జూలై 10 (ఆంధ్రజ్యోతి): రేణిగుంటలో డ్రగ్స్‌ విక్రయ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. బెంగళూరు నుంచి ఎండీఎంఏ డ్రగ్స్‌ను తీసుకొచ్చి తిరుపతి, రేణిగుంట ప్రాంతాల్లో విక్రయిస్తున్న ముగ్గురిని అరెస్టు చేశారు. వారి నుంచి రూ.3లక్షల విలువైన 62 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్‌ను స్వాధీ నం చేసుకున్నారు. డీఎస్పీ శ్రీనివాసరావు శుక్రవారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాలతో గంజా యి నియంత్రణలో భాగంగా రేణిగుంట అర్బన్‌ సీఐ జయచంద్ర నేతృత్వంలో ప్రత్యేక బృందం నిఘాచర్యలు చేపట్టింది.ఈనెల 9న రేణిగుం ట రైల్వేస్టేషను వద్ద ఖాళీ పార్కింగ్‌ ప్రదేశంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుంది. తనిఖీ చేయగా ఎండీఎంఏ డ్రగ్స్‌ ఉన్నట్టు గుర్తించారు. డ్రగ్‌తోపాటు సెల్‌ఫోన్లు, వేయింగ్‌ మెషిన్లు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్‌ను బెంగళూరు నుంచి తీసుకొచ్చి.. తిరుపతి, పరిసర ప్రాంతాల్లో యువతకు 5గ్రాములను రూ.5వేలకు విక్రయిస్తున్నట్టు విచారణలో తేలింది. నిందితులపై ఎన్‌డీపీఎ్‌స చట్టం-1985 కింద అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. అరెస్టు అయిన వారిలో.. తిరుపతి కొర్లగుంటకు చెందిన గుణశేఖర్‌, టీటీడీ ఉద్యోగి రాహుల్‌యాదవ్‌, శెట్టిపల్లెకు చెందిన అశ్వినీకుమార్‌ ఉన్నారు.కాగా నిందితుల అరెస్టు విషయం తెలుసుకున్న తిరుపతికి చెందిన ఓ పార్టీకి చెందిన వ్యక్తులు పోలీసు స్టేషన్‌కు చేరుకున్నారు. నిందితుల పేర్లు వెల్లడికాకుండా చూసేందుకు యత్నించారు.

Updated Date - Jul 11 , 2026 | 01:35 AM