Chittoor Road Accident: స్కూల్ బస్సును ఢీకొట్టిన లారీ.. 9 మందికి గాయాలు..
ABN , Publish Date - Jan 08 , 2026 | 09:52 AM
గంగవరం మండలం పొన్న మాకులపల్లి వద్ద స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. కిండర్ కేర్ దివ్యాంగుల ట్రస్ట్ పాఠశాల బస్సును.. ఓ లారీ వెనుక నుంచి ఢీ కొట్టింది..
చిత్తూరు జిల్లాలోని పలమనేరు సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గంగవరం మండలం పొన్న మాకులపల్లి వద్ద స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. కిండర్ కేర్ దివ్యాంగుల ట్రస్ట్ పాఠశాల బస్సును ఓ లారీ వెనుక నుంచి ఢీ కొట్టింది. విద్యార్థులు బెంగుళూరులో వైద్య పరీక్షలు ముగించుకుని స్కూలు బస్సులో తిరుగు ప్రయాణమయ్యారు.
బుధవారం రాత్రి బెంగుళూరు - చెన్నై ఎన్‌హెచ్ 4 జాతీయ రహదారిపై ఈ దారుణం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 11 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. వారిలో 9 మంది విద్యార్థులు గాయపడ్డారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన విద్యార్థులు పలమనేరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆవేదన
స్కూల్ బస్సు ప్రమాదంపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గాయపడిన విద్యార్థులు త్వరగా కోలుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. వైద్య పరీక్షలు చేయించుకుని వస్తుండగా దుర్ఘటన జరగడం బాధాకరమన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. దుర్ఘటనతో బాధపడుతున్న కుటుంబాలకు సానుభూతి తెలిపారు.
ఇవి కూడా చదవండి
సంక్రాంతికి ఊరెళ్తున్నారా.. ముందస్తు జాగ్రత్తలు తీసుకోండి..
ఏపీఎస్ ఆర్టీసీలో మోగనున్న సమ్మె సైరన్..