‘చింత’ తీరేలా!
ABN , Publish Date - Nov 01 , 2026 | 04:02 AM
గోదావరి నదిపై ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో నిర్మించ తలపెట్టిన చింతలపూడి ఎత్తిపోతల పథకానికి జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్జీటీ) పచ్చజెండా ఊపింది.
చింతలపూడి ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు
సీఎం చంద్రబాబు పట్టుదలతో ప్రాజెక్టుకు ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్
పనులు చేపట్టేందుకు సిద్ధమైన జల వనరుల శాఖ
జగన్ హయాంలో అటకెక్కిన వైనం
అమరావతి, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి): గోదావరి నదిపై ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో నిర్మించ తలపెట్టిన చింతలపూడి ఎత్తిపోతల పథకానికి జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్జీటీ) పచ్చజెండా ఊపింది. ఒకవైపు న్యాయ పోరాటం, మరోవైపు కేంద్ర ప్రభుత్వంపై సీఎం చంద్రబాబు ఒత్తిడి చేయడంతో ఎట్టకేలకు చింతలపూడి ప్రాజెక్టుకు ఎన్జీటీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం. సుప్రీంకోర్టులోనూ రాష్ట్ర ప్రభుత్వానికి సానుకూలంగా తీర్పువచ్చింది. ఈ పథకానికి అటవీ పర్యావరణ అనుమతులు ఇవ్వవచ్చంటూ సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.
ఫలితంగా.. చింతలపూడి ప్రాజెక్టుకు శుక్రవారం పర్యావరణ, అటవీ శాఖల అనుమతులు వచ్చాయి. దీంతో.. ఈ ప్రాజెక్టుకు ఏర్పడిన ప్రధాన అడ్డంకులన్నీ తొలగిపోయాయి. చింతలపూడి ప్రాజెక్టు కింద 1,94,254 హెక్టార్లకు 53 టీఎంసీల గోదావరి జలాలను వినియోగించుకునేందుకు రాష్ట్ర జలవనరుల శాఖ సిద్ధమైంది. కొవ్వాడ కాలువ ఆనకట్ట ద్వారా 6,880 హెక్టార్లకు, ఎర్రకాలువ ఆయకట్టులోని 9,713 హెక్టార్లుకు, తమ్మిలేరు పరిధిలోని 11,796 హెక్టార్లకు, నాగార్జున సాగర్ ఎడమ కాలువ పరిధిలో 8,498 హెక్టార్లకు, కొత్త ఆయకట్టు కింద 80,939 హెక్టార్లు సాగు నీరు అందించేలా జల వనరుల శాఖ కార్యాచరణను సిద్ధం చేసింది. తూర్పుగోదావరి జిల్లా, తాళ్లపూడి మండలం, తాడిపూడి గ్రామంలో గోదావరి నదిపై చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని రూ.8,075.17 కోట్లతో చేపట్టాలని వాటర్ మ్యాన్‌గా గుర్తింపు పొందిన సీఎం చంద్రబాబు గతంలోనే నిర్ణయించారు.
ఈ పథకాన్ని పూర్తిచేస్తే 80,939 హెక్టార్లను కొత్తగా ఆయకట్టు పరిధిలోకి తీసుకురావచ్చని భావించారు. అలాగే, 94,986 హెక్టార్లను స్థిరీకరించవచ్చని, మొత్తానికి 1,94,254 హెక్టార్లకు సాగునీరు అందించవచ్చని అంచనా వేశారు. సాగునీటితో పాటు 26 లక్షల మందికి తాగునీటిని కూడా సరఫరా చేయవచ్చని భావించారు. కాగా, రాయలసీమ బిడ్డనని చెప్పుకొనే వైసీసీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి తన హయాంలో చింతలపూడి పథకాన్ని పూర్తిగా అటకెక్కించారు. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ విధించిన ‘స్టే’ను ఎత్తివేయించేందుకు ప్రయత్నం చేయలేదు. న్యాయస్థానంలోనూ బలమైన వాదనలు వినిపించలేదు.
సాగునీటికి మహర్దశ!
‘‘కూటమి ప్రభుత్వం వచ్చాక సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్‌తో చింతలపూడి ఎత్తిపోతల పథకానికి మహర్దశ వచ్చింది. ఈ పథకం పూర్తయితే.. గోదావరి, కృష్ణా డెల్టా రైతాంగానికి ప్రయోజనం ఉంటుంది. ఖరీఫ్‌లో ముందస్తుగానే పంటలు వేసుకునే వీలు కలుగుతుంది.’’
- ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు, సాగునీటి వినియోగదారుల సమాఖ్య అధ్యక్షుడు.
ఈ వార్తలనూ చదవండి:
ఏపీకి మరో పెను తుఫాన్ ముప్పు.. ఆ జిల్లాలకు అలర్ట్..
జగన్ అక్రమాస్తుల కేసుల్లో కీలక మలుపు..!