నేడు విజయవాడలో ‘పేదలకు పట్టాభిషేకం’
ABN , Publish Date - Sep 30 , 2026 | 04:04 AM
నిరుపేదల సొంతింటి కల సాకారం చేసే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఉమ్మడి కృష్ణాజిల్లాలో దాదాపు 24 వేల కుటుంబాలకు ఇళ్లపై సంపూర్ణ హక్కులు కల్పిస్తూ సీఎం చంద్రబాబు బుధవారం పట్టాలు పంపిణీ చేయనున్నారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో రూ.24,297 కోట్ల విలువైన స్థలాల క్రమబద్ధీకరణ
24,057 కుటుంబాలకు పట్టాలు పంపిణీ చేయనున్న సీఎం చంద్రబాబు
విజయవాడ, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): నిరుపేదల సొంతింటి కల సాకారం చేసే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఉమ్మడి కృష్ణాజిల్లాలో దాదాపు 24 వేల కుటుంబాలకు ఇళ్లపై సంపూర్ణ హక్కులు కల్పిస్తూ సీఎం చంద్రబాబు బుధవారం పట్టాలు పంపిణీ చేయనున్నారు. విజయవాడ నగరంతో పాటు ఎన్టీఆర్ జిల్లా గ్రామీణ ప్రాంతాలు, కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలో అపరిష్కృతంగా ఉన్న పేదల నివాస స్థలాలను క్రమబద్ధీకరించనున్నారు. పేదలు నివసిస్తున్న భూమిపై వారికి సర్వ హక్కులు కల్పించేలా మంజూరు చేసిన నిరంభ్యంత ర పట్టాలను సీఎం చేతుల మీదుగా లబ్ధిదారులకు అందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇటీవల విశాఖ లో భారీసంఖ్యలో పేదలకు ఇళ్ల పట్టాలను అందజేసిన విషయం తెలిసిందే. అదేస్థాయిలో విజయవాడలోనూ కార్యక్రమం నిర్వహించనున్నారు. సింగ్‌నగర్‌లోని ఎంబీవీ కే స్టేడియం వేదికగా జరిగే ఈ కార్యక్రమంలో మొత్తం 24,057 మంది నిరుపేదలు సుమారు రూ.24,297 కోట్ల విలువైన నివేశన స్థలాలపై సర్వహక్కులు పొందనున్నారు.
దీనికోసం ప్రభుత్వం జీవో 615 జారీ చేసింది. జీవో 30, జీవో 306 ద్వారా ఆక్షేపణ లేని ప్రభుత్వ పోరంబోకు భూముల్లో ఉంటున్న వారి స్థలాలను క్రమబద్ధీకరించింది. దీంతో జిల్లావ్యాప్తంగా 617 ఎకరాల పరిధిలోని 29.86 లక్షల చదరపు గజాల్లో ఇళ్ల పట్టాల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. ఒక్కో కుటుంబానికి రూ.40లక్షల నుంచి రూ.45 లక్షల వరకు లబ్ధి చేకూరనుందని అంచనా వేస్తున్నారు. విజయవాడ నగరంలోని కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి ప్రభుత్వం శాశ్వత పట్టాలు మంజూరు చేస్తోంది. అత్యధికంగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 7,990 కుటుంబాలకు, ‘పశ్చిమ’లో 7,465, ‘సెంట్రల్’ 5,815, జగ్గయ్యపేట 1,135, మైలవరం 981, గన్నవరం 602, నందిగామ 54, తిరువూరులో 15 చొప్పున కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది.
బుధవారం మధ్యాహ్నం 2గంటలకు సింగ్‌నగర్‌లోని ఎంబీవీకే స్టేడియంలో ప్రారంభమయ్యే సభకు సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. ఈ బహిరంగ సభకు 25 వేల మందికి పైగా హాజరవుతారన్న అంచనాలతో అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. లబ్ధిదారులు సభా ప్రాంగణానికి చేరుకునేందుకు సన్నాహాలు చేశారు.
ఈ వార్తలనూ చదవండి..
హై బీమ్ ఎల్‌ఈడీ లైట్లతో అగచాట్లు
వేర్వేరు ఘటనల్లో ఐదుగురి బలవన్మరణం