భగవద్గీతను అందించిన జగద్గురువు.. శ్రీకృష్ణుడు: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Sep 04 , 2026 | 09:43 AM
అధర్మాన్ని అడ్డుకోవడానికి శ్రీ మహావిష్ణువు ఎత్తిన మరో అవతారం శ్రీకృష్ణావతారమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా తెలుగు ప్రజలందరికీ ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కురుక్షేత్ర మహా సంగ్రామంలో అర్జునుడికి కర్తవ్యబోధ చేసి, భగవద్గీతను అందించిన జగద్గురువు శ్రీకృష్ణుడని కొనియాడారు.
అమరావతి, సెప్టెంబర్ 4: శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణుడి అవతార విశిష్టత, ఆయన బోధనల గొప్పతనాన్ని గుర్తుచేశారు. అధర్మాన్ని అడ్డుకుని ధర్మాన్ని పరిరక్షించేందుకు శ్రీ మహావిష్ణువు ఎత్తిన మరో అవతారం శ్రీకృష్ణావతారం అని పేర్కొన్నారు. ప్రపంచ మానవాళికి మార్గదర్శకంగా నిలిచే భగవద్గీతను అందించిన జగద్గురువు శ్రీకృష్ణుడని సీఎం కొనియాడారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చేసిన బోధనలు నేటికీ సమాజానికి, ప్రతి వ్యక్తి జీవితానికి ఎంతో విలువైన మార్గదర్శకత్వాన్ని అందిస్తున్నాయని పేర్కొన్నారు.
శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రతి ఇంటా ఆనందం, సంతోషం, శాంతి వెల్లివిరియాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. ప్రతి కుటుంబానికీ శ్రీకృష్ణుడి ఆశీస్సులు, రక్ష ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. శ్రీకృష్ణుడి జీవిత సందేశం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని ఆయన చూపిన మార్గం సమాజానికి ఎప్పటికీ ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణ జన్మాష్టమిని వేడుకగా జరుపుకోవాలని.. పండుగ స్ఫూర్తిని కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా పంచుకోవాలని ప్రజలను ఆకాంక్షించారు.
శ్రీకృష్ణ జన్మాష్టమి.. ధర్మ సంస్థాపనకు దివ్య సందేశం: మంత్రి నారా లోకేశ్
శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు ప్రజలందరికీ మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. ధర్మ సంస్థాపన కోసం శ్రీకృష్ణ పరమాత్ముడు అవతరించిన పర్వదినమే శ్రీకృష్ణ జన్మాష్టమి అని చెప్పారు. లోకకల్యాణం కోసం దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకు శ్రీకృష్ణుడు అవతరించాడని పురాణాలు చెబుతున్నాయి. భగవంతుడి జన్మదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. శ్రీకృష్ణుడి అవతారం.. మానవాళికి ధర్మం, కర్తవ్యం, సత్యం, న్యాయం, భక్తి, జ్ఞానం వంటి విలువలను బోధించింది. కురుక్షేత్ర యుద్ధభూమిలో అర్జునుడికి శ్రీకృష్ణుడు అందించిన భగవద్గీత సందేశం యుగయుగాలుగా మానవాళికి మార్గదర్శి అని నారా లోకేశ్ అన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
గాల్లోకి ఎగిరిన పవర్‌బోట్.. వీడియో వైరల్
పరిగెత్తండి.. తినండి.. పరిగెత్తండి.. విశ్వవిద్యాలయంలో వినూత్న ఛాలెంజ్