Share News

తెల్లవార్లూ టెలీకాన్ఫరెన్స్‌లు

ABN , Publish Date - Oct 29 , 2026 | 06:30 AM

ఆర్నబ్‌ అతి తీవ్ర తుఫాన్‌ ప్రభావంపై మంగళవారం పగలు, రాత్రి సమీక్షలు నిర్వహించిన సీఎం చంద్రబాబు.. అర్ధరాత్రి దాటాక కూడా తుఫాన్‌ ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్‌లు నిర్వహించారు.

తెల్లవార్లూ టెలీకాన్ఫరెన్స్‌లు

  • మంగళవారం రాత్రి, అర్ధరాత్రి దాటాక, బుధవారం.. తుఫాన్‌ ప్రభావంపై నిరంతరం సీఎం సమీక్షలు

  • రాత్రంతా కష్టపడి పనిచేశారని ఉద్యోగులకు అభినందనలు

అమరావతి, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): ఆర్నబ్‌ అతి తీవ్ర తుఫాన్‌ ప్రభావంపై మంగళవారం పగలు, రాత్రి సమీక్షలు నిర్వహించిన సీఎం చంద్రబాబు.. అర్ధరాత్రి దాటాక కూడా తుఫాన్‌ ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్‌లు నిర్వహించారు. అక్కడి పరిస్థితిని సమీక్షించారు. ఆ తర్వాత కూడా ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ తీసుకుంటూ అధికారులకు దిశానిర్దేశం చేశారు. బుధవారం ఉదయం 6.15 గంటలకు క్యాంప్‌ కార్యాలయం నుంచి మళ్లీ కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మధ్యాహ్నం రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్‌ నుంచి మరోసారి టెలీకాన్ఫరెన్స్‌ జరిపారు. ఎప్పటికప్పుడు తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో జరుగుతున్న సహాయక చర్యలను తెలుసుకున్నారు. చాలా చోట్ల చెట్లు పడిపోయాయని, కొన్ని చోట్ల విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు.

ప్రభావిత ప్రాంతాల్లో ముందు జాగ్రత్తగా విద్యుత్‌ సరఫరా నిలిపివేశామని వివరించారు. పడిపోయిన చెట్లను వెంటనే తొలగించాలని, తీవ్రత తగ్గాక విద్యుత్‌ పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. చెరువులు, వాగులు, కాలువలు, వంకలు, గెడ్డలు పొంగిపొర్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్దేశించారు. జిల్లాల వారీగా తాము చేపడుతున్న సహాయక చర్యలను ఆయా కలెక్టర్లు వివరించారు. వర్షం తగ్గుముఖం పట్టినా ఈదురుగాలులు వీస్తున్నాయని కోనసీమ కలెక్టర్‌ తెలిపారు.


ప్రజలకు భరోసా ఇవ్వాలి

రాష్ట్ర స్థాయి, జిల్లా అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది వరకు ఒకేసారి 32 వేలమందితో సీఎం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బంది పడకుండా అధికారులు, ఉద్యోగులు, క్షేత్రస్థాయి సిబ్బంది అంతా రాత్రంతా అద్భుతంగా పని చేశారని ప్రశంసించారు. అధికార యంత్రాంగానికి అభినందనలు తెలిపారు. తుఫాన్‌ ప్రభావం తగ్గి సాధారణ పరిస్థితులు నెలకొనేంత వరకు ఇదే స్ఫూర్తితో పని చేయాలని సీఎం సూచించారు. తుఫాన్‌ కారణంగా ప్రాణ నష్టం సంభవించిందా అని అధికారులను ఆరా తీశారు. ఆస్తి నష్టం వీలైనంత మేర తగ్గించేందుకు కృషి చేయాలన్నారు. ప్రభావిత ప్రాంతాల్లో వీలైనంత త్వరగా సాధారణ పరిస్థితులు నెలకొనేలా చూడాలని కలెక్టర్లకు సూచించారు.

సురక్షితంగా ఉన్నామనే భరోసాను ప్రజలకు కలిగించాలన్నారు. సమస్యలను ప్రజలే ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు ఏర్పాటు చేసిన ‘మనమిత్ర’ యాప్‌ను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. ప్రభుత్వం దృష్టికి వచ్చిన క్షేత్రస్థాయి సమస్యలను పరిష్కరించాక ఆ విషయాన్ని ఫిర్యాదుదారులకు చెప్పాలన్నారు. వివిధ జిల్లాల్లో వర్షం తగ్గుముఖం పట్టినా ఈదురుగాలులు వీస్తున్నాయని పలువురు కలెక్టర్లు తెలిపారు. ప్రభావిత ప్రాంతాల్లో మైనర్‌ ఇరిగేషన్‌ చెరువుల పరిస్థితిని సీఎం ఆరా తీశారు. చెరువులు, కాలువలకు గండ్లు పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సాగునీటి సంఘాలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. కొన్ని చెరువులకు వస్తున్న ఇన్‌ఫ్లోలను గమనిస్తూనే చెరువులు పొంగి పొర్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. స్థానికంగా ఉన్న వారిని అప్రమత్తం చేయాలని సూచించారు.


ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బలగాలను సిద్ధంగా ఉంచుకుని, వారి సేవల్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలన్నారు. తుఫాన్‌ షెల్టర్లలో ఆశ్రయం పొందుతున్న వారికి ఆహారం, తాగునీరు, వైద్య సదుపాయాలకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని, పూర్తి స్థాయిలో పరిస్థితి కుదుటపడ్డాకే వారిని ఇళ్లకు పంపాలని కలెక్టర్లకు స్పష్టంచేశారు. పంటనష్టంపై సీఎం ఆరా తీశారు. పొలాల్లోకి నీరు చేరకుండా, ఉద్యాన పంటలకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పంట నష్టంపై ప్రాథమిక అంచనాలు తయారు చేయాలని ఆదేశించారు. ఆర్నబ్‌ తుఫాన్‌ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్రానికి వివరించాలని ఉన్నతాధికారులకు సూచించారు.

ఆర్టీజీఎస్‌ నుంచి క్షేత్రస్థాయిలో సీఎం పరిశీలన

బుధవారం ఉదయం రాష్ట్ర సచివాలయానికి చేరుకున్న సీఎం చంద్రబాబు.. రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ సొసైటీ (ఆర్టీజీఎస్‌) సెంటర్‌ నుంచి తుఫాన్‌ ప్రభావిత జిల్లాల్లోని పరిస్థితిని పరిశీలించారు. తుఫాన్‌ సహాయక చర్యలు, విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ, రహదారులపై కూలిన చెట్ల తొలగింపుపై అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మరోసారి ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈదురుగాలులకు వివిధ ప్రాంతాల్లో చెట్లు కూలిపోవడంతో ఎక్కడైనా ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తాయా అని అధికారులను సీఎం అడిగి తెలుసుకున్నారు.


తుఫాన్‌ హెచ్చరికలు వచ్చినప్పటి నుంచి ఆర్టీజీఎస్‌ నుంచి నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు ఐటీ సెక్రటరీ భాస్కర్‌ కాటంనేని వివరించారు. మనమిత్ర యాప్‌ ద్వారా వచ్చిన ఫిర్యాదులను సంబంధిత అధికారులకు చేరవేయడంతో పాటు సమస్యలను వెంటనే పరిష్కరిస్తున్నట్లు సీఎంకు వివరించారు. జిల్లాల వారీగా పరిస్థితులను, గత 24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలను వెల్లడించారు. జాతీయ రహదారి-16పై కూలిన చెట్లను వెంటనే తొలగించినట్లు తెలిపారు. వివిధ ప్రాంతాల్లో కూలిన చెట్లను మధ్యాహ్నం 3గంటలకు పూర్తిగా తొలగించినట్టు తెలిపారు.

కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లాలు మినహా మిగతా ప్రభావిత జిల్లాల్లో పరిస్థితులు క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయని చెప్పారు. దీనిపై సీఎం మాట్లాడుతూ తుఫాన్‌ సహాయక చర్యలు, విద్యుత్‌ పునరుద్ధరణ పనుల కోసం ఏపీసీపీడీసీఎల్‌ నుంచి కూడా సిబ్బందిని పంపాలని సూచించారు. పశ్చిమగోదావరి, కోనసీమ జిల్లాల్లో విద్యుత్‌ సరఫరా వేగవంతం చేయాలని ఆదేశించారు. కూలిన చెట్లను తొలగించి సాయంత్రానికి అన్ని జిల్లాల్లో రహదారులను పూర్తిగా క్లియర్‌ చేయాలని సూచించారు.

టెక్నాలజీతో నష్టాన్ని తగ్గించగలుతున్నాం

విపత్తుల సమయంలో క్షేత్రస్థాయి సమాచారం ఆధారంగా తక్షణ నిర్ణయాలు తీసుకుని సమర్థంగా అమలు చేయాలని సీఎం అన్నారు. టెక్నాలజీని వినియోగించుకోవడం ద్వారా నష్టాన్ని తగ్గించగలుగుతున్నామన్నారు. అన్ని స్థాయిలో అధికారులు ఒకే విధమైన ఆలోచనతో పని చేస్తూ, అందుబాటులో ఉన్న డేటాను విశ్లేషించి, నిర్ణయాలు తీసుకోవాలని చంద్రబాబు సూచించారు.

ఈ వార్తలనూ చదవండి:

పోటాపోటీ

ఆర్నబ్ తుఫాన్ బాధితులకు సీఎం చంద్రబాబు భారీ ఊరట

Updated Date - Oct 29 , 2026 | 06:30 AM