Share News

జగన్‌ క్రిమినల్‌ లిటిగెంట్‌!

ABN , Publish Date - Oct 22 , 2026 | 05:55 AM

జగన్‌ లాంటి క్రిమినల్‌ లిటిగెంట్స్‌ రాజకీయాల్లో ఉంటే ప్రమాదకరమని సీఎం చంద్రబాబు అన్నారు. తానే విధ్వంసానికి దిగి.. తానే కోర్టుకు వెళ్లడమనే ఆలోచనలు ఆయనలాంటి వారికే వస్తాయని ధ్వజమెత్తారు.

జగన్‌ క్రిమినల్‌ లిటిగెంట్‌!

  • కోర్టు తీర్పులనూ వక్రీకరిస్తూ కుట్రలు: సీఎం

  • ఇలాంటి వారు రాజకీయాల్లో ఉంటే ప్రమాదం

  • ‘చెప్పాం.. చేస్తున్నాం..’ స్థానికంలో ఇదే మన నినాదం

  • టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్‌లో బాబు

అమరావతి, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): జగన్‌ లాంటి క్రిమినల్‌ లిటిగెంట్స్‌ రాజకీయాల్లో ఉంటే ప్రమాదకరమని సీఎం చంద్రబాబు అన్నారు. తానే విధ్వంసానికి దిగి.. తానే కోర్టుకు వెళ్లడమనే ఆలోచనలు ఆయనలాంటి వారికే వస్తాయని ధ్వజమెత్తారు. కోర్టు తీర్పులను కూడా వక్రీకరించేలా గొడ్డలి పార్టీ కుట్రలు పన్నుతోందని మండిపడ్డారు. ‘చెప్పాం... చేస్తున్నాం’ ..స్థానిక ఎన్నికల్లో కూటమి నినాదం ఇదేనని స్పష్టంచేశారు. స్థానిక సంస్థల ఎన్నికలపై టీడీపీ నేతలకు దిశానిర్దేశం చేసేందుకు మంగళ, బుధవారాల్లో ఆయన టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పును వైసీపీ వక్రీకరిస్తోందని ఆక్షేపించారు.

క్రిమినల్‌ లిటిగెంట్లు రాజకీయాల్లో ఉంటే పరిస్థితి ప్రమాదకరంగా మారుతుందని.. అభివృద్ధికి, సంక్షేమానికి అడ్డంకులు కల్పిస్తారని అన్నారు. అలాంటి వారిని ప్రోత్సహించవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపే ధ్యేయంగా పని చేయాలని టీడీపీ శ్రేణులను ఆదేశించారు. జనసేన, బీజేపీతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలన్నారు. కూటమి పార్టీలు స్థానిక ఎన్నికల ద్వారా మరోసారి ప్రజల ఆశీర్వాదాన్ని పొందాలని సూచించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని గుర్తుచేశారు. చంద్రబాబు ఇంకా ఏం చెప్పారంటే..


ప్రతిదీ సీరియస్‌గా తీసుకోవాలి..

అభ్యర్థుల ఎంపిక మొదలుకొని.. ఫలితాల వరకు ప్రతి అంశాన్నీ సీరియస్‌గా తీసుకోవాలి. కూటమి నుంచి మంచి అభ్యర్థులను ఎంపిక చేస్తున్నాం.. పార్టీ కోసం కష్టపడిన వారికి ప్రాధాన్యమిస్తున్నాం. గొడ్డలి పార్టీ విధ్వంసకారులను అభ్యర్థులుగా బరిలోకి దించుతోంది. లిటిగెంట్లతో అభివృద్ధిని, ఎన్నికలను అడ్డుకోవడమే పనిగా పెట్టుకుంది. ‘సర్‌’పై విమర్శలు చేశారు.. ఆ ప్రక్రియపై నమ్మకం లేదన్నారు.. మరోవైపు సర్‌ జాబితా వచ్చే వరకు స్థానిక ఎన్నికలు జరపొద్దని కోర్టును ఆశ్రయించారు. ఓటర్ల జాబితాపైనా వెళ్లారు.. బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్నారు.. ఇలా సుమారు 60 పిటిషన్లు హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో వేశారు.

నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు మెగా డీఎస్సీ రిక్రూట్‌మెంట్‌ చేపడితే.. దానిని అడ్డుకునేందుకు 300 పిటిషన్లు వేశారు. అమరావతి, పోలవరం వంటి ప్రాజెక్టులను అడ్డుకోవడానికి గొడ్డలి పార్టీ నేతలు కోర్టులకెళ్లారు.. లేఖలు రాశారు. స్థానిక ఎన్నికలు జరుగుతుంటే.. మనం మంచి అభ్యర్థుల ఎంపికపై బిజీగా ఉంటే.. ఆ పార్టీ అధ్యక్షుడు బెంగళూరులో కూర్చుని విధ్వంస రచన చేస్తున్నారు. ఏయే మున్సిపాల్టీల్లో ఏయే అభ్యర్థులను నియమించాలని మనం కసరత్తు చేస్తుంటే.. ఏయే ప్రాంతాల్లోకి ఏ రాష్ట్రం నుంచి గూండాలను దించాలో జగన్‌ కుట్రలు పన్నుతున్నారు. విధ్వంసాలను అడ్డుకుంటే.. కోర్టులకెళ్లి ఎన్నికలను ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేని వాళ్ల ఆలోచనలు ఇదేవిధంగా ఉంటాయి.


మిత్రధర్మం పాటించాలి..

స్థానిక ఎన్నికల్లో టికెట్లు దక్కని ఆశావహులకు నామినేటెడ్‌ పదవుల్లో అవకాశం ఇస్తాం. రెబల్స్‌ వేసిన నామినేషన్లను విత్‌డ్రా చేయించాలి. విత్‌డ్రా చేసుకోకుంటే వారిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తాం. జనసేన, బీజేపీ అధికారిక అభ్యర్థులున్న చోట కూడా టీడీపీ రెబల్స్‌ ఉండకుండా చూసుకోవాలి. మిత్రధర్మాన్ని పాటించాలి. క్షేత్రస్థాయిలో సీట్ల సర్దుబాటు సాఫీగా జరిగేలా చూడండి. కూటమి నుంచి సీట్లు కేటాయించిన వారిని గెలిపించాల్సిందే. మూడు పార్టీలూ కూటమిగా కలిసి పోటీ చేస్తున్నప్పుడు స్వతంత్రంగా వేయడం సరికాదు. మిత్రపక్షాలతో సమన్వయం చేసుకుని, బలాబలాలను చూసుకుని, సమర్థులను ఎంపిక చేయాలి. ఇంటింటి ప్రచారం చేపట్టాలి. బూత్‌ స్థాయి వరకు చేసిన అభివృద్థి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలి. నిరంతరం సేవ చేస్తూ ఉంటేనే లీడర్లు అవుతారు.

కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, జడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచ్‌లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఎన్నికలు జరగని మున్సిపాలిటీలకు కూడా త్వరలో జరుగుతాయి. అన్నింటిలో సార్వత్రిక ఎన్నికల్లో వచ్చిన స్ట్రయిక్‌ రేట్‌ కంటే మెరుగ్గా రావాలి. 11 కార్పొరేషన్లు 11 సామాజికవర్గాలకు కేటాయించాం. అన్ని కులాలను రాజ్యాధికారంలో భాగం చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నాం. ప్రజలు ఆమోదించిన వారిని, గుర్తింపు ఉన్నవారినే ఎంపిక చేయాలి. గ్రామాల్లో మంచి నేతలు లేకపోతే.. పార్టీ బలహీనపడుతుంది. సమర్థులను నియమించుకుంటే పటిష్ఠంగా ఉంటుంది. కార్యకర్తలకు.. పార్టీ కోసం పనిచేసిన వారికి పదవులు ఇచ్చేందుకు స్థానిక ఎన్నికలు మంచి అవకాశం. సమీకరణలు, పొత్తుల్లో భాగంగా ఎవరికైనా సీట్లు ఇవ్వలేకపోతే.. వారికి నామినేటెడ్‌ పదవుల్లో స్థానం కల్పిస్తాం.


వికృత మనస్తత్వం కలిగిన వ్యక్తితో రాజకీయం చేయాల్సి వస్తోంది. ఇలాంటివారిని రాజకీయాలకు దూరంగా ఉంచాలి. గొడ్డలి పార్టీని దూరంగా ఉంచాలంటే.. ప్రజలకు మనం చేసిన మంచిని నిరంతరం చెప్పడంతోపాటు.. ఆ పార్టీ అరాచకాలనూ వివరించాలి.

నేను ముఖ్యమంత్రిగానే కాకుండా స్థానిక ఎన్నికలయ్యే వరకూ ఒక పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తా. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా పార్టీ కార్యకర్తలుగానే పని చేయాలి.ప్రచారానికి వారం రోజుల సమయమే ఉంది. అన్ని మున్సిపాలిటీల్లో ప్రచారం చేపట్టాలి. ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయికి వెళ్లండి.. జనంలో ఉంటే మనకు తిరుగుండదు. ఈ నెలంతా మన పనితనానికి పరీక్ష.

- టీడీపీ అధినేత చంద్రబాబు

Updated Date - Oct 22 , 2026 | 05:55 AM