ప్రపంచానికి ఏపీ సత్తా చాటిచెప్పే ప్రాజెక్ట్ ఈ స్టీల్‌ప్లాంట్: చంద్రబాబు
ABN , Publish Date - Mar 23 , 2026 | 06:19 PM
అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో విశాఖ ఉక్కు కంటే అతిపెద్ద ప్లాంట్ రాబోతోందని, ఉత్తరాంధ్రలోని నక్కపల్లిలో సరికొత్త చరిత్ర రాయబోతున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు.
అమరావతి, మార్చి 23: అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో విశాఖ ఉక్కు కంటే అతిపెద్ద ప్లాంట్ రాబోతోందని, ఉత్తరాంధ్రలోని నక్కపల్లిలో సరికొత్త చరిత్ర రాయబోతున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఆర్సెలార్ స్టీల్‌ప్లాంట్ పెట్టుబడి ఓ గొప్ప మలుపు కాబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. సోమవారం ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా ప్లాంట్‌కు భూమి పూజ జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారు. అనంతరం బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ..
‘ప్రపంచానికి ఏపీ సత్తా చాటిచెప్పే ప్రాజెక్ట్ ఈ స్టీల్‌ప్లాంట్. ప్రధాని మోదీ సహకారంతోనే ప్లాంట్ ఏర్పాటు సాధ్యమైంది. స్టీల్‌ప్లాంట్ ఏర్పాటులో మంత్రి లోకేశ్ కృషి ఎంతో ఉంది. అన్నివిధాలా సహకరిస్తున్న పవన్ కల్యాణ్‌కు ధన్యవాదాలు. ప్లాంట్ ఏర్పాటుతో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారబోతున్నాయి. ఇది స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన కాదు.. స్టీల్ సిటీకి ఫౌండేషన్. ఏపీలో అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన అందిస్తున్నాం. కేంద్రం సహకారంతోనే అభివృద్ధి సాధ్యమవుతోంది. ప్లాంట్ ఏర్పాటుతో లక్ష మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయి. ప్రాజెక్టుకు భూములు ఇచ్చిన రైతులకు రుణపడి ఉంటాం. అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుతాం. క్వాంటమ్ వ్యాలీకి కేరాఫ్‌గా అమరావతి మారబోతోంది. ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. విశాఖకు గూగుల్ డేటా సెంటర్ రాబోతోంది’ అని అన్నారు.
సీఎం చంద్రబాబు వల్లే ఏపీకి పెట్టుబడులు: డిప్యూటీ సీఎం పవన్
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ప్లాంట్ ఏర్పాటుతో ఉత్తరాంధ్ర ప్రజలకు అధిక ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఆర్సెలార్ పెట్టుబడులు తమలో విశ్వాసం మరింత పెంచాయని అన్నారు. చంద్రబాబు వంటి దార్శనిక నేత ఉంటేనే పెట్టుబడులు వస్తాయని, చంద్రబాబు వల్లే ఏపీకి పెట్టుబడులు వస్తున్నాయని అమిత్ షా కూడా చెప్పారని పేర్కొన్నారు. అత్యాధునిక సాంకేతికతతో దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ గ్రీన్‌ఫీల్డ్ స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు కాబోతోందని తెలిపారు.
ప్లాంట్ ఏర్పాటుతో ప్రపంచ పటంలో అనకాపల్లి: లోకేశ్
ఏపీలో పెట్టుబడులు పెట్టాలని 2019లోనే ఆదిత్య మిట్టల్‌ను కోరామని మంత్రి నారా లోకేశ్ అన్నారు. 2024లో అధికారంలోకి రాగానే స్టీల్‌ప్లాంట్ కోసం ప్రయత్నాలు చేశామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు గమ్యస్థానమన్నారు. ప్లాంట్ ఏర్పాటుతో ప్రపంచ పటంలో అనకాపల్లి ఉంటుందని వెల్లడించారు. ప్లాంట్ ఏర్పాటుతో లక్ష మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయని తెలిపారు. పెట్టుబడిదారుల్లో సీఎం చంద్రబాబు విశ్వాసం నింపారని, ప్లాంట్‌కు కేంద్రమంత్రి కుమారస్వామి వేగంగా అనుమతులు ఇచ్చారని లోకేశ్ పేర్కొన్నారు.
చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తోనే ఏపీ ప్రజలకు మేలు: కుమారస్వామి
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తోనే ఏపీ ప్రజలకు మేలు జరుగుతుందని కేంద్ర మంత్రి కుమారస్వామి అన్నారు. లోకేశ్ తండ్రికి తగ్గ తనయుడంటూ ప్రశంసించారు. నారా లోకేశ్ మంచి భవిష్యత్తు ఉన్న నాయకుడన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, ఉక్కు రంగంలో అనేక సంస్కరణలు తీసుకొస్తున్నామని తెలిపారు. విశాఖ ఉక్కును ఆర్థికంగా ఆదుకున్నామని వెల్లడించారు.
ఇవి కూడా చదవండి
సీబీఐ పేరుతో మోసం.. రూ.15.45 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ఈ తప్పులు చేయకండి