జంగిల్‌రాజ్ ఎవరిది.. జగన్?
ABN , Publish Date - Nov 01 , 2026 | 04:11 AM
నాడు అధికారంలో ఉన్న ఐదేళ్లూ లెక్కలేనన్ని అరాచకాలు, దౌర్జన్యాలు. చిత్తుచిత్తుగా ఓడిపోయినా ఇప్పుడూ అదే తీరు. నిందితులకు, నేరస్థులకు వత్తాసు. రండి ఎవరొస్తారో చొక్కా మడతపెట్టా అంటూ సవాల్. పార్టీ అధినేత తరహాలోనే నాయకులూ, క్యాడరూ.
జగన్ వైఖరిపై విస్తుపోతున్న ప్రజలు
మీ ప్యాలస్‌కు సమీపంలోనే యువతిపై గ్యాంగ్ రేప్
అక్కను వేధించిన సైకోల చేతిలో బాలుడు బలి
పులివెందులలో దళిత మహిళ రేప్, హత్య
దళితులు, బీసీలు, మైనార్టీలపై దాడులు
కూటమి ప్రభుత్వంలో నిందితులపై కఠిన చర్యలు
(అమరావతి-ఆంధ్రజ్యోతి): నాడు అధికారంలో ఉన్న ఐదేళ్లూ లెక్కలేనన్ని అరాచకాలు, దౌర్జన్యాలు. చిత్తుచిత్తుగా ఓడిపోయినా ఇప్పుడూ అదే తీరు. నిందితులకు, నేరస్థులకు వత్తాసు. రండి ఎవరొస్తారో చొక్కా మడతపెట్టా అంటూ సవాల్. పార్టీ అధినేత తరహాలోనే నాయకులూ, క్యాడరూ. నోరు తెరిస్తే బూతులు. అధికారంలోకి వస్తే రప్పా, రప్పా నరుకుతామంటూ ప్లకార్డుల ప్రదర్శన. చేసేది అరాచకాలు, చెప్పేది నీతులు. వైసీపీ అధినేత జగన్, ఆయన పార్టీ నేతలు, శ్రేణుల వ్యవహార శైలి ఇదీ. ఇలాంటి వ్యక్తి ‘రాష్ట్రంలో జంగిల్ రాజ్, రెడ్ బుక్’ అంటూ ట్వీట్లు చేస్తుండటం చూసి రాష్ట్ర ప్రజలు నవ్వుతున్నారు. గత వైసీపీ పాలనలో జరిగిన అరాచకాలను గుర్తు చేసుకుంటారు. జగన్, ఆయన పార్టీ నేతల వైఖరిని ప్రశ్నిస్తున్నారు.
నాడు ఎన్ని ఘోరాలో
జగన్ హయాంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు కట్టుతప్పాయి. హత్యలు, అత్యాచారాలు, బెదిరింపులు, గంజాయి ఎగుమతి, డ్రగ్స్ దిగుమతి లాంటి నేరాలు ఎన్నో జరిగాయి. రేపల్లెలో అక్కను కాపాడుకోవడం కోసం ఉన్మాదుల చేతిలో బీసీ బాలుడు అమర్నాథ్ గౌడ్ సజీవ దహనమయ్యాడు. గుంటూరులో అప్పటి హోంమంత్రి సుచరిత ఇంటికి సమీపంలో నడిరోడ్డుపై దళిత యువతిని ఆగస్టు 15న చంపారు. అయినా కనీసం నోరు విప్పని చరిత్ర జగన్‌ది. ఆయన సొంత నియోజకవర్గం పులివెందులలో దళిత మహిళను గ్యాంగ్ రేప్ చేసి చంపేస్తే పట్టించుకోలేదు. అక్కడ నిరసన వ్యక్తం చేసిన దళిత మహిళ అనిత(ప్రస్తుత హోంమంత్రి)పై అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
బాపట్ల జిల్లాలో ప్రశ్నించిన ఎస్టీ మహిళపై ట్రాక్టర్‌తో తొక్కించిన రాక్షస మూక ఎవరిది అంటే వైసీపీదే అని ఇప్పటికీ చెబుతారు. మాస్క్ అడిగిన దళిత డాక్టర్ సుధాకర్‌ను పోలీసులతో కొట్టించి బలి తీసుకున్నారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంత్ బాబు తన డ్రైవర్ సుబ్రమణ్యం(ఎస్‌సీ)ను చంపేసి శవాన్ని ఇంటికి పార్శిల్ పంపారు. ఇసుక అక్రమాలను ప్రశ్నించిన దళిత యువకుడికి రాజమహేంద్రవరం పోలీసు స్టేషన్లో శిరోముండనం చేయించారు. అవినీతిని ప్రశ్నించిన నందం సుబ్బయ్య(బీసీ)ను ప్రొద్దుటూరులో కిరాతకంగా కత్తులతో చంపేశారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో ఎస్‌సీలపై 10,377 నేరాలు జరిగాయి. 300మంది బీసీలు హత్యకు గురయ్యారు. ఎస్‌సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై దాడులు కోకొల్లలు. రాజధానికి భూములిచ్చిన పాపానికి అమరావతి రైతులపై 269 కేసులు పెట్టారు. మహిళలని కూడా చూడకుండా ఎన్నో రకాలుగా వేధించారు. అరసవెల్లి, అంతర్వేది తదితర ఎన్నో ఆలయాలకు సైతం రక్షణ లేకుండా పోయింది.
ఇదీ కూటమి పనితీరు
పాలకులు బాధ్యతాయుతంగా పనిచేస్తే ఫలితం ఎలా ఉంటుందో కూటమి ప్రభుత్వంలో పోలీసులు తీసుకొంటున్న చర్యలు గుర్తు చేస్తున్నాయి. రాష్ట్రంలో మహిళలపై నేరాలు జరిగితే పోలీసులు స్పందిస్తున్న తీరు.. నిందితులను అరెస్టు చేస్తున్న వైనం.. ప్రతి చిన్న ఘటనపై ముఖ్యమంత్రి స్పందించడం.. ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి నేరస్థులకు శిక్షలు పడేలా చర్యలు చేపట్టాలంటూ పోలీసు ఉన్నతస్థాయి సమీక్షలో ఆదేశించడం.. పోలీసుల చర్యలకు భయపడి కామాంధులు ఆత్మహత్యలకు పాల్పడటం వంటివి ప్రజలకు భరోసా కల్పిస్తున్నాయి.
రాష్ట్రంలో శాంతిభద్రతలు, ప్రజల ధన, భద్రత, ప్రాణాలకు రక్షణ.. గంజాయి, డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలించడంపై ప్రతి సారీ కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేస్తున్నారు. నేరాలు చేసిన వారిని చట్టపరంగా శిక్షించడంలో ఎలాంటి రాజీ ఉండబోదని, పోలీసుశాఖను ప్రక్షాళన చేసి లా అండ్ ఆర్డర్‌లో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రస్థానంలో నిలబెడతామని పదే పదే చెబుతున్నారు. అందుకు అనుగుణగానే శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల పనితీరులో మార్పు కనిపిస్తోంది. మహిళల రక్షణ కోసం 164 శక్తి బృందాలను ఏర్పాటు చేసి, ఫోన్ కాల్ వచ్చిన పది నిమిషాల్లోనే రక్షించడం వల్ల గృహ హింస తగ్గిందని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా చెబుతున్నారు.
నాడు సీఎం ఇంటి సమీపంలో రేప్
గత ప్రభుత్వంలో జగన్ ప్యాలెస్‌కు సమీపంలో కాబోయే జంట ఇసుక తిన్నెలపై మాట్లాడుకొంటుండగా ముగ్గురు యువతిపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. అందులో ప్రధాన నిందితుడిని అరెస్టు చేసేందుకు ఏళ్లు పట్టింది. పోలీసు సిబ్బంది కొరత ఉందని ఉన్నతాధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఉద్యోగ నియామకాలు చేపట్టకపోగా, మహిళా సంరక్షణ కార్యదర్శుల్నే బలవంతంగా మహిళా పోలీసులుగా మార్చి జగన్ చేతులు దులిపేసుకున్నారు. సొంత సోదరిని కూడా ట్రోల్ చేయించి వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు.
నేడు మహిళల జోలికి వస్తే కటకటాలే
కూటమి ప్రభుత్వంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. ఎక్కడైనా మహిళలపై అఘాయిత్యం జరిగితే 24 గంటల్లోనే సంకెళ్లు వేస్తున్నారు. చీరాలలో ఒక యువతి బహిర్భూమికి వెళ్లి అత్యాచారానికి గురై ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి రేపిస్టులను అరెస్ట్ చేశారు. నంద్యాలలో చిన్నారిని మైనర్లు రేప్ చేసి చంపి కాలువలో పడేసిన ఘటనలో పోలీసులు అందరినీ అరెస్టుచేశారు. ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసేలా హైకోర్టు న్యాయమూర్తులతో అనుమతి తీసుకోవాలని, మహిళలపై నేరాలకు పాల్పడిన వారికి త్వరితగతిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇప్పుడు ఆ దిశగా చర్యలు ఊపందుకున్నాయి.
ఈ వార్తలనూ చదవండి:
ఏపీకి మరో పెను తుఫాన్ ముప్పు.. ఆ జిల్లాలకు అలర్ట్..
జగన్ అక్రమాస్తుల కేసుల్లో కీలక మలుపు..!