‘మనమిత్ర’ అద్భుతం!
ABN , Publish Date - Nov 01 , 2026 | 01:14 AM
అర్నబ్ తుఫాన్ సమయంలో ప్రజల ఇబ్బందులను పరిష్కరించడంలో ‘మనమిత్ర’ వాట్సాప్ గవర్నెన్స్ పనితీరును కేంద్ర బృందం అభినందించింది.
తుఫాన్ సమయంలో ప్రజా సమస్యల స్వీకరణ, రియల్ టైమ్ పరిష్కారం భేష్
ఇది మంచి చొరవ.. ఇతర రాష్ట్రాలకూ ఆదర్శం కావాలి.. కేంద్ర బృందం ప్రశంసలు
అమరావతి, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి): అర్నబ్ తుఫాన్ సమయంలో ప్రజల ఇబ్బందులను పరిష్కరించడంలో ‘మనమిత్ర’ వాట్సాప్ గవర్నెన్స్ పనితీరును కేంద్ర బృందం అభినందించింది. ప్రజలు వారి ప్రాంతాల్లో ఎదుర్కొంటున్న సమస్యలను స్వీకరించి, రియల్ టైమ్‌లో పరిష్కరించడాన్ని ప్రశంసించింది. మంచి చొరవ, ప్రయత్నం చేశారని పేర్కొంది. ఇతర రాష్ట్రాలూ ఇలాంటి విధానం అమలు చేయాలని సూచిస్తామని, దీనిపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపింది.
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన కోసం కేంద్ర హోంమంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి చిత్తరంజన్‌దాస్ నేతృత్వంలో ఏడుగురు సభ్యుల బృందం రాష్ట్రానికి వచ్చింది. ఇందులో భాగంగా శనివారం ఉదయం రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రాన్ని సందర్శించింది. వారికి సీఎస్ సాయిప్రసాద్, ఇతర అధికారులు స్వాగతం పలికారు.
తుఫాన్‌తో 4764 కోట్ల నష్టం
తుఫాన్ నష్టంపై ఆర్టీజీఎస్ కార్యదర్శి కాటంనేని భాస్కర్, సీఈవో ప్రఖర్ జైన్ పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా కేంద్ర బృందానికి వివరించారు. ‘‘తుఫాన్ ప్రభావిత ప్రాంతాల ప్రజలు మనమిత్ర ద్వారా నివేదించిన సమస్యలను క్షేత్రస్థాయి అధికారులకు పంపడం ద్వారా.. 95 శాతానికి పైగా పరిష్కరించాం. ప్రాథమిక అంచనాల ప్రకారం తుఫాన్ వల్ల రాష్ట్రానికి రూ.4,764 కోట్ల మేర నష్టం వాటిల్లింది. 12 జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాలు దారుణంగా నష్టపోయాయి. 4.63 లక్షల మంది రైతులకు చెందిన 3.52 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. 23,383 హెక్టార్లలో ఉద్యానవన పంటలు, 2,491 కిలోమీటర్ల మేర రాష్ట్ర ప్రధాన రహదార్లు దెబ్బతిన్నాయి. విద్యుత్తు రంగానికి భారీగా నష్టం వాటిల్లింది’’ అని వివరించారు. ఆర్టీజీఎస్ నుంచి అనుసరించిన విపత్తుల నిర్వహణ విధానాన్ని కేంద్ర బృందం ఆసక్తిగా పరిశీలించింది. ఈ సందర్భంగా మనమిత్ర గురించి ప్రత్యేకంగా అడిగి తెలుసుకుంది. అనంతరం కేంద్ర బృందాలు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లాయి.
ఈ వార్తలనూ చదవండి:
ఏపీకి మరో పెను తుఫాన్ ముప్పు.. ఆ జిల్లాలకు అలర్ట్..
జగన్ అక్రమాస్తుల కేసుల్లో కీలక మలుపు..!